రస హృద్యం - దాశరథి పద్యం

By telugu team  |  First Published Nov 5, 2019, 4:17 PM IST

దాశరథి గారు పద్యమే కాదు పట్టుకొన్న ప్రతి ప్రక్రియలో శిఖరాయమానంగా వెలుగొందాడు. వారి సృష్టించిన సాహిత్యం ఆచంద్ర తారార్కంగా నిలిచి ఉంటుందనడంలో సందేహంలేదు అంటున్నాడు సిద్దెంకి యాదగిరి


తెలంగాణ ప్రజా పోరాటాన్ని ప్రజ జీవితాల్లోంచి, చరిత్ర నుదిటిపై సువర్ణ అక్షరాల్తో పద్యాల్లో లిఖించి, తెలుగు సాహిత్యంలో సుస్థిరం చేసిన నిఖార్సయిన కవి నాయకుడు. తనూ ఓ ఖైదీగా ఇందూరు జైల్లో బంధీ అయినా, హింసల్ని భరిస్తూ స్వేచ్ఛాయుత తెలంగాణ కోసం  ప్రజల్ని సాహిత్యంతో సాయుధం చేసిన మహాకవి. దాశరథి కృష్ణమాచార్యులు దాశరథిగా సుప్రసిద్ధుడు. తెగించే స్వభావాన్ని పద్యంలో నింపి ఎందాక ప్రవహింపజేసాడో అందాక తుప్పు పట్టిన నియంతృత్వ పాలనకు అగ్గిపెట్టిన నిప్పురవ్వ. గరక పోసల్లాంటి సామాన్యుల్ని మాన్యులజేసి రజాకార్ల ఆకృత్యాలను ఎదురించడానికి మాగిన మనసుల్ని ఆరని అగ్నిజ్వాలలుగా రగిలించాడు. ఆలోచించే మెదళ్లు సల్లారకుండా సగేసిన సాహితీ యోధుడు. జన జాగృతికి ఆద్యుడయ్యి సాయుధమవ్వడానికి తన సాహిత్యాన్ని వాహకంగా వినియోగించాడు.
          
ఎంచుకుంది పద్యమైనా పండిత పామర జనరంజకంగా మలిచాడు. ఎదలోతుల్లోంచి బాధల్ని పాతాళగరిగెతో దేవి వీరగాథలు వినిపించాడు. ఉబుకుతున్న బాధ కన్నీళ్లనీ కత్తులు చేసి ఆరాట పదును అద్దాడు. ఆశల పదన తాపాడు. రొమ్ము విరిచి పోరాడే ధైర్యాన్ని ప్రతీ అక్షరంలో పొదిగాడు. సుప్తచేతనావస్తలో ఉన్న పాఠకుల మస్తిష్కాల్లో సుశిక్షితను నూరిపోసాడు. మేథోమథనంతో మేల్కొల్పాడు. అజ్ఞానంపై ఉసిగొల్పాడు. కాలానికి ఎదురు నిలిచే నవరసాన్ని నింపి భావ దారిద్య్రంపై పిడికెల తంపి పేర్చి సమూలంగా కాల్చాడు.

దాశరథి గారి పోరాట పటిమ ఈనాటి కవులెందరికో ఆదర్శం. ఆదిలోనే పోరుపంథానేర్పర్చుకొన్న సృజన శీలి. అది 1944 సంవత్సరం. సారస్వత పరిషత్తు ప్రథమ వార్షికోత్సవంలో జరుపాలని వేసిన చలువ పందిళ్లను రజాకార్ల మూక కాల్చి బూడిదచేసింది. అయినా కవిసమ్మేళనం జరిపి తీరవలసిందేనని సురవరం ప్రతాపరెడ్డిగారు దాశరథిని సంప్రదించినపుడు తానన్నాడు ‘‘లడేంగే ఔర్‌ మారేంగే. పోరాడుతాం. ప్రాణాలు వదుతాం.’’ అని వారికి భాసటగా నిలిచాడు. అదే కవిసమ్మేళనంలో తన పద్యం చదివాడు. అదే చొరవ రేపటి తరానికి దిక్సూచిగా నిలుస్తుందని బహుశ ఎవరూ ఊహించి ఉండరు. అగ్నిజ్వాల మధ్య నడిచిన కవిసమ్మేళనంలో ఆరంగేట్రం చేశాడు కాబట్టి పద్యాలన్నీ నిప్పు కణికయ్యాయేమో.

