భార్యాభర్తల అనుబంధానికి అక్షర రూపం ”దుఃఖాన్ని మ్రింగి ఒక్కసారి నవ్వు” .

By Arun Kumar P  |  First Published Jan 7, 2024, 11:30 AM IST

తెలంగాణ బంజారా సాహిత్య అకాడమి, తెలంగాణ ట్రైబల్ ఇంటలెక్చువల్ ఫోరం సంయుక్తాధ్వర్యంలో ఆచార్య సన్నరామ చౌహాన్ రచించిన “అలు నుంగి నగు ఒమ్మె” కన్నడ మూలానికి, తెలుగులో కన్నడ కవి డా. అంజనప్ప అనువదించిన గ్రంథం “దుఃఖాన్ని మ్రింగి ఒక్కసారి నవ్వు” ఆవిష్కరణ  కార్యక్రమం నిన్న సాయంత్రం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వేదికగా జరిగింది. ఆ వివరాలు ఇక్కడ చదవండి : 


ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ పూర్వ ఉపకులపతి డాక్టర్ ఎన్ గోపి పాల్గొని గ్రంధాన్ని ఆవిష్కరించారు. ఉస్మానియా తెలుగు శాఖ పూర్వాధ్యక్షులు ఆచార్య సూర్యాధనంజయ్ అధ్యక్షతన పండుగ వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమానికి  విశిష్ట అతిథిగా ఆర్ట్స్ కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య చింతా గణేష్, గౌరవ అతిథిగా రాష్ట్ర హైకోర్టు న్యాయవాది, పూర్వ వాణిజ్యపన్నుల అసిస్టెంట్ కమీషనర్ డా. ఎం. ధనుంజయ్ నాయక్, ఆత్మీయ అతిథులుగా ఉస్మానియా తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య కాశీం, కన్నడ శాఖ అధ్యక్షులు ఆచార్య లింగప్ప గోనస్, తుముకూరు విశ్వవిద్యాలయం ఆచార్యులు అణ్ణమ్మ, మూల రచయిత ఆచార్య సణ్ణారాం, తెలుగు అనువాద రచయిత డా. ఎ. అంజనప్ప హాజరుకాగా, తెలుగు శాఖ పరిశోధక విద్యార్థి ఎడవల్లి సైదులు గ్రంథసమీక్ష చేశారు.

గ్రంథావిష్కర్త ఆచార్య ఎన్. గోపి మాట్లాడుతూ భారతదేశంలో భార్యాభర్తల బంధం గొప్పదని జీవిత చరమాంకంలో భార్యను కలిగి ఉండడం గొప్ప వరమని, కోల్పోవడం భరించలేని వేదన అని తెలిపారు. ఆర్ట్స్ కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య చింతా గణేష్ మాట్లాడుతూ కన్నడ నుంచి తెలుగులోకి అనువదించబడిన ఆత్మకథ గ్రంథావిష్కరణ ఆర్ట్స్ కళాశాలలో జరగడం గొప్ప విశేషం అన్నారు. ఓయూ తెలుగు శాఖ పూర్వఅధ్యక్షులు ఆచార్య సూర్యాధనుంజయ్ మాట్లాడుతూ ఈ గ్రంథ రచయిత సణ్ణారాం జీవితంలో ఎంతో వేదన, దుఃఖం ఉన్నదన్నారు. అనువాదకులు రామదాసు గారి రచన శైలి తెలుగువారికి చక్కగా అర్థమయ్యేలా ఉందన్నారు. బంజారా సాహిత్య అకాడమి, తెలంగాణ ట్రైబల్ ఇంటలెక్చువల్ ఫోరం వ్యవస్థాపకులు, తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ డా. ఎం ధనుంజయ్ నాయక్  మాట్లాడుతూ కన్నడ నుంచి తెలుగులో అనువాదం కాబడిన ఈ ఆత్మకథ ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉందని ఇటువంటి అనువాదాలు మరెన్నో రావాలని అప్పుడు మాత్రమే భాషల మధ్య అంతరాలు తగ్గుతాయని వారు కాంక్షించారు. 

Latest Videos

ఓయూ తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య కాశీం మాట్లాడుతూ ఈ గ్రంథం స్మృతి కథను తలపిస్తుందని ఇందులో సన్న రామదాసుకు వారి భార్యపై గల అనుబంధం వ్యక్తమౌతుందని అన్నారు.  ఓయూ కన్నడ శాఖ అధ్యక్షులు ఆచార్య లింగప్ప గోనాల్ స్పందిస్తూ తెలుగు కన్నడం అవినాభావ సంబంధం కలిగి ఉన్నాయని అటువంటి భాషల సమహారంగా వెలువడుతున్న ఈ గ్రంథావిష్కరణ ఎంతో ఆనందం కలిగించిందన్నారు. గ్రంధానువాదకుడు డా. అంజన్నప్ప మాట్లాడుతూ తెలుగు అనువాదంలో తెలంగాణ భాష పదాలను రచనలో సందర్భానుసారం ప్రయోగించాల్సి వచ్చింది అన్నారు. గ్రంథ సమీక్షకులు ఓయూ రీసెర్చ్ స్కాలర్ యడవల్లి సైదులు గ్రంధాన్ని సమీక్షిస్తూ గ్రంథంలో రచయిత వ్యక్తపరిచిన దుఃఖాన్ని హృదయగోషని ఆవిష్కరించారు.

గ్రంథ మూల రచయిత  ఆచార్య సణ్ణారాం చహన్ సభనుద్దేశించి మాట్లాడుతూ వక్తలందరి పలుకులతో తన హృదయం బరువెక్కిందని ఉస్మానియాలో ఈ పుస్తక ఆవిష్కరణ జరగడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో తుమకూరు విశ్వవిద్యాలయం ఆచార్య అణ్ణమ్మ పాల్గొని తన స్పందనను తెలియజేశారు. కార్యక్రమ నిర్వాహకులు నిజాం కళాశాల తెలుగు అధ్యాపకులు డాక్టర్ భూక్యా రాజారాం నాయక్  మరియు ఉస్మానియా తెలుగు శాఖ ఆచార్యులు పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

click me!