దీర్ఘ కవితలు రావడం కోత్తకాదు గానీ పూర్తి తెలంగాణ వాదం తోనే ఒక సంపుటి రావడం మాత్రం సుంకిరేడ్డి గారి దాలి తోనే ప్రారంభం.దాలి ఏక దీర్ఘ కవితా కావ్యం. శీర్షిక తెలంగాణ పదం. తెలంగాణ ప్రాంతంలో పాలు వెచ్చ చేసుకోవడం కోసం ఉపయోగించే పాత్ర ను దాలి పేరుతో పిలుస్తారు.
సుంకిరెడ్డి నారాయణ రెడ్డి గారు సాహితీవేత్త, చరిత్రకారుడు. సురవరం ప్రతాప రెడ్డి బాటలో నడుస్తూ మరుగునపడ్డ తెలంగాణ సాహిత్యాన్ని, చరిత్రను వెలికి తీసి పుస్తకాలు రాసి భావితరాలకు అందించిన గొప్ప గ్రంథకర్త. నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు అధ్యాపకునిగా పనిచేశారు. తెలంగాణా ప్రాచీన సాహిత్యాన్ని ముంగిలి పేరుతో గ్రంథస్తం చేశారు.
సుంకిరెడ్డి నారాయణ రెడ్డి గారు నల్లగోండ జిల్లా కనగల్లు మండలం పగిడిమర్రి గ్రామంలో 1954, మార్చి 12న జన్మించారు. వీరి తల్లీదండ్రుల పేర్లు కోటమ్మ మాధవ రెడ్డిలు. సుంకిరెడ్డి గారు పగిడిమర్రిలో ఆరోతరగతి దాకే విద్యాభ్యాసం చేసారు. చిన్నతనం లో శారదాగాండ్ల్రు చెప్పే కథలు వింటూ పెరిగారు వీరి తండ్రీ గారికి కుల పట్టింపులు అంతగా లేవు గానీ తల్లి గారు మాత్రం సంప్రదాయశీలి. తల్లి గారు చెప్పే కథల వలనే సుంకిరేడ్డి గారికీ సాహిత్యం పై అభిలాష పెరిగింది. ముఖ్యం గా వారి అమ్మగారు బతుకమ్మ పాటలు పాడి వినిపించేవారు. సుంకిరెడ్డి 7 ; 8 తరగతులు నల్లగోండ లో చదివారు. అప్పుడే అక్కడ వున్న కోమటిరెడ్డి గ్రంధాలయం లో పుస్తకాలు చదవడం వీరు ఆరంభించినారు. ఆ అలవాటే వీరి సాహితీ విస్తృతి కీ దోహదం చేసింది. తోమ్మిదో తరగతి కీ వచ్చే సరికీ సుంకిరెడ్డి గారికీ నాటకాలపై మక్కువ పెరిగింది. ఆ మధ్యలో కోన్ని నాటక ప్రదర్శనలు కూడా స్నేహితులతో కలిసి ఇచ్చారు. పదోతరగతి ; ఇంటర్ ; డిగ్రీ లు చదివే రోజులలో వీరి తోటి విద్యార్దులు వీరి వద్ద వ్యాకరణ విషయాలను తెలుసుకోనే అంతటి ప్రతిభ ను సంపాదించుకున్నారు సుంకిరెడ్డి. నిజానికీ సుంకిరెడ్డి గారి తండ్రీ తన కోడుకు ను డాక్టర్ చేయాలనీ అభిలాషించారు. కానీ ఇతరేతర కారణాలవల్ల సుంకిరెడ్డి గారు మాత్రం అధ్యాపక వృత్తి ని ఎంచుకున్నారు.
డిగ్రీ అనంతరం యూనివర్సిటీ లో పీజీ కోర్సు కోసం చేరిన సుంకిరెడ్డి గారి జీవితం మేలు మలుపు తిరిగింది. యూనివర్సిటీ లో చేరిన తర్వాత వామపక్ష భావజాలం వీరిని విపరీతంగా ఆకర్షించింది. అప్పుడే అక్కడే ప్రముఖ యువ సాహితీ వేత్తల పరిచయం ఏర్పడింది.