Latest Videos

తన తొలి పద్యం ‘‘ఓ పరాధీన మానవా! ఓపరాని / దాస్యము విదిల్చలేని శాంతమ్ము మాని / తుపును ముష్టిబంధాన కలచివైచి / చొచ్చుకొనిపొమ్ము, స్వాతంత్య్ర సురపురమ్ము’’ అని చదివాడు. నిర్భయంగా ‘‘సింహగర్జన చేశావు నాయనా?’’ అని ప్రతాపరెడ్డిగారన్నారు. కౌగిలించుకొని పుష్పహారం వేసి అభినందించాడు దేవుపల్లి రామానుజరావుగారు. రజాకార్లు తోకముడిచారు. అర్ధరాత్రి వరకు కవిసమ్మేళనం నిరభ్యంతరంగా జరిగింది. తన పద్యా గురించి చెబుతూ...    

‘‘నా గీతావళి ఎంతదూరము ప్రయాణంబౌనొ అందాక ఈ
భూ గోళమ్మున అగ్గివెట్టెదను  నిప్పుల్‌ వోసి హేమంత భా
మా గాంధర్వ వివామమాడెదను, ద్యోమణ్యుష్ణ గోళమ్ముపై
 ప్రాగాకాశ నవారుణాస్ర జధారల్‌ చల్లి చల్లార్చెదన్‌’’ అని దాశరథి వివరిస్తాడు. నిజమే తన పద్యాలు  ఎంత దూరము ప్రయాణమయ్యాయో అంతదాక ఈ భూగోళానికి అగ్గిపెట్టాడు. నిప్పు చల్లి హేమంత బామను వివాహమాడుతానని మండుతున్న భూమిపైనా పాఠకుని ఎదపైనా ప్రాగాకాశాన కొత్త భానునిలా జలాలు చల్లి చల్లార్చుతానని ఆత్మస్థైర్యంతో అభ్యుదయ భావనతో ప్రకటించాడు. ముప్పైయేళ్ల వరకు తెలుగు సాహిత్యం నన్ను శాసిస్తే ఆ తర్వాత నేను శాసించిన అని శ్రీశ్రీ చెప్పినట్లు దాశరథి కూడా అంతే ఆత్మధైర్యంతో ప్రకటించాడు. తెలుగు పాఠకుల్ని తట్టిలేపే పాండితీ ప్రకర్ష దాశరథి గారి సొంతం.

‘‘పాటలు పాడితిన్‌ తెలుగు బాబులు  నిద్దురమేలుకోగ, పో
రాటము సేయగా, కరకు రాచరికమ్మును కూలద్రోయగా
కోటిగళాల నొక్కకడ గూర్చితి విప్లవశంఖమొత్తితిన్‌
 నాటికి నేటికిన్‌ తొగునాటికి వెచ్చదనమ్ము లూదితిన్’’ అని రాజరికము అంతం కావాలనీ తన శాయశక్తులా కృషి చేసిన విధానాన్ని వ్యక్తీకరించాడు. కర్కష నియంతృత్వ రాజరికము కూల ద్రోయడానికి, కాలరాయడానికి పాటలు పాడినాను. పోరాటము చేయడానికి కోటిగళాలను ఒక్క దగ్గరికీ చేర్చి దునుమాడినాడు. విప్లవ శంఖము ఒత్తి ఊది తెలుగు నేలకు వెచ్చదనము లూదానని చెప్పిన ధీశాలి ధాశరథి గారు.

