అందుకున్నాను శీర్షికలో భాగంగా ఈ వారం “ ఒకప్పుడు ..” అందిస్తున్నారు వారాల ఆనంద్.
రెండు వారాల క్రితం ‘ఒకప్పుడు’ రాజేందర్ జింబో కవిత్వం అందుకున్నాను. కవిత్వం అందుకోవడం…చదువుకోవడం ఎప్పుడయినా ఆనందమే. ఎప్పటికప్పుడు గొప్ప అనుభవమే. ఎంతో చైతన్యం కూడా. మంచి కవితలనీ కొత్త భావనల్నీ చదవడం ప్రపంచ ద్వారాల్ని తెరవడమే. సమాజాన్నీ సమాజంలోని మనుషుల్నీ స్పృశించడమే.
మంగారి రాజేందర్ జింబో తెలుగు సాహిత్య ప్రపంచంలో చిరపరిచితుడు. కవిగా కథకుడిగా అనేక రచనలు చేసినవాడు. న్యాయకోవిదుడిగా ఇంగ్లీష్లోనూ తెలుగులోనూ అనేక గ్రంధాలు వెలువరించిన న్యాయమూర్తి. ఇట్లా పలు కోణాల్లో గత అయిదు దశాబ్దాలకు పైగా సాహితీ న్యాయరంగాల్లో ఆయన ప్రసిద్ధుడు. ఆయన ఇప్పటికి ‘హాజిర్ హై’, ‘రెండక్షరాలు’, ‘లోపలి వర్షం’, ‘చూస్తుండగానే’ కవితా సంకలనాలు, ‘రూల్ ఆఫ్ లా’, ‘జింబో కథలు’, ‘మా వేములవాడ కథలు’, ‘కథలకి ఆవల’, ‘ఓ చిన్న మాట’ కథా సంపుటాలు వెలువరించారు. జమానత్ అండ్ అదర్ స్టోరీస్, ద రైన్ ఇన్సైడ్ లాంటి అనువాదాలు వచ్చాయి. ఇంకా తెలుగులో న్యాయపాలన లాంటి ఇతరాలు కూడా రాసారు.
‘ఏవయినా అట్లాగే ఉండాలనుకోవడం
ఎంత సహజమో
అలా లేవని
బాధ పడటమూ అంతే సహజమేమో...!” - అంటూ ఇప్పుడు రాజేందర్ జింబో తన ‘ఒకప్పుడు...’ కవితా సంకలనంతో మన ముందుకు వచ్చారు.
‘ఒకప్పుడు’ చదవగానే... సరళంగా సూటిగా వుండి ఎప్పటెప్పటి అనుభవాలో ఎక్కడెక్కడి మనుషులో మనసులో గిరగిరా తిరిగారు, ఎలాంటి ఆడంబరాలూ లేని ఇంటిమేట్ కవిత్వమనిపించింది.
నిజానికి ఏదయినా సూటిగా సరళంగా రాయడం కష్టం. సంక్లిష్టంగా గొట్టుగా రాయడం సులభం. గొప్ప అనుభవాలూ అనుభూతులూ చిన్న చిన్న మాటల్లో చెప్పడానికి అవన్నీ ఆ కవిలో పూర్తిగా ఇమ్బైబ్ అయివుండాలి. ఆ కవి వాటిలో తాను పూర్తిగా సింక్ అయి పోవాలి. లేకుంటే సాధ్యం కాదు. అట్లని పొడి పొడైన, కళాత్మకత లేని ఏ కళారూపమూ నిలబడదు. శాశ్వతత్వాన్ని పొందదు.
ఒక సినిమా కేవలం VERBOSE అయి దృశ్యాత్మకం కానప్పుడు ఎట్లా చూడలేమో, PROSAIC అయిన కవిత్వాన్నీ అంగీకరించలేము. మంచి కవిత కావాలంటే సరళంగా ఉండడమే కాదు దానిలో కవిత్వాంశ వుండాలి. తడి తడిగా హత్తుకోవాలి. అందులో మనిషి కదలాడాలి, సమాజం ధ్వనించాలి. అంతర్లయగా తాత్వికత ప్రవహించాలి.
ఇదంతా కవి తనకి తానూ, తాను నివసిస్తున్న సమాజానికీ నిబద్దుడయినప్పుడే సాధ్యమవుతుంది. కవి కేవలం కవిత్వాన్నే చదివితే సరిపోదు. పలు కళాసాంస్కృతిక రంగాల్ని అవగాహన చేసుకున్నప్పుడు ఆయన దృష్టి విప్పారుతుంది. సృజన విస్తారమవుతుంది. పరిమితులూ పరిధులూ దాటి చదువరుల్ని చేరుతుంది అని నేననుకుంటాను.
