పెనుగొండ బసవేశ్వర్ కవిత: ఉదయ విలాసం

By telugu team  |  First Published Nov 25, 2019, 12:52 PM IST

తెలుగు సాహిత్యంలో కవిత్వం పెద్ద యెత్తున వస్తోంది. ఏషియానెట్ న్యూస్ లో పెనుగొండ బసవేశ్వర్ రాసిన ఉదయ విలాసం అనే కవితను చదవండి.


రాత్రి చీకటంతా గడ్డకట్టి 

కనుల కొలకుల్లో ఎప్పుడు 

Latest Videos

ఊసుగా మారిందో మరి 


వెలుగును కప్పేసిన రెప్పలకింద 

ఆక్వేరియం లో చేప పిల్లల్లా 

ఊసులకు  ఊకొడుతూ కనుగుడ్లు 


తాను వచ్చే సమయమైందని 

తన్నుకొస్తున్న నిద్రను తరిమేస్తూ 

ఒళ్ళు విరుచుకున్న చేతులు 


తాను చేరిన ఆనవాళ్లను 

తలుపు సందులోంచి మోసుకొస్తూ 

వీధిగుమ్మం నుండి వింత పరిమళం 


ఫలానా అని చెప్పలేని సంతోషం 

పెదవుల అంచులదాకా పాకి 

ఒళ్ళంతా ఒక పులకరింత 


తలుపు తీసి చూద్దును కదా రోజులాగే 

దొంగ.. పూలకుండి  మాటున దాగుంది 

మూడంకె వేసి ముడుచుకుపోయి 


రమ్మని సైగ చేసానో లేదో 

గాలికి రెక్కలాడించే పావురమై 

చేతుల్లోకి చేరింది ఇంట్లోకి పదమంటూ 


ఆరాం కుర్చీలో కాలుమీద కాలేసుకుని 

ముక్కు పైని అద్దాలను ముందుకు లాగి 

తన మొహానికి నా కళ్ళను అంటించేస్తాను 


ఆవిడ అందించిన గరం చాయ్ లానే 

ప్రపంచాన్ని తాజాగా పరిచయం చేస్తూ 

ప్రశ్నిస్తూ వివరిస్తూ విభేదిస్తూ విశ్లేషిస్తూ 


పరుగులు పెట్టె అక్షరాల పంటనే 

నా అనుదినపు అతిధి..నా వార్తాపత్రిక

నను ఓలలాడించే సమాచార గీతిక 

click me!