 వివిధ పన్నులతో ప్రజల్ని పీడించి నిజాం నవాబ్‌ తన కోశాగారం నింపుకుంటున్న సందర్భంలో ఆంధ్ర మహాసభ నింపిన చైతన్యంతో నిజాం రాజును ఈసడిరచుకుంటూ కవులు కలం పట్టారు. గాయకులు గళాలు సవరించి సమరానికి ఊతమిచ్చారు. అమాయక జనమే ఆయుధదారులయ్యారు. గగనమంత పయనించేలా దాశరథి తన పద్యాన్ని చిందించిన ధిక్కార స్వరం.

‘వేయికత్తి పోట్లకు జంకని వాడే రాజుని పదవీ భ్రష్టుడు చేయగడని’ విప్లవ కవి శివసాగర్‌ అన్నట్లు రాజరిక వ్యవస్థలో రాజును తిట్టాలంటే మహా పౌరుషం ఉండాలి. తెగింపుండాలి. ఎదుర్కొనే సత్తా ఉండాలి. కొలతకందని తిరుగుబాటు దాశరథిలో టన్నులకొద్దీ ఉంది. సాధారణంగా టీనేజి దాటగానే ఏ యువకుడైనా తన గురించి కలలు కంటాడు. ఊహా లోకంలో విహరిస్తాడు. కాని ప్రజాకవి దాశరథి మాత్రం మాతృభూమి కోసం తహతహలాడిన భూమి పుత్రుడు. కవి సైనికుడు. ఇరువై ఏళ్ల ప్రాయంలో ఇందూరు కారాగారంలో బంధించినా నిప్పుల్ని సంధించినట్లు పద్యాల్ని క్షిపణుల చేసి జనాకాశంలోకి ప్రయోగించాడు.

‘‘ఓ నిజాము పిశాచమా! కానరాడు
నిన్ను బోలిన రాజు మాకెన్నెడేని
తీగలను తెంపి అగ్నిలో దింపినావు
నా తెలంగాణ కోటి రత్నా వీణ’’ (రైతుదే. అగ్నిధార) అని నిజాము రాజును, రజాకారుల దుర్మార్గాలను చూసి చలించిపోయి నీలాంటి రాజ పిశాచి మాకు లేడు. మా వారసుల్ని చంపి అగ్నిలో ముంచినావు. నా తెంగాణ సమూహాలు చిగురించే కోటి రత్నాల వీణని నినదించాడు.

ఈ కోటి రతనాల వీణ తెలంగాణను పాలించు అర్హత రాక్షసరాజు నిజాంకు లేదని నినదించాడు. మంచి మాగాణములు దున్ని ఎముకలు నుసిజేసి  తమ స్వేద జలం’తో స్వర్ణము నింపి నిజాం ధనగర్వానికి మూలకారకుడైన రైతుకే ఉందని దాశరథి తొడగొట్టి చెప్పాడు.

‘‘ప్రాణములొడ్డి ఘోర భయదాటవున్‌ పడగొట్టి మంచి మా
గాణమున్‌ సృజియించి ఎముకల్‌ నుసిజేసి పొలాలు దున్ని భో
షాణమున్‌ నవాబునకు స్వర్ణము నింపిన రైతుదే తెలం
 గాణము రైతుదే ముసలి నక్కకు రాచరికంబు దక్కునే’’(తెంగాణ తల్లి, మహాంధ్రోదయం) గద్దెనెక్కిన ముసలి రాజుకు రాచరికంబు దక్కుతుందా ప్రశ్నిస్తాడు. తెంగాణము ముమ్మాటికి రైతుదే అని సగర్వంగా ప్రకటిస్తాడు.