ఇక మంగారి రాజేందర్ జింబో ‘ఒకప్పుడు’ కవిత్వాన్ని చదివినప్పుడు అందులో కవి వ్యక్తిగత అనుభవంలోంచి సామాజిక అనుభవంలోకి ప్రవహించడం చూస్తాం. ఆయన తన కవిత్వాన్ని తనలో తాను మాట్లాడుకున్నట్టే రాస్తాడు కానీ అది పాఠకుడిని పలకరిస్తుంది. ఎక్కువగా తన ఫీలింగ్ చెబుతున్నట్టే వుంటుంది కానీ చదువరిని నేరుగా తడుతుంది. జింబో సాధారణ మయిన అనేక విషయాల్ని కవిత్వంగా చెబుతాడు. అవన్నీ తమకూ అనిపించాయనీ పాఠకుడికి అనిపిస్తుంది. సరిగ్గా ఈ కవి అక్కడే విజయవంతమవుతాడు.
....
‘నువ్వంటే
ఒక నువ్వే కాదు
నువ్వంటే
నీ మనస్సు మాత్రమే కాదు....
నువ్వంటే మొత్తంగా
నువ్వు...’ అంటాడు జింబో
అవును కవంటే కేవలం కవే కాదు ఆ కవితో పాటు పాఠకుడూ కూడా ఉంటాడు.
అందుకే
‘పదాల మధ్య
పదాలతో జీవించాలి
పదాలను గుర్తించాలి...
పదం లేని నాడు
కవిత్వం వుండదు
కవీ వుండడు’ - అని జింబో తన కవితలో నిర్ధారిస్తాడు.
అంతేకాదు మరో కవితలో
‘రాస్తేనే కదా
మనం కూడా బతికేది..’ అనీ అంటాడు.
అట్లా కవిత్వం కవి జీవితంలో ఎంత ముఖ్యమయిందో, మొత్తంగా మనిషి జీవితంలో ఎంత ప్రభావవంతమయిందో చెప్పకనే చెబుతాడు జింబో.
ఇంకా ఆయన ‘ఓ సాయంత్రం’ లో
‘రోజు దాన్ని వదిలేస్తుంది
రాత్రి దాన్ని డిసోన్ చేస్తుంది
కానీ
నేను ఓ సాయంత్రాన్ని
నా చేతులోకి తీసుకుంటాను’ అని గొప్ప అనుభూతితో అంటాడు.
ఇక “గాయం” లో
గాయాలు చేస్తూ
అమ్మ బాపు వెళ్ళిపోయారు... అంటూ
కాలం గాయాల్ని మాన్పుతుందేమో
జ్ఞాపకాలని కాదు కదా అంటాడు.
...
ఇక వర్తమాన వస్తు ప్రపంచాన్ని గురించి స్పందిస్తూ
‘మా ఇంట్లో మనుషులకన్నా
వస్తువులే ఎక్కువ అంటాడు..
ఇప్పుడు మనిషంటే ఆన్లైన్ ... అంటూ మారిపోతున్న మనిషి లక్షణాన్ని గురించి ఆవేదన చెందుతాడు.
ఇక చత్రీ మీద మంచి కవిత రాసాడు జింబో
‘ఛత్రీ నాకు ఇష్టం వుండదు అంటూ..
వర్షంలో పిల్లలు గంతులేస్తే
నేను పక్షినై పోతాను
పాటనై పోతాను
పడవనై పోతాను అని కూడా అంటాడు. ఇక్కడ నాకు “ఓ కాగజ్ కి కస్జ్తీ బారిష్ కా పానీ..” గజల్ గుర్తొచ్చింది.
ఇట్లా ఇంటిమేట్ కవితలనే కాదు
“ఈ దేశంలో
ఓ కవి ఊచలు లెక్క పెడుతూ ఉంటాడు
మరో కవి ‘పద్మ’ కోసం నిరీక్షిస్తూ ఉంటాడు
ఇంకో కవి
జ్ఞానం వెంబడో, అజ్ఞానం వెంబడో పరిగెడుతూ ఉంటాడు..’ - అని కూడా అంటాడు జింబో తన ‘ఒకప్పుడు’ లో.
ఇట్లా ఇంటిమేట్ వాక్యాలతో ఇంటెన్సి ఫైడ్ కవిత్వాన్ని అందించాడు జింబో. ఆయనకు మనసారా అభినందనలు.