తోలినాళ్ల లో శివారెడ్డి, వడ్లమూడి వంటి వారి ప్రభావం వీరి కవిత్వం లో కనిపిస్తుంది. వీరు ఒక వైపు ప్రేమ వివాహం, కుటుంబ బాధ్యతలలో తలమునకలు అయినా సాహిత్యం పై ప్రేమ ను మాత్రం వదులుకోలేదు. ప్రగతిశీల కవిత్వం రాస్తూ సాహిత్య కార్యక్రమాలలో పాల్గోనేవారు. 1977 నుంచి 1983 వరకు ఉస్మానియా రైటర్స్ సర్కిల్ కు సుంకిరెడ్డి గారు క్రియాశీలంగా పనిచేశారు. అప్పుడే ఈ తరం యుద్ధ కవిత అనే సంకలనం ను తీసుకువచ్చారు. ఈ సంకలన ప్రచురణ కోసం నిధుల కోసం యూనివర్సిటీ ఆడిటోరియం లో ఓ హిందీ సిన్మాను ఆడించి ఆ వచ్ఛిన డబ్బులతో ఈ తరం యుద్ద కవిత ను ముద్రించినారు. ఇంకా అదే సమయం లో చెరబండ రాజు గారి ప్రధమ సంతాప సభ ను నిర్వహించి ఆ సంకలనం ను వారికే అంకితం ఇవ్వడం విశేషం.
వీరి రచనలు
కవిత్వం
* తోవ ఎక్కడ (1994)
* దాలి (తెలంగాణ దీర్ఘ కవిత-2001)
* నల్లవలస (తెలంగాణ దీర్ఘ కవిత ఇతరులతో కలిసి-1998)
* విపశ్యన కవిత్వం (1886-1991)
(ఇతరులతో కలిసి)
* తావు (2016)
సంపాదకత్వం
* 1971-80 ఈ తరం యుద్ధం కవిత (ఇతరులతో కలిసి-1982)
* జమకు సాహితీ బులెటిన్ (1986-1989)
* యానగాలి శ్రీకాకుళ కవిత్వం (ఇతరులతో కలిసి-1990)
* బహువచనం- దళిత బహువచన కవిత్వం(1998)
* మత్తడి- తెలంగాణ ఆధునిక కవిత్వం (సురేంద్రరాజుతో కలిసి-2002)
* మన తెలంగాణ- నల్లగొండ జిల్లా సాహిత్య సంచిక (బైరెడ్డి కృష్ణారెడ్డితో కలిసి-2007)
* 1969-73 తెలంగాణ ఉద్యమ కవిత్వం (సంగిశెట్టితో కలిసి)-2009
* సురవరం దస్తూరి (సురవరం వ్యాసాలు-2010)
* సురవరం తేలంగాణ వ్యాసాలు (సంగిశెట్టితో కలిసి 2010)
పరిశోధన గ్రంథాలు
* ముంగిలి- తెలంగాణ ప్రాచీన సాహిత్యం (2009)
* అభ్యుదయ కవిత్వంలో మధ్యతరగతి జీవితచరిత్ర -1982
* తెలంగాణ సాహిత్య చరిత్ర
* గనుమ (అస్థిత్వ సాహిత్య వ్యాసాలు-2010)
* సంగిశెట్టి శ్రీనివాస్‌తో కలిసి శ్రీకృష్ణ కమిటీ రిపోర్టును విశ్లేషిస్తూ ఛీకృష్ణ కమిటీ పుస్తకం-2011)
* తెలంగాణ కవిత్వం - తాత్విక నేపధ్యం -1991
* తెలంగాణ సాహిత్య చరిత్ర - 2012
1983 లో ఎం.ఫిల్ ను పూర్తి చేసాక 1984 లో శ్రీకాకుళం లో లెక్చరర్ గా ఉద్యోగం సంపాదించినారు. అప్పుడే అక్కడే జముకు అనే సాహిత్య బులిటేన్ ను తీసుకు వచ్చారు. ఆ తర్వాత 1996 లో నల్లగొండ నీలగిరి సాహిత్య సమితి ద్వారా బహువచనం అనే సంకలనం తీసుకువచ్చారు. ఆ తర్వాత 1998 లో తెలంగాణ సాంస్కతిక వేదిక ఏర్పాటు లో కీలక బాధ్యతలను పోషించారు. ఇదే క్రమం లో 2002 లో తెలంగాణ అస్థిత్వం ను తెలుపుతూ మత్తడి అనే సంకలనంను వెలువరించినారు. తెలంగాణ ప్రాంత విశిష్టతను, అస్థిత్వాన్ని తన వ్యాసాల ద్వారా వెల్లడించాడు. ఇందులో భాగంగా ముంగిలి, తెలంగాణ చరిత్ర అనే రెండు గ్రంథాలను వెలువరించాడు. మరియు గుంటూరు ఏసుపాదం, గుడిహాళం రఘునాథంలతో కలిసి సముద్రాలతో సంఘర్షణలతో అనే విపశ్యన కవితా సంపుటిని వెలువరించి అస్థిత్వ ఉద్యమాలకు తాత్విక నేపథ్యాన్ని అందించాడు.వీరు 2012, మార్చి 31న చండూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రధానాచార్యులుగా ఉద్యోగ విరమణ చేశాడు. వీరి భార్య పేరు హేమలత. వీరికి ముగ్గురు కుమార్తెలు కలరు.