నియంతృత్వము వల్ల జాగీర్ధార్లు, దేశ్‌ముఖ్లు  నియంతయ్యారు. పన్నులతో పీడిస్తూ వసూలు  చేస్తున్న రజాకార్ల హింసాకృత్యాల వల్ల అనామకులైన మామూలు ప్రజలు  తిరుగబడిన తీరును వర్ణిస్తూ రాసిన పద్యం చూడండి.       

‘‘తెగాణమ్మున గడ్డిపోయమును సంధించెన్‌ కృపాణమ్ము!రా 
జలాముండనువాని పీచమడచన్‌ సాగించె యుద్ధమ్ము! భీ
తిలిపోయెన్‌ జగమెల్ల యేమియగునో త్యెంగరాకన్‌! దిశాం
 చముల్‌ శక్రధను:పరంపరతో సయ్యాటలాడెన్‌ దివిన్‌’’ (వీరతెంగాణము. 4 : రుద్రవీణ) అని తెలంగాణలో గడ్డిపోచలాంటి అతి సామాన్యులకు కత్తినిచ్చింది. రాజ శ్రేష్టుడని విర్రవీగుతున్న వానితో యుద్ధము చేస్తున్నపుడు ప్రపంచమంతా ఏమవుతుందో అని భీతిల్లి పోయింది. శంఖ ఛక్ర గదాయుధాలు ఆ రణరంగంలో సయ్యాటలాడుతున్నాయని చమత్కరించాడు.

తెలంగాణ అంటే  వల్లమాలిన ప్రేమ. తెలంగాణను తల్లిగా, కంజాతవల్లిగా, అందాల జాణగా, సౌందర్యసీమగా, కోటి రతనాల వీణగా అభివర్ణించాడు. ‘‘ప్రొద్దు ప్రొద్దున అందాల పూలుపూయు / నా తెలంగాణ తల్లి కంజాత వల్లి’’ గా స్తుతించాడు.

(గాలిబ్‌ ప్రణయ కవిత్వం అత్యధికంగా నూతన వయ్యారాలు పొందింది. ‘‘కత్తి చేతలేక కదనమ్ము జరిపెడి / ఇంతి కెవ్వడసువు లీయకుండు?’’ అని ప్రియురాలు ఎటువంటి కత్తిలేకుండానే గాయం చేస్తుంది. కత్తితో వస్తే ఎదుర్కోవచ్చు. ఏ ఆయుధంలేకుండా యుద్ధానికి వచ్చే ఆమె చేతిలో ఓడిపోతారంటారు.)

దాశరథి రసపోషణలో తనకు తానే సాటి. అంగారం, శృంగారం దాశరథి రచనలో కలిసి ఉంటాయని డి. రామలింగం గారన్నారు. దాశరథి గారు కూడా ఒప్పుకున్నారు. వీరానికి పై పద్యాలను పరిణలోనికి తీసుకోవచ్చు. శృంగారానికి కూడా పెద్దపీట వేశాడు. కవి ప్రతిభ శృంగారావతార వర్ణన ‘‘గుమగుమలాడి నా మనసుగొన్న నవాబ్దసఖీ ముఖానురా / గమున సుమించె చంపకము కౌగిలిలో ప్రసవించే గోరటల్‌’’ అని వివరించాడు.

శిశిర రుతువును శృంగారమయం చేస్తూ ‘‘ఆకు రాలిపోయె, దెసన్నిట చీరలు జారిపోయె, న / గ్నకృతయై మహా ప్రకృతి నేలకు మోము వాల్చె....శైశిర కాలధర్మంగా’’ అని వర్ణిస్తాడు.

దాశరథిగారు ప్రకృతిలోని ప్రతి అంశాన్ని కమనీయ కవనం చేసి తెలుగు సారస్వతానికి వన్నెతెచ్చాడు. వారి చూపులో మరో దృక్కోణం చూపుతాడు. మోదుగుపూలంటే మహా ఇష్టం. వాటిని అగ్ని పుష్పాలుగా భావిస్తూ వర్ణన చేస్తాడు.

