సాహితి సవ్యసాచి జలజం సత్యనారాయణ: మంత్రి శ్రీనివాస్ గౌడ్

By telugu team  |  First Published Nov 15, 2021, 12:48 PM IST

ప్రముఖ సాహితీవేత్త, అనువాదకుడు జలజం సత్యనారాయణ మృతికి తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నివాళులు అర్పించారు. జలజం సత్యనారాయణ సవ్యసాచి అని ఆయన ప్రశంసించారు.


విద్యావేత్తగా, సాహిత్యవేత్తగా‌, అనువాదకుడిగా ప్రఖ్యాత గాంచిన జలజం సత్యనారాయణ సాహితి సవ్యసాచి అని వక్తలు కొనియాడారు. నవంబర్14న  మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని జె.జె.ఆర్. ఫంక్షన్ హాల్లో జరిగిన ప్రసిద్ధ కవి, రచయిత, అనువాదకులు జలజం సత్యనారాయణ సంస్మరణ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, యువజన సర్వీసులు, పురావస్తు, పర్యాటక, సాంస్కృతిక శాఖామంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ జలజం సాహిత్యవేత్తగా గొప్పపేరు తెచ్చుకున్నారన్నారు. 
జిల్లా కేంద్రంలో విద్యాసంస్థను స్థాపించి ఎందరో విద్యార్థులకు మార్గదర్శనం చేశారన్నారు. ప్రముఖ న్యాయవాది వి.మనోహర్ రెడ్డి మాట్లాడుతూ అటు విద్యారంగంలో ఇటు సాహిత్యరంగంలో రాణించాడన్నారు. జిల్లాలో కవులకు వేదికగా కాళోజీ హాలును అందుబాటులో ఉంచడం గొప్ప విషయమన్నారు. బుర్రి వెంకట్రామారెడ్డి మాట్లాడుతూ ఎవరితోనైనా కల్మషం లేకుండా మెలిగే వ్యక్తిత్వం జలజానిదన్నారు. 

కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఒబేదుల్లా కొత్వాల్ మాట్లాడుతూ జలజం లిటిల్ స్కాలర్స్ పాఠశాలను స్థాపించి ఎందరికో ఉత్తమమైన విద్యను అందించారన్నారు. ఆయన మరణం పాలమూరు విద్యారంగానికి తీ‌రనిలోటన్నారు. లుంబిని పాఠశాల అధినేత కె.లక్ష్మణ్ గౌడ్ మాట్లాడుతూ ఎన్నో ఇతరేతర భాషా గ్రంథాలను తెలుగులోకి అనువాదించారన్నారు. అంతకుముందు సభకు హాజరైన ఆయన అభిమానులు, కుటుంబసభ్యులు జలజం చిత్రపటానికి పూలమాలలతో నివాళులు అర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించారు. 

Latest Videos

అలాగే ప్రసిద్ధ చిత్రకారులు కూరెళ్ళ శ్రీనివాస్ చిత్రించిన జలజం చిత్రపటాన్ని ఆయన జలజం కుటుంబ సభ్యులకు అందజేశారు. జలజంపై రూపొందించిన జలజం వైబ్ సైట్ ను ప్రసిద్ధ సామాజికవేత్త, తెలంగాణ హిస్టరీ సొసైటీ అధ్యక్షులు మణికొండ వేదకుమార్ ఆవిష్కరించారు.  కాళోజీతో జలజానికి ఉన్న అనుబంధాన్ని వీడియోరూపంలో ప్రదర్శించారు. 

ఈ కార్యక్రమంలో ప్రముఖ కవులు కోట్ల వెంకటేశ్వరరెడ్డి, డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్,డాక్టర్ గుంటి గోపి‌, జగపతిరావు, రావూరి సూర్యనారాయణ, ఎస్.విజయకుమార్, జయరాములు, జలజం కళాశాల కరస్పాండెంట్ రమేష్ గౌడ్, జలజం కుటుంబసభ్యులు సుషుమ్నరాయ్, వైశుషిరాయ్, విదుషీరాయ్, నాతి రవిచందర్, దామోదర్, లిటిల్ స్కాలర్స్ పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

click me!