వీరి కవితా సంపుటాలను పరిశీలన చేస్తే తోవ ఎక్కడ దీనిలో ఎక్కువ గా విప్లవ చైతన్య కవిత్వం కలదు. కవి తోలి నాళ్లలో రాసినది కావడం చేత ఆ కాలపు పరిస్థితులు ఇందులో కనిపిస్తాయి. దీనిలో ప్రపంచీకరణ నేపధ్యంలో వీరు రాసిన కవిత జేబు
ఒక్క మెతుకు కోసమో ఐదుపైసల బిళ్ళ కోసమో
నిరీక్షించే భిక్షాపాత్రలా ఈ జేబు
ఐ.ఎం.ఎఫ్ లోను కోసం జెండాను పరిచే
ఒక దేశం లా ఈ జేబు - అంటూ దేశ ఆర్ధిక విషయాలను స్పర్శిస్తూ కవిత రాశారు. అలాగే మరో కవిత మిత్రురాలు కామేశ్వరి ఆత్మహత్య చేసుకున్న సంధర్భంలో .....
నీ నరాల్లోకీ చోచ్చూ కేళ్లే వ్యవస్థ
నీ మెదడు కణాలు ఆక్రమించి
నిన్ను నీ చేతనే హత్య చెయిస్తుంది
దాన్ని మనం ఆత్మహత్య అంటాం - అంటూ తన మిత్రురాలు పై విరిగిన అక్షరం అంటూ సంతాప కవిత్వం రాస్తారు. అదే విధంగా వీరు రాసిన మరో కవిత తర్జని. ఇందులో ఇలా అంటారు.
ముల్లు గుచ్చుకున్న పాదమే గోంతు విప్పాలి
ఆరిటాకే ముల్లు గురించి తీర్పు చెప్పాలి - అంటూ దళితుల పక్షాన దళితుల స్వరమే బలంగా వినిపించాలి అనీ కోరుకుంటారు. ఈ సమాజం దోపిడీ వ్యవస్థ లో చిధ్రమవుతున్న మనిషీ జీవితం ను గురించి చెబుతూ.....
రెప్పల కిందే ఎడార్లు
కళ్ళలోంచి అశ్రుజలం ప్రవహించేదేలా?