 మహాంధ్రోదయము చదివిన మల్లంపల్లి సోమశేఖర శర్మ ‘‘మూర్తీభవించిన తెలుగుతనమే దాశరథీ’’ అని అన్నారు.  ‘‘అరి శిరస్సు నుత్తరించిన, అలుగు నేనే. తెలుగు నేనే. వెలుగు నేనే, నాకు కావలె మహాంధ్రోర్వర’’ అని  తన ఆవేశాన్ని వెళ్ల గ్రక్కాడు.

 పగతో పాలు తాగించలేం. ప్రేమతో విషాన్ని తాగించవచ్చు అనే విషయాన్ని ‘‘ఏనాడెవ్వడు కత్తితో గెలువలేదీ విశ్వమున్‌ ప్రేమ / శానన్‌ కట్టుము నాటుగుంబది ప్రపంచాన్‌ మహాత్ముండిదే’’ (మహంధ్రోదయము)లో ప్రపంచాన్ని హింసతోకాక, ప్రేమతో జయించాని వివరిస్తాడు.

మెదక్‌ జిల్లాలో ఉన్న మంజీర నది గురించి ప్రస్తావించాడు. ఒకప్పుడు ఈ నేలను మంజీరక దేశమని పిలిచేవారనే చరిత్ర. మంజీర నీరు చాలా స్వచ్ఛమైనవి. తీయనైనవి. హైద్రాబాద్‌ నగర దాహార్తిని తీర్చున్న ఆకాశ గంగ.

‘‘ఎవరి గజ్జె రవళివే నీవు మంజీర  ఎవరికజ్జల బాష్ప ధారవే మంజీర
 నీవు పారిన దారిలో ఇక్షుదండాు  నీవు దూకిన నే మాకు విద్యున్మా’’ అంటూ తనకు నచ్చిన మంజీర మీద చక్కని చిక్కనిఅద్భుత ఆలాపన గావించాడు. మంజీర సవ్వడులను సాహిత్యంలో వినిపించాడు.

తెలంగాణ అంటే దాశరథికి కన్నతల్లితో సమానంగా భావిస్తుంటాడు. రుద్రవీణలో ‘‘ననుగని పెంచినట్టి కరుణామయి నా తెలంగాణ’’ అను పద్యములో ఆమెను వేనోళ్లతో కొనియాడాడు. దాశరథి తన రుద్రవీణను తెలంగాణ తల్లికి అంకితం చేసాడు. 

‘‘నేనురా తెలగాణ నిగళాలు తెగగొట్టి ఆకాశమంత యెత్తర్చినాను
నేను రాక్షసి గుండె నీరుగా పద్యాలు పాడి మానవుని కాపాడినాను
నేను వేస్తంభాల నీడలో నొక తెల్గుతోట నాటి సుమాలు దూసినాను
నేను పోతన కవీశాను గంటములోని ఒడుపు కొన్నింటి బడిసినాను’’ అని కొదమ సింహం గర్జించాడు. తెలంగాణ బంధనాలు తెగ్గొట్టాడానికి గగనమంతా అర్చినాను. రాక్షసి గుండె కరిగేటట్లు పాడి మానవుని కాపాడిన. వేయి స్తంభాల తోటలో పరిమళించే సుమాలు దూసి పోతన్నలా ఎదురు తిరిగాను.

కవులలో నైపుణ్యశీలురైన కవులు కొంతమందే ఉంటారు.  మరో ప్రపంచాన్ని దర్శించి, నిర్మించి, భూతలాన్ని స్వర్గంగా  ఆశించగవాడే కవి అన్నట్లు సత్కవి గురించి తన అభివ్యక్తిని వివరిస్తూ  ‘‘ధరకు సురాలయమ్మునకు / దాయి వేసేడువాడు / సత్కీవీశ్వరుడు’’ (రవికవి, కవితా పుష్పకం) అని అంటాడు. దాశరథి దేహంలో రక్తం ప్రవహించదు దేశభక్తి ప్రవహిస్తుంది. అలాంటి మహాకవి దేశభక్తి గురించి రాసిన పద్యం ఎవరెస్టంత శిఖరాయమానంగా వేలుగొందింది.

