మనోరంజకంగా భాషాదృశ్యాన్ని ఆవిష్కరిద్దాం పరిమళాలను పరివ్యాప్తం చేద్దాం అంటూ డా. తిరునగరి శ్రీనివాస్ రాసిన కవిత ' కీర్తి పత్రం... ' ఇక్కడ చదవండి :
ప్రసరణ శీలంతో
ప్రవహించే జీవనది
ప్రబోధమై పరిఢవిల్లే
జ్ఞాన నిధి
అక్షరమై అలరారే
విశ్వజ్యోతి
ఆలోచనల చూపులను వెలిగించే
చైతన్య చేతన
క్రియాశీలక సంఘర్షణై
పరివ్యాప్తమైన జీవన స్వరం
మనుగడకు గమ్యం
మాటకు శ్రుతి
ఆత్మలో అలికిన తడి
ఆత్మీయతకు అంకురార్పణ
ఆత్మగౌరవపు కీర్తిపత్రం
అతీత భావావేశం
సృజనకు కొలమానం
నిప్పుసెగ లాంటి జ్వలనం
ఎగసిపడే నినాద రూపం
కట్టుపడే ఆశయం
పురివిప్పే స్వాభిమానం
ఒదిగి వచ్చే సంయమనం
మనోరంజక సదృశ దృశ్యం
చరిత్రే వెలికి తీసిన సార్వకాలిక సత్యం
భాషల్లో తెలుగే జగజ్జేయం
కొడిగట్టుకుండా
మనం అరచేతులడ్డుదాం
మనోరంజకంగా
భాషాదృశ్యాన్ని ఆవిష్కరిద్దాం
పరిమళాలను పరివ్యాప్తం చేద్దాం