దుఃఖం నిషిద్దం వెలుగు నిషిధ్ధం
జీవ యంత్రానికే అస్థిత్వం - అంటూ మనిషీ జీవితం లో వ్యధ కన్నీళ్లు తప్ప ఇంకేం లేవా అంటూ అస్థిత్వం అనే కవిత రాసారు. అలాగే ఈ తోవ ఎక్కడ'సంపుటిలోనే ప్రముఖ ఉద్యమ కారుడు భిక్షమయ్య చనిపొయిన సంధర్భంలో సుంకిరెడ్డి గారు రాసిన కవిత కూడా ప్రత్యేకమైనదే. సుంకిరెడ్డి విశ్రాంత అధ్యాపకులు మాత్రమే కాదు. విశ్రాంతి ఎరుగని సాహిత్యకారులు. తావు కవితా సంకలనంలో వీరు సంధర్భానుసారం రాసిన కవితలు కలవు. తావు అంటే సాధారణంగా ''చోటు'', ''స్థలం'' అని అర్థంగా చెప్పుకుంటాము. తావు అనగా జీవించే చోటు, కలుసుకునే చోటు, మాట్లాడుకునే స్థలం. తావు'' పుస్తకంలో మొత్తం 42 కవితలు ఉన్నాయి.సుంకిరెడ్డి గారి ఊరిలో గల వాగులోని ఇసుకను రెండేళ్ళుగా నిరాటంకంగా తరలించబడుతుంది. దాని పై మూడేళ్లకు పైగా కోర్టు కేసులు జరిగినా చివరికి ఫలితం మాత్రం శూన్యం. ఈ విషయం పై కవి ఇలా అంటారు......
ప్రేమికుడు చేతులు చాస్తే
పెదవుల మీద తడి వూరినట్టు
పిల్లలు పెదవులు సాపితే
బాలింత ఎద పోంగినట్టు
కాకులు రాళ్ళేయకుంటనే అందివచ్చినట్టు
చెలమెలు చెలిమెలుగా మా వాగు - అంటూ వాగు ను వారి ఊరి పడుచుదనం గా గుండెకాయ గా పోలుస్తారు. కానీ ఈ దృష్టి అందరికీ వుండదు.
గుత్తేదార్లకు వాగు ఉత్త వేలం కుప్ప
నగరాలకు తరలించే పైసల కుప్ప
పైసాశ ఎవడు నేర్పేనో గాని - అంటూ కవి వాగు పరిస్థితి కీ బాధపడతారు. క్యాన్సర్ సోకిన అమ్మలా వాగు మారిపోయిందనీ విచారిస్తాడు చివరికీ ఇలా అంటాడు....
రోడ్లు నీళ్లకీ పర్యాయపదం కాదు
కంప్యూటర్లు నీళ్ళకీ పర్యాయపదం కాదు
ఫ్లై ఓవర్లు కార్ల రేసులు నీళ్ళ కీ పర్యాయపదాలు కానే కావు
నీళ్ల కీ నీళ్ళే పర్యాయ పదం
మా వాగు మాకు కావాలి - అంటూ నిందిస్తారు. నీళ్ల తో సమానమైన ప్రత్యమ్నానం వేరే ఏదీ లేదు అనే కవి భావన అక్షర సత్యం కదా. తావులో ఉన్న ఉత్తమ కవితలలో మరోకటి మనాది పడకు. ఇది నాటి తెలంగాణ రాష్ర్ట సాధన ఉద్యమం కోసం ఆత్మహత్యలు చేసుకుంటున్న యువతను ఉద్దేశించి రాసినది....
తమ్ముడా.....
ఆత్మ హసనం వద్దు
చినుకు రాలాదా
ఎండ పెటపెట మంటది
మొక్క ధైర్యం కోల్పోదు
అదను కోసం అర్రులు చాస్తుందే తప్ప
ఎప్పుడు ఉరి పెట్టుకొదు
----------------------------------------
----------------------------------------
సింహ గర్జన జడుపు *పుట్టిస్తుంది
కుందేలు పిల్ల ధైర్యం కోల్పోదు
సింహాన్ని బావెల దుంకిస్తుంది తప్ప
తను ఎప్పుడూ దుంకదు
----------------------------------------
----------------------------------------
మేఘ గర్జన దడ పుట్టిస్తుంది
పక్షి బేంబెలు పడదు
చావు ను సవాలు చేస్తూ
కరెంట్ తీగ మీద వాలుతుంది తప్ప
రెక్కలు ముడుచుకుని టవర్ మించి దుంకదు
----------------------------------------
----------------------------------------
గడ్డి పరకల్ని దేవులాడుకుంటున్న లేడిపిల్లకీ
పులుల హోరు వణకు పుట్టిస్తుంది
ఆహారం కాదు హసనము కాదు
చాకచక్యమై ఏగిరి దుంకుతుంది
ఇలా కవి ఉద్యమకారులు ఆత్మహత్యలు చేసుకోవద్దనీ స్పూర్తి ఇస్తారు అమ్మ పెదవి మీద పువ్వు కావాలి కానీ పగళ్లు కావోద్దనీ అర్ధిస్తాడు. అమ్మ కళ్లలో కాంతి కావాలి కానీ కన్నీరు కావ్వోద్దనీ నివేదిస్తాడు. తేలంగాణ ఉద్యమ రూపశిల్పి జయశంకర్ సార్ మరణించినప్పుడు.....
