తెలుగు కవిత్వంలో వచన కవిత ప్రసిద్ధి పొందింది. ప్రతాప చంద్రశేఖర్ రాసిన అరగంచు రాయి అనే కవితను మీ కోసం అందిస్తున్నాం.
ఇక్కడ
ఈ కాంక్రీటు
బూడిదభవనం
కట్టక ముందు
గూన పెంకుల ఇల్లుండేది.
వర్షా కాలంలో వాకిట్లో
నాలుగు వైపుల
గూన పెంకుల
మూలల నుండీ
వర్షపు నీటి సిరులు
ధారలుగా పడుతున్నప్పుడు
దోసిలి పట్టిన
అరుగంచురాయి!
చినుకుల సవ్వడికి
నిలువెల్లా మురిసిపోయి
వర్షపు నీరు మట్టి వాసనా
కలగలిసిన
వింత పరిమళం
వెదజల్లిన
రాతి పూదోట!
చెట్టుగా పెరిగి
మట్టిగా మారి
శిలగా
కాలంతో పాటు
ప్రవహించి
అరుగంచున
ఘనీభవించిన
రాతి నది !
మూలాలన్నీ
ఆకృతిగా
ఒదిగిన
సజీవ
కళానిధి!
అమ్మ లాగే
తనూ ఇంటిని
అంటి పెట్టుకున్న
పరాయి!
పాదాలు
తడబడి
జారి
పడతాయోనని
పొదివి పట్టుకునే
అమ్మ దిగులుకు
ఆసరా!
అప్పట్లో
పాలమ్మికి
అమ్మకు
నిత్యం జరిగే
పాల యుధ్దం లో
మధ్యవర్తి!
ఉగ్గు కలిపే
పాల నిగ్గు
తేల్చడానికి
అమ్మ గడుసుగా
కనిపెట్టిన
బండ గుర్తు!
ఎండాకాలపు
మండే వేడికి
తన వీపు మీద
సేద తీరినమేనుకి
చల్లని
ఆత్మీయ స్పర్శ!
దేహీ అన్న
ఆర్తి కి
దోసిలేత్తిన
క్షణాన
మిత్రుని లా
ఒకడుగు
పైకెత్తిన దన్ను!
ఇష్టంగా
అందంగా
పొడిపించుకున్న
వీపు మీది
పులిజూదం టట్టూ!
పచ్చీసుగూళ్ళు తెరచి
ఎన్నిసార్లు ఎగరేసినా
గూడు వదలని
గవ్వల గువ్వలు.!
చీకూ చింతల్లేని
పసితనపు నవ్వులు!
ఎదనిండా
విరిసే ఆత్మీయ
పరిమళాల
పువ్వులు!
ఓహ్ ! ఎన్నింటిని
చూసింది తను!
తనను జ్ఞాపకాల
తివాచిని
చేసి!
చివరి సారి
తనమీద నుంచి
తరలి పోయిన
తరాల
ప్రాణ స్పందనని
మోసిన
బండ రాతి గుండె!
ఇప్పుడు
వీధిలో
ఇంటి పక్క
అనాధలా!
ఎవరికీ పట్టని
గాథలా!
కాలం ఆడిన
జూదంలో
ఓడిపోయి
నవ్వులిగిరి పోయి
గువ్వలెగిరి పోయిన
బూడిద కోటలో
తిరుగాడుతున్న
సమాధుల మధ్య
తానుండలేదని
క్షమించమ నడిగి
బండి కెత్తించి
బతుకమ్మలా
వాగు వార చేర్చాను
పుట్టింటికి చేర్చానన్న
తృప్తి తో!
నాకు తెలుసు
కాలంతో పాటు కరిగి
వానయ్యో
నాకు నానయ్యో
తిరిగి
వస్తుందని!
- ప్రతాప చంద్ర శేఖర్