
ప్రముఖ కవి, కథా రచయిత దేశరాజు మొట్ట మొదటి కథా సంపుటి ‘బ్రేకింగ్ న్యూస్’ మంగళవారం ఆవిష్కృతమైంది. గత ఏడాది కరోనాతో మరణించిన మిట్నాల కృష్ణశర్మకు అంకితమిచ్చిన ఈ కథల సంపుటిని ఆయన సతీమణి మిట్నాల ప్రమీల దేవి మంగళవారం హైదరాబాద్ ఉప్పల్‌లోని స్వగృహంలో ఆవిష్కరించారు. తొలి ప్రతిని చిన్న కుమార్తె ఆశాకిరణ్‌కు అందజేశారు. కృష్ణశర్మ సంవత్సరీకం సందర్భంగా జరిగిన ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు పాల్గొని ఆయన జ్ఞాపకాలను పంచుకున్నారు.
బంధువర్గంలో, స్నేహితుల్లో, ఆఖరికి స్వల్ప పరిచయం వున్న వారికి సైతం ఆయన అడగకముందే సహాయం చేస్తారని ఈ సందర్భంగా వారు గుర్తు చేసుకున్నారు. ఆయన ఒక్కరినీ ఒక్క మాట అని ఎరుగమని, తనను నొప్పించినా.. ఆయన ఎవరినీ నొప్పించేవారు కాదని అన్నారు. రాయలసీమలోని నంద్యాలలో పుట్టి పెరిగిన కృష్ణశర్మ చెన్నైలో ఉన్నత విద్య అభ్యసించారు.
అనంతరం ఏజీ ఆఫీసులో పనిచేసి పదవీ విరమణ చేశారు. ఆయన స్వయంగా రచనలు చేయకపోయినా తెలుగు సాహిత్యంతో ఆయనకు లోతైన పరిచయం వుందని పలువురు జ్ఞాపకం చేసుకున్నారు. ‘బ్రేకింగ్ న్యూస్’ కథా సంపుటి త్వరలోనే అమెజాన్‌లో అందుబాటులో వుంటుంది. దేశరాజు గతంలో ‘ఒకేఒక్క సామూహిక స్వప్నావిష్కరణ’, ‘దుర్గాపురం రోడ్’ పేరిట రెండు కవితా సంపుటాలు వెలువరించారు.