కాలం ప్రవాహం
మహావృక్షం నేలకూలింది
వేళ్ళు భూమిలోనే ఉన్నవి
------------------------------------
------------------------------------
దశాబ్దాల స్వప్నం
కనురెప్పలు మూతపడోద్దు
అంటూ దారి అనే స్మృతి కవిత రాశారు. ఈ సంపుటి లోనే మరో స్మృతి కవిత నల్లగొండ జిల్లా పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు అజం అలీ హత్య గావించబడినప్పుడు రాసిన కవిత
రాత్రే గా
తను పోస్టర్లతో కనిపించింది
తెల్లారే సరికీ
తనే పోస్టరయ్యిండు
------------------------------------
------------------------------------
రాత్రేగా
ఆ ముఖం కాపిష్కకాంతిలా
నిండుగా నవ్వింది
తెల్లారే సరికీ
మా కండ్ల నుండీ తనే బోట్టు
బోట్లు గా రాలుతున్నాడు
------------------------------------
------------------------------------
రాత్రేగా
ఆ పెదవులు ఆగ్రహంగా
కైగట్టినవి
తెల్లారే సరికీ బిడ్డ ముద్దాడ లేని స్థాణువులైనవి - అంటూ ఆంక్ష అనే కవిత రాసారు. ఇంకా చివర్లో ఆంక్షలు దూదిపిందలు అంటారు. అలాగే
కంఠంలో దిగబడిన తల్వార్ నిజం చెప్పదు
పాలిన ఈగలు రక్తమంటిన రెక్కలు బయలేల్లినవి - అంటూ ఒక వీరుడు మరణిస్తే వేల వీరులు పుట్టుకోస్తారు అనే విషయం ను గుర్తు కు చేస్తారు కవి. ఆంక్ష కవితలోని ప్రతీకలు ఆగ్రహం దుఃఖం కసి అన్నీ ఒక దృష్యం లా సాగుతుంది. మరో కవిత పోనీ. ఇది మిలియన్ మార్చ్ సంధర్భం గా రాసిన కవిత...
మేం గర్విస్తున్నాం
మీరు దుఃఖిస్తున్నదీ
ఆధిపత్యం కూలుతున్నందుకు - అంటూ ట్యాంకు బండు మీద విగ్రహాల కూల్చివేత మీద గగ్గోలు పెడుతున్న వలసవాదులకు గట్టి సమాధానం చెబుతారు. అదే విధంగా రోడ్డు కవిత లో....
మా ఊరికి రోడ్డోచ్చింది
నల్లని నదీవోచ్చినట్టు - అంటూ రోడ్డు ను నల్లటి నదీ తో పోల్చడం చక్కని ఉపమానం. వ్యవసాయ నేపథ్యం కల్గిన సుంకిరెడ్డి తన కుటుంబ జ్ఞాపకాలను, గ్రామీణ కాల్పనికతను, వర్తమాన సంక్షోభాన్ని కలగలిపి కవిత్వం రాశారు. తెలంగాణ గ్రామీణ మనుగడల సంక్షోభాన్ని, సహజ వనరుల క్షీణతను, నూతన ఆర్థిక విధానాల దోపిడీని, తెలంగాణ పరాధీనతతో కలిపి బలమైన కవిత్వ వాదనను నిర్మించిన ''తావు'' కవిత్వంలో కనిపిస్తాయి.
