'ప్ర‌కృతి-ప్రియురాలు-మాన‌వ‌త'... గులాబీల మల్లారెడ్డి క‌వితా సంపుటి ఆవిష్కరణ

By Arun Kumar P  |  First Published Feb 15, 2022, 9:28 AM IST

అటు ప్ర‌కృతిని, ఇటు మాన‌వ‌త‌ని ఆరాధించే స్వ‌భావం మ‌నుషుల్లో పెర‌గాల‌న్న త‌ప‌న‌తో గులాబీల మ‌ల్లారెడ్డి 'ప్ర‌కృతి-ప్రియురాలు-మాన‌వ‌త' కవితా సంపుటి రచించారని పొట్టి శ్రీ‌రాములు తెలుగు విశ్వ‌విద్యాలయం ఉపాధ్య‌క్షులు ఆచార్య తంగెడ కిష‌న్ రావు పేర్కొన్నారు. 


హైదరాబాద్: ప్ర‌కృతిని, ప‌ర్యావ‌ర‌ణాన్ని కేంద్రంగా చేసుకొని గులాబీల మ‌ల్లారెడ్డి రాసిన క‌విత్వం జ‌నాల్లో ప‌ర్యావ‌ర‌ణ చైత‌న్యం పెంపొంద‌డానికి తోడ్ప‌డుతుంద‌ని పొట్టి శ్రీ‌రాములు తెలుగు విశ్వ‌విద్యాలయం ఉపాధ్య‌క్షులు ఆచార్య తంగెడ కిష‌న్ రావు అన్నారు. ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు ప్ర‌తి ఒక్క‌రు ప‌నిచేయాల‌న్నబాధ్య‌త‌ని గుర్తు చేస్తుంద‌ని చెప్పారు. సోమ‌వారం (14 ఫిబ్ర‌వ‌రి 2022) నాడు త‌న ఛాంబ‌ర్‌లో గులాబీల మ‌ల్లారెడ్డి క‌వితా సంపుటి - ప్ర‌కృతి-ప్రియురాలు-మాన‌వ‌త - ను ఆవిష్క‌రించి ప్ర‌సంగించారు. 

వాలంటైన్స్ డే నాడు ఈ పుస్త‌కాన్ని ఆవిష్క‌రించ‌డానికి ప్ర‌త్యేక ప్రాధాన్య‌ముంద‌ని అన్నారు. అటు ప్ర‌కృతిని, ఇటు మాన‌వ‌త‌ని ఆరాధించే స్వ‌భావం మ‌నుషుల్లో పెర‌గాల‌న్న త‌ప‌న‌తో మ‌ల్లారెడ్డి గారు ఈ క‌విత్వం ర‌చించ‌డం ఆహ్వానించ‌ద‌గ్గ విష‌య‌మ‌ని తెలియ‌జేశారు.  ప్రియురాలు గురించి రాసిన క‌విత్వం మ‌హిళ‌ల‌పై ఆరాధ‌నా భావాన్ని పెంచుతుంద‌ని, వారిపై గౌర‌వ‌భావాన్ని ప్రోది చేస్తుంద‌ని చెప్పారు.

Latest Videos

ప‌ల్లెల్లోని చెరువులు కాపాడుకోవాల‌ని, సంప్ర‌దాయిక వ్య‌వ‌సాయాన్ని బ‌తికించుకోవాల‌న్న త‌ప‌న మ‌ల్లారెడ్డి క‌విత్వంలో క‌నిపిస్తుంద‌ని ఆచార్య కిష‌న్‌రావు అన్నారు. చెట్ల‌ను న‌రికివేస్తే మ‌ర‌ల చెట్లు పెర‌గ‌డం అంత సులువు కాదు, అలాగే అడ‌వులు త‌రిగిపోతే మ‌ళ్ళీ అడ‌వులు మొల‌వ‌డం సాధ్యం కాద‌ని చెబుతూ, అడ‌వులు కాపాడుకోవాల‌ని ప్ర‌బోధిస్తూ చ‌క్క‌ని క‌విత్వం రాసిన మ‌ల్లారెడ్డిని అభినందించారు.  ప‌ర్యావ‌ర‌ణ చైత‌న్యాన్ని వ్యాప్తి చేసే ఈ క‌విత్వం పాఠ‌శాల, క‌ళాశాల విద్యార్థుల చేత చ‌దివించ‌డం ఉప‌యోగ‌క‌ర‌మ‌ని అన్నారు.

అలాగే ఈ సంద‌ర్భంగా విమ‌ర్శ‌కులు గుడిపాటి మాట్లాడుతూ మ‌ల్లారెడ్డి మాన‌వ‌త గురించి రాసిన క‌విత‌లు మాన‌వీయ భావ‌న‌లు పాదుకోడానికి దోహ‌దం చేస్తాయ‌ని అన్నారు. వ్య‌వ‌సాయం గురించి, ప‌ల్లెల గురించి తెలంగాణ మాండ‌లికంలో మ‌ల్లారెడ్డి గారు చ‌క్క‌ని క‌విత్వం రాశార‌ని ప్ర‌ముఖ సాహిత్య విమ‌ర్శ‌కులు డాక్ట‌ర్ రూప్‌కుమార్ డ‌బ్బీకార్ అన్నారు. ఈ స‌భ‌లో ప్ర‌ముఖ క‌వులు ఒద్దిరాజు ప్ర‌వీణ్‌కుమార్‌, గోప‌గాని ర‌వీంద‌ర్‌, లేదాళ్ళ రాజేశ్వ‌ర‌రావు పాల్గొన్నారు. పుస్త‌కాన్ని ఆవిష్క‌రించి అభినందించిన విశ్వ‌విద్యాల‌యం ఉప‌కుల‌ప‌తి ఆచార్య కిష‌న్‌రావు గారికి  పుస్త‌క ర‌చ‌యిత  గులాబీల మ‌ల్లారెడ్డి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. 

click me!