రొట్టమాకురేవు అవార్డు -నలుగురు కవులు

By telugu teamFirst Published Nov 11, 2021, 8:49 AM IST
Highlights

కవి యాకూబ్ నిర్వహిస్తున్న కవిసంగమం ఫేస్ బుక్ గ్రూప్ నకు కొనసాగింపు రొట్టమాకురేవు అవార్డుల ప్రదానమని నారాయణశర్మ అంటున్నారు అవార్డులు అందుకుంటున్న నలుగురు కవుల గురించి నారాయణశర్మ అంచనా చదవండి.

కవిత్వంలోని వేర్వేరు తరాలను కలిపే వాహికగా కవిసంగమం నిలిచింది. దీనికి ఇంకొంత కొనసాగింపు రొట్టమాకురేవు అవార్డు. కవిసంగమానికి కొనసాగింపని మాత్రమే అనుకుంటే ఈ అవార్డును గురించి, దాని అస్తిత్వాన్ని గురించి కొంత తప్పుగా అర్థం చేసుకున్నట్టే. రెంటికీ యాకూబ్ కేంద్రం అవడం వల్ల ఈ ఆలోచన వస్తుంది. కాని కవిత్వానికి దన్నుగా నిలవడానికి ఈ రెండూ రెండు పార్శ్వాలు. ఊరును గురించి తపనపడే వాళ్ళకు ఊరు కేవలం ఒక మొదటి అడుగు మాత్రమే కాదు. తొలి అడుగునుంచి, తొలిదశనుంచి కూడదీసుకున్న బలం, తనకోసం తనతో పాటూ కన్నీళ్ళు కార్చిన, తనతో పాటు నవ్విన కొన్ని గొంతుకల ఉనికి. ఇంత ప్రపంచాన్ని అంతో ఇంతో చదవడానికి అక్షరాలు దిద్దిన నేల. రొట్టమాకురేవు యాకూబ్‌కూ, తన తండ్రి ఒడి శిలాలోలితకూ  ఇలాంటిదే. అందుకనే ఈ అవార్డులకు కొంత పురిటివాసన ఉంటుంది. 

తనను కన్న తండ్రి షేక్ మహమ్మద్ మియా అవార్డు. తనకు జీవితంపై భరోనిచ్చిన వ్యక్తి కే.ఎల్.నరసింహా రావు అవార్డు. తనతో జీవితాన్ని పంచుకుని నడుస్తున్న సహచరి శిలాలోలిత తన తండ్రిపేరిట ఇచ్చే పురిటిపాటి రామిరెడ్ది అవార్డు. ఈ అవార్డుల పూర్తి చిరునామా "రొట్టమాకురేవు అవార్డు".

 వీటిని విభజించుకోవడంలోనూ ఒక పద్ధతి ఉంది. షేక్ మహమ్మద్ మియా అవార్డును తనదైన ముద్రగల ఒక సీనియర్ కవికి, పురిటిపాటి రామిరెడ్ది అవార్డు స్త్రీజీవితాన్ని చిత్రిస్తున్న ఒక స్త్రీ మూర్తికి,  కే.ఎల్.నరసింహారావు అవార్డు కొత్తగొంతుకలకు ఇస్తున్నారు. ఈ సంవత్సరం కె.ఎల్ అవార్డు రెండు కొత్తగొంతుకలు గెల్చుకున్నాయి.

మునాసు వెంకట్
దళిత కవిత్వం తనదైన ఉనికితో ప్రారంభమైన కాలాన్నుంచి ప్రధానంగా "బహువచనం"నుంచి మునాసు వెంకట్ కవిత అందరినీ ఆకర్శించింది. అంతకన్నా ఎక్కువగా ఆలోచించవలసిన విషయాలను ముందుకు తెచ్చింది. బహుజనుల జీవితంలోని సౌందర్యాన్ని,అస్తిత్వాన్ని ఉనికిని సైద్ధాంతిక అస్తిత్వాన్ని అన్నిటికీ మించి బలమైన వ్యక్తీకరణను మునాసు కవిత్వం తెలుగు కవితకు చేర్చింది. ఈ సంవత్సరం షేక్ మహమ్మద్ మియా అవార్డు ను మునాసు వెంకట్ అందుకుంటున్నారు.

మందరపు హైమవతి   
స్త్రీవాద కవిత అనే మార్గం ఒకటి పదిలపడ్దాక వినిపించే పేర్లలో ఒకటి. నిరుపహతి స్థలం, సర్ప పరిష్వంగం, వాయిదా, సిలబస్ మార్చలేము లాంటి కవితలతో కవిత్వానికి కొత్త సంవేదనల పుటను చేర్చారు. ఈ సంవత్సరం పురిటిపాటి రామిరెడ్ది అవార్డును అందుకుంటున్నారు.

నరేష్కుమార్ సూఫీ
కొత్తగా కవిత్వం రాసేవాళ్లకు పట్టుబడని అభివ్యక్తిని సాధించిన కవిగా కనిపిస్తాడు నరేష్. పుస్తకం వేసేనాటికి నరేష్ ఏదో ఒక మార్గాన్ని ఎంచుకోకుండా తనదైన ఒక మార్గాన్ని తయారుచేసుకున్నాడు. నరేష్ కవిత్వం ఎంతగా ఉద్వేగపరచగలదో, ఎంతగా ఆలోచింపజేయగలదో అంతగా కలవరపెడుతుంది కూడా. పుస్తకం వేయడానికి మొదటిదిమాత్రమే కాని నరేష్ కవిత్వం లోతైన అనుభవాన్ని రంగరించుకున్న కవిత్వం. అభివ్యక్తిని సంతరించుకున్న కవిత్వం. మంచి కవిత్వం రాయడానికి సుదీర్ఘమైన నడక అవసరంలేదని చెప్పిన కవిత్వం. నరేష్ ఈ సంవత్సరం కే.ఎల్.అవార్డును గోపాల్‌తో భాగం పంచుకుంటున్నారు.

తగుళ్ళ గోపాల్
అందరినీ ప్రేమగా పలకరించే గొంతుక. ఆప్యాయతనిండిన పలకరింపు. అడుగడుక్కూ మట్టివాసన. తెలగాణా మట్టిగంధాన్ని పులుముకున్న బహుజన జీవన సౌందర్యాన్ని సందేశాన్ని సహజత్వాన్ని పలకరింపును పట్టుకున్న కవిత్వం గోపాల్‌ది. గోపాల్ నరేష్ తో కలిపి ఈ అవార్డును అందుకుంటున్నారు.

ఈ సందర్భంకోసం ముంతాజ్ కాలేజీ ఆవరణ. యాకూబ్, శిలాలోలిత, కవిత్వాన్ని గురించిన నాలుగు మాటలు మీ అందరికోసం ఎదురు చూస్తున్నాయి ఈ నెల 14 ఆదివారం ఉదయం 10.30 ని.లకు.

- ఎం. నారాయణశర్మ

click me!