హరగోపాల్ తెలుగు కవిత: జర...సహీ కరోనా...

By telugu teamFirst Published Mar 28, 2020, 5:07 PM IST
Highlights

కరోనావైరస్ వ్యాప్తి చెందుతూ కోవిడ్ 19 ప్రమాదకరంగా పరిణమించిన నేపథ్యంలో తెలుగు కవులు విరివిగా స్పందిస్తున్నారు. హరగోపాల్ రాసిన తెలుగు కవిత కూడా ఆ కోవలోకే వస్తుంది.

ఎనలేని కష్టం వచ్చినపుడు
ఎట్లుండాలె మనిషి?
నవ్వు మాసిపోనీయకుంట
నిచ్చెం ఎట్లుంటడో అట్లనే వుండాలె

మనుషుల బాధల్ని చూసి
దుకాణం పెట్టుకున్నట్టు 
దోస్తానీని పిరం జేసి అమ్ముకోవద్దు
బుగులువడుతున్న లోకానికి
ధైర్యంకప్పి, ఎల్లదీయాలె నడిమంత్రపు దుక్కం

ఎవనిపాపమైతేంది చుట్టుకున్న
విసపుగాలికి ప్రేమనే గొప్ప విరుగుడు
గుళ్ళు మూతపడ్డయి, బళ్ళు మూతపడ్డయి
నోళ్ళే బజారునపడి, ఆగం చేస్తున్నయి

ఎన్ని సూడలే, ఎన్ని మోయలే
గడ్డిపరకలెక్క వంగితె పోయేదేముంది తుఫానుకింద 
మల్ల మనిషే లేచి నిలబడ్తడు,
రోగం రోగమే, మందు మందే
భయానికి ఎన్నో మాట్లాడుడు బందువెట్టాలె
మనిషికి మనిషిగుణమే మందు

నిజంగ దారి తెలువనపుడు
నిలబడి, తొవ్వ చూసుకునుడే తెలువాలె
పీనుగుల మీద ఈ రాజకీయాల నొల్లేంది?
చావు నిన్నేమన్న పచ్ఛాకంగ సూస్తదా

మనిషి మనిషికి దడికట్టి దాసుకునే యాల్లల
బువ్వ మందే, బట్ట మందే, ఇల్లు మందే
అన్నింటికంటె మనిషి మనిషిలెక్క బాధల్ని ఏదుడు మందే
రూపుకం జెయ్యని దయ్యాలు వేదాలు వల్లిస్తుంటయి
జర విడువు వాటిని, 
తోడున్నానని సాటి మనిషి నిలబడుడే మందు
మహమ్మారిలింతకు ముందు వచ్చినయి పోయినయి
మనిషే గెలిచిండు
మనిషే గెలుస్తడు...

మరింత సాహిత్యం కోసం క్లిక్ చేయండి: https://telugu.asianetnews.com/literature

click me!