తెలుగు సాహిత్యం: అహోబిలం ప్రభాకర్ రాసిన పిడికిలి కవితలో చరిత్రను కూల్చిన పిడికిళ్ల శబ్దాలను గురించి మాట్లాడుతున్నారు.
అధికారం పది తలల
యాగి చేస్తుంది
పహానీలు గల్లంతైనంక
ఉసురు అక్షరాలు నింపుతది
కచీర్లు తిరిగి సొట్ట వోయిన చెప్పులు
మందపు తోలు వొలిసే పనిలో వుంటయ్
మూడునొక్క కోట్ల గొంతుకలు
వూపిరి పీల్చుకోక ముందే
పాత పాట కొత్తగా
కూయాల్సి వస్తుంది
రాజ్యాలు కోటలు ఘడీల చరిత్ర
ఎప్పుడూ రగిలే కాష్టమే
రాజకీయ జబ్బులను
వారసత్వపు ఆకలిని
చీల్చుకు వచ్చే కాంతి పుంజ్యం
మబ్బుల తెట్టుకోసం
ఎదురు చూస్తుంది
ఆ చిల్లర సంఘాలే
బ్రహ్మ రథాలై నిన్ను మెూసినై
నీ చిల్లరమల్లర చవాకులల్ల
చలిచీమల దారులంత నీకాడికే
కయ్యం బుట్టించినంక
కాటు కోసం ఎదిరి సూత్తవో
కాలికి బుద్దే జెప్తవో
ఆ గెలుసుడు లో మేమూ సిపాయిలమే
వూకదంపుడు తూటుకర్ర పేలుడు
మాటలకు నవ్వకుంటమా
ఓటు గుద్దే కాడ నవ్విపోమా
నీ వొంటెద్దుల మేడ కూలి పోద
ఇవన్ని చరిత్రను కూల్చిన
పిడికిళ్ల కీల్ల శబ్దాలే