తావు లో కోన్ని కవితా పంక్తులు
కీటకం దేన్ని రుచింపజాలదు
విరూపం చేయగలదు తప్ప
------------------------------------
------------------------------------
చెదలు దేన్ని సృజించలేదు
ఉనికి నుసినుసి చేయగలదే తప్ప
కీటకం
కాకులన్నీ కలభాషిణులైతే
కను మరుగైతున్న కోయిల గండ స్వరమే కవిత్వం
--------------------------------------------------------------------------------
భూములన్ని మంత్ర నగర మార్కేట్ క్షేత్రాలైతే
పునరుత్ధానమైన జోన్న కంకి కవిత్వం
అల
సత్యమేప్పుడు ఒంటరిదే
దిగిన బాకు దేల్వదు గానీ
పోడిచిన చేయికీ తేలుసు
వాడిన భాష కు దేల్వదు గానీ
రాసిన కాలానికీ తేలుసు
ఒంటరి
నాగలి దున్నేప్పుడు లేచే ఏర్రటి దుమ్ము పక్కన
పార వేసేప్పుడు కారే చేమట పక్కన
నాటు వేసేప్పుడు చిట్టే గాజుల పక్కన
పద్య పాదాల్ని నిలబేట్టేవాడు కవి
కవిత్వం
మా రూపాయిని చంపి
నీ డాలర్ కి అతికించుకున్నావు ! చాలదా!
నీ కాల్గేట్ తోనే మాకు సూర్యోదయం
నీ స్క్రీన్ మీడియా తోనే మాకు నిషాచరత్వం
మూడో పాదుక
సుప్రసిద్ధ కవితా పంక్తులు
హుస్సేన్ సాగర్ తీరాన
విగ్రహాలన్నీ మీవి
శవాలన్నీ మావి
నల్ల వలస కవితా సంపుటి లోనిది
దీర్ఘ కవితలు రావడం కోత్తకాదు గానీ పూర్తి తెలంగాణ వాదం తోనే ఒక సంపుటి రావడం మాత్రం సుంకిరేడ్డి గారి దాలి తోనే ప్రారంభం.దాలి ఏక దీర్ఘ కవితా కావ్యం. శీర్షిక తెలంగాణ పదం. తెలంగాణ ప్రాంతంలో పాలు వెచ్చ చేసుకోవడం కోసం ఉపయోగించే పాత్ర ను దాలి పేరుతో పిలుస్తారు. ఈ కావ్యం లో ఎంత సహజత్వమంటే ఈ కవిత్వం చదువుతుంటే మన భాషలో మనం ఆడుతూ పాడుతూ ఉన్నట్లుంటుంది. తెలంగాణ నేలను పాలిస్తున్న వలసవాదులకు ఈ నేల మీద మమకారం లేదనేది సత్యం ఇదే విషయం పై కవి ఇలా అంటారు....
తల్లి జస్తే ఏడ్వనోడు
భూమి జస్తే ఏడ్వనోడు - అనీ ప్రశ్నిస్తాడు. వలసవాదుల అక్రమణ పాలన రాష్ర్టానికి స్లోపాయిజన్ అంటారు.
దేశమంతా బారసాల
నాకింక చెరసాల - అంటూ నిరసన వ్యక్తం చేస్తారు. ఈ కవికీ నీళ్ల విలువ తేలుసు. అందుకే అంటారు
నీల్లు కావాల్లే
ఆకిట్ల పసురం నిలవాలి
పెడ వాసన తోటి సేల్క పులిసిల్లాలి - అంటూ తెలంగాణ లో తరలించబడుతున్న నీళ్ల దోపిడీ ని నిలదీయడం చేస్తారు. తెలంగాణ ఏలాంటి ప్రాంతం అంటే నదులు నడిచిన నేల కానీ ఆంధ్ర పాలన లో అనాధ అయ్యింది...
నదులు నడిచిన నేల
నంది నడిచిన నేల
నాగల్ల కోండ్రల్ల తానమాడిన నేల
నేడు మిగిలేనులే జంగమోని పాత్ర - అంటూ ఎలాంటి గోప్ప నేల . నదులు నేల కోండ్ర ల మధ్య సాన్నం చేసిన నేల కానీ అలాంటి నేల ఆంధ్ర పాలన లో బిక్షం వేసే చేయ్యి బిక్షం అడుక్కునే స్థితి కి జంగమోని లా మారిందనీ అప్పటి వాస్తవ పరిస్థితీ చక్కని అభివ్యక్తి తో వ్యక్తీకరణ చేసారు కవి.