‘‘జండా ఒక్కటె మూడు వన్నెలది దెశంబొక్కటే భారతా
ఖండాసేతు హిమాచలోర్వర కవీట్కాండంబులోనన్‌ రవీం
ద్రుండొక్కండె కవీంద్రుడూర్జిత జగద్యుద్యాలలో శాంతికో
దండోద్వద్విజయుండు గాంధి ఒక్కడే తల్లీ మహాభారతీ’’  అని వర్ణించాడు. 

భారత దేశం ఒక్కటే, మువ్వన్నెల జండా ఒక్కటే. మహా కవి రవీంద్రుడు ఒక్కటే. ప్రపంచానికి ఆచరణాత్మకంగా దారి చూపిన గాంధీ ఒక్కడే అని దేశమాతకు ప్రణమ్లిుతాడు.

ప్రతి మార్పును స్వీకరించిన పరిణామం చెందాడు. పరిస్థితుల్ని చీల్చి చెండాడు. జటాజూటం ధరించిన శివునిలా శివతాండం చేసినట్లు అక్షరాల్ని వివిధ ప్రక్రియల్లో విత్తి మట్టిపొరల్లో మొకెత్తిన విత్తనంలా అవాజ్‌ చేస్తూనే వుంటాడు. ఎదిగినా ఒదిగిపోయే తత్వం దాశరథిలో కనవడుతుంది.

‘‘గతాన్ని కదనలేను,  వర్తమానం వద్దనబోను
భవిష్యత్తు వదుకోను, కాం నా కంఠమా
 నా పేరు ప్రజాకోటి నా ఊరు ప్రజావాటి’’ అని ప్రాచీన సాహిత్యాన్ని గౌరవిస్తూనే వర్తమానం కంఠమాల అల్లుకొని భవిష్యత్తులో నిల్చున్నాడు. తన పేరును ప్రజా సమూహంగా మార్చుకున్నాడు. జనం కోసం నిల్చిండు.

 దాశరథి గారు పద్యమే కాదు పట్టుకొన్న ప్రతి ప్రక్రియలో శిఖరాయమానంగా వెలుగొందాడు. వారి సృష్టించిన సాహిత్యం ఆచంద్ర తారార్కంగా నిలిచి ఉంటుందనడంలో సందేహంలేదు.

‘‘తిమిరంతో ఘనసమరం - జరిపిన బ్రతుకే అమరం
కవితాతేజోవలయం - అవని శాంతి కదినియం’’  ఈ గీతం ఆయన జీవితానికీ వర్తిస్తుంది. తిమిరం అంటే అజ్ఞానం. చీకటి. హింస. రక్తపాతం. సామ్రాజ్యవాదం ఏదైనా కావొచ్చు. అభ్యుదయానికి అవరోధంగా నిలిచేది తిమిరం. ఆ తిమిరంతో ఘన సమరం చేసిన బ్రతుకే అమరం. తన కవితా తేజో ప్రళయంగా తెలుగుసాహిత్యంలో ప్రతి పద్యం రస హృద్యంగా దశదిశలా ప్రతిధ్వనిస్తూనే వుంటంది.

(తేది: 02-08.2019 రోజున “20వ శతాబ్ధం – తెలుగు పద్య వైభవం” ప్రభుత్వ డిగ్రీ కళాశా సిద్దిపేట నందు జరిగిన రాష్ట్ర సదస్సు నందు పత్ర సమర్పణ చేయబడినది.)

- డాక్టర్ సిద్దెంకి యాదగిరి

click me!