ఇంకా ఈ నేల గోప్పదనం చెబుతూ ఈ నేల లో హంసవై వస్తే చెరువు వోలే తోడు ఉంటుంది . దాహమై వస్తే చెలిమై తోడు ఉంటుంది అనీ చెబుతూ ఇలా అంటారు....
హంసవై వోస్తే చెరువు మావోడు
దాహమై వస్తే చెలిమె మా వోడు
బేహారివై వస్తివి
భూహారివై వస్తివి
తెల్లోని మారేశమై వస్తివి గదరా - అంటూ ఈ ప్రాంతము పై దురాక్రమణ ను సహించలేక పోయారు. అలాగే తెలుగు సాహిత్య చరిత్ర లో తెలంగాణ కవులను తక్కువ చేయడం ను ఈసడించడం ను సుంకిరేడ్డి గారు జీర్ణించుకోలేకపోయారు. ఈ ప్రాంతం కవిగా తెలంగాణ సాహిత్య స్థానం ని గుర్తు చేస్తారు.
ఎంగిలి పద్యాలనుపాతేసి
సోమనై
సోంతకైత ఆదిని నేను
ఆదికవిని నేను - అంటూ తేలంగాణ సాహిత్య వైభవం ను చేబుతారు. దీనిలోని కోన్ని పదాలు మీరు నువ్వు వారు అనే సంభోదనలు ఉన్నాయి. ఇవి మధ్యమ పురష లో వున్నాయి. ఇవీ ఏవర్ని అన్నారో ప్రత్యేకించి చెప్పాలిసిన అవసరం లేదు.
కక్కయ్య అంటే మోటోళ్లు
శిన్నమ్మ అంటే శిన్నబోతారు
నా బాసలో కలలోస్తే
కైతలోస్తే కతలోస్తే
కేసేట్టేసి
పేదవుల్ల నవ్వులు శేవులల్ల ఈటలు - అంటూ ప్రేమగా మాట్లాడే మాటలను కూడా వెక్కిరించే వారిపై కవి ధర్మాగ్రహం ప్రకటిస్తారు. దీనిలో ఆర్దిక విషయాలున్నవి నీళ్ల పై రైతులపై అన్నీ విషయాలపై నిక్కచ్చిగా చేప్పే కవిత్వం కలదు. వీటితో పాటు గా అంతర్లీనం గా తెలంగాణ సంస్కృతి నాగరికత ఏలా వలసవాదులు పతనం చేశారో తెలిపే కవిత్వం ఉంది.
గా
అమీభాగానితోని
ఔరంగజేబు తోని
నన్నంట గట్టిందెవడు రా - అనీ తెలంగాణ రాష్ర్ట కాంక్ష కూడా బలంగా వుంది. ఉద్వేగం కోపం పోరాటం అన్నీ కలగలిపేదే దాలి. మన కండ్ల ముందు రంగులు మారుతున్న హైదరాబాద్ కనుమరుగైపోతున్న దృశ్యంను ఇలా ఆవిష్కరించారు.
కన్నడిగులోచ్చిండ్రు
మరాఠీలోచ్చిండ్రు
మార్వాడీలోచ్చిండ్రు
నాల్కేగోసినా నవాబ్ నయం
పాట చేరబట్టిన నవాబ్ నయం - అంటూ దాలి ధీర్ఘవేదన కనుబడుతుంది. వలసవాదులు అన్నీ మేమే గోప్ప అనీ ప్రకటించేంత అహంకారం లో వుంటే న్యాయమైన ఆగ్రహం ప్రకటిస్తారు.
మట్టి నీకు వర్తకపు సామాను
నేల నీకు లంజే
పేగు బంధం లేని పెరడు
నీకేందుకు రా.... అంటారు అన్యాయంగా బలి చేస్తున్న దాస్యం కు ఈ మాటలు నిదర్శనం.
దాలి లో కోన్ని కవితా పంక్తులు
తాడేత్తు కేరటాలుండవ్
పిడికేలు నప్పున సల్లారుతయ్
--------------------------------------------------------------------------------
ఉప్పుదిన్న మీడియా
కంటినిండా కూర్పట్లు
----------------------------------------
----------------------------------------
నాల్కే సుట్టు తాడు
పెదిమేలేట్ల పలుకుతాయ్
----------------------------------------
----------------------------------------
ఖండాలేన్నో మీ ఖాతాల కలిస్తే
శిరీకలే మిగిలిపాయే
చాతీలన్నీ మీ పహణీల్ల చెర్తే
ఉత్త సేతులే మిగిలిపాయే
----------------------------------------
----------------------------------------
చినుకులన్ని
మీ పోలాల మీద పట్టు బట్టలయి
మా ముఖాల మీద సింకి బోంతలాయే
----------------------------------------
----------------------------------------
గోసంగి మాతంగి బాగోతులేయి
కంగాలి సినిమాల జంగిలి పాటల్దప్ప
----------------------------------------
----------------------------------------
కంచరోళ్ళ కంచంల కండ్లు ఇత్తడి ముద్దలాయే
కిర్రు శేప్పుల మీన పూలల్లిన ఆరే లబ్బరు పూవాయే
----------------------------------------
----------------------------------------
శబ్దమేదైన ఉయ్యాల వోక్కటే
నిశబ్దమేదైనా పాడే వోక్కటే
----------------------------------------
----------------------------------------
మోసే చేతులగుపించవు
పాడే ఒక్కటే కదిలి పోతుంటది
----------------------------------------
----------------------------------------
భూమి బ్లాంక్ చేక్కునీల్లు విలువను రాస్తయ్
----------------------------------------
----------------------------------------
ఇసుంట రమ్మంటే
ఇల్లు నాదంటివి
పాపమని నీడిస్తే
చెట్టు నాదంటివి
----------------------------------------
----------------------------------------
అయినోడిదైనా
కానోడిదైనా
మా కండ్లు గట్టిన
కట్టు కథలా సంతకాలు
మా కడుపు గోట్టిన
ఇసపుగీతలా సంతకాలు
మూడు కోట్ల ఏలిముద్రలదే
ఇంక ఆఖరి తశ్వ
మొత్తంగా ఇందులో మనకు తెలియని మరచిపోతున్న ఏన్నో తెలంగాణ పదాలు ఉన్నాయి. దీనిలో కోన్ని పదాలు చూడండీ. కూర్పాట్లు ( నిద్ర మత్తు) ఊశిక (మన్ను) ఆపది (ప్రమాదం) పేయి (దేహం) కిస (జేబు) బరిబాతల (నగ్నంగా ) కూరాడు (కుండ) బడ్డిక (కబడ్డీ ఆట) బర్కత్ ( భాగ్యం) బేపారి(వ్యాపారి)
వీరికి వచ్చిన పురస్కారాలు
* బి.ఎన్ శాస్త్రి పురస్కారం (తెలంగాణ చరిత్ర కు - 2011)
* ముదిగంటి వెంకట నరసింహ రెడ్డి పురస్కారం ( గనుమ రచనకు - 2014)
* ప్రో.ఎస్వీ రామారావు పురస్కారం ( ముంగిలికి - 2014)
* ద్వానా శాస్త్రి పురస్కారం ( ముంగిలికి - 2014)
* తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం ( ముంగిలికి - 2012)
* రాష్ర్ట ఉత్తమ సాహితీ వేత్త పురస్కారం (2015)
* తెలుగు విశ్వవిద్యాలయ గౌరవ డాక్టరేట్
2012 లో నేటి సి.ఎమ్ కెసిఆర్ గారి చేతుల మీదుగా ఆవిష్కర్తమైన తెలంగాణ చరిత్ర విశ్వవిద్యాలయాలలో పాఠ్యాంశం గా వుంది. అలాగే ముంగిలి పుస్తకం కాకతీయ యూనివర్సిటీ ఎం.ఏ చదివే విద్యార్ధులకు పాఠ్యగ్రంధం గా వుంది. అలాగే సుంకిరెడ్డి గారి రచనల పై ఉస్మానియా యూనివర్సిటీ లో మా గురువు గారు డా. ఏస్. రఘు గారి పర్యవేక్షణలో మా కవి మిత్రులు తండ హరీష్ గారు సమగ్ర పరిశోధన చేస్తున్నారు.
- ఐ.చిదానందం