ఆద్యంతం ఆసక్తి కరంగా కొనసాగిన ఇటాలో కాల్వినో జానపద కథ ‘ది బ్లాక్ షీప్’ ను ఎ.యం.అయోధ్యారెడ్డి తనదైన శైలిలో చేసిన తెలుగు అనువాదాన్ని ఇక్కడ చదవండి.
మూలం: ఇటాలో కాల్వినో (ఇటలీ)
అనువాదం: ఎ.యం.అయోధ్యారెడ్డి
చాలా చిన్న దేశమది. చిత్రంగా ఆ దేశంలో ఉండేవాళ్ళంతా దొంగలే. చీకటైతే చాలు, ప్రతిఒక్కడూ కందీలు వెలిగించి పట్టుకొని, జేబులో మారుతాళాల గుత్తి వేసుకొని దొంగతనానికి బయలుదేరుతారు. తన పక్కింట్లోనో, ఎదురింట్లోనో దోచుకుంటారు. ఏ అర్థరాత్రి దాటిన తర్వాతో, తెలవారుతుండగానో దోచుకున్న సొమ్ముతో తమ ఇండ్లకు తిరిగొస్తుంటారు. వాళ్ళు తిరిగొచ్చేసరికి చిత్రంగా వాళ్ళ ఇండ్లు సైతం ఎవరోఒకరు దోచుకొని వుండేవారు. అట్లా పరస్పర దోపిడీలతో దేశంలో ఒకవిధమైన సమతుల్యత ఏర్పడి అందరూ సంతోషంగా కలిసిమెలిసి ఉండేవాళ్ళు.
undefined
ఏ ఒక్కరికీ లాభం లేదు. మరెవరికీ నష్టం లేదు. ఒకడు మరొకడి ఇంట్లో, ఆ మరొకడు ఇంకొకడి ఇంట్లో, అతడు మరో ఇంట్లో అట్లా జరిగిపోయేది దోపిడీ. అందరిలోకి చిట్టచివరివాడు వొచ్చి మొదటివాని ఇంట్లో దొంగతనం చేసేవాడు.
దేశంలో ఇదంతా ఒక వ్యాపారంలా జరిగిపోతూ వుంది. ఈ వ్యాపారంలో అనివార్యంగా కొనేవాడూ, అమ్మేవాడూ అందరూ మోసగాళ్లే. అసలక్కడ ప్రభుత్వమే ఒక పెద్ద నేరవ్యవస్థ. ఆ వ్యవస్థ తను పరిపాలించే ప్రజా సమూహాన్ని దోచుకోవడం దాని నైజం. అట్లాగని పాలితులైన ప్రజలేమీ తక్కువ తినకుండా అవకాశం దొరికిన చోటల్లా సర్కారును మోసగించి దండుకుంటూ వుంటారు. ఆ విధంగా ఒక విచిత్రమైన చట్రంలో యావత్ సామాజిక జీవనం ఏ ఒడుదొడుకుల్లేకుండా సున్నితంగా సాగిపోతుంది.
వ్యవస్థలో ఎవడూ సంపన్నుడు కాలేని, మరెవరూ నిరుపేద కాలేని ఒక విచిత్ర వాతావరణం కొనసాగింది.
ఎంతోకాలంగా సాగుతున్న ఈ పరిస్థితిలో హఠాత్తుగా ఒకరోజు దృశ్యం మారింది. ఓ కొత్తమనిషి రాకతో వ్యవస్థలో అనుకోని మార్పులు సంభవించినయి. అమాయకుడూ, నూటికి నూరుశాతం నీతిమంతుడైన ఓ వ్యక్తి ఆ దేశానికి బతకడానికొచ్చాడు. అతడు రావడంలో ఏ ప్రత్యేకత లేదుకానీ ఆ దేశంలో కొనసాగుతున్న విచిత్రమైన పరస్పర దోపిడీ విధానం గురించి సహజంగానే కొత్త మనిషికి తెలియలేదు. అందుకే చీకటి పడగానే అందరిలాగా మారు తాళాలు, కందీలు పట్టుకొని అతడు దొంగతనానికి పోలేదు.
అట్లా వెళ్లకుండా ఇంట్లోనే వుండి చక్కగా చుట్ట కాలుస్తూ, పుస్తకాలు చదువుతూ కాలక్షేపం చేశాడు. రాత్రి దొంగలొచ్చి చూస్తే అతనింట్లో ఇంకా దీపం వెలుగుతూ వున్నది. అందువల్ల లోపలికి పోవడం వాళ్ళకి సాధ్యపడలేదు. ఎంతోసేపు వేచి చూసినప్పటికీ నీతిమంతుడు దీపం ఆర్పలేదు. దోపిడి చేసేందుకు బయటికి పోలేదు.
ఇట్లా రెండు రోజులు గడిచాయి. పరిస్థితిలో మార్పులేదు. ఇక లాభం లేదనుకొని కొత్తగా వచ్చిన వ్యక్తికి ఈ దేశంలోని తమ దోపిడీ సంప్రదాయాన్ని గురించి తెలియజెప్పాలని భావించారు. అతని దగ్గరికి వెళ్లి విషయం వివరించి “అయ్యా.. మీరు ఇక్కడి పద్ధతి ప్రకారం రాత్రుళ్ళు దొంగతనానికి వెళ్ళడం లేదు. ఇది తప్పు. సరే, మీరు వెళ్ళండి వెళ్లకపొండి. అసలు దొంగతనమే చెయ్యకుండా వుంటే వుండండి. కానీ మా పనికి అడ్డురాకండి” అని స్పష్టంగా చెప్పేశారు. నీతిమంతునికి వాళ్ళ మాటలు అర్థం కాలేదు.
“నేను రాత్రుళ్లు ఇంట్లో వుండటం వల్ల మీకేమిటి నష్టం?” అని అడిగాడు.
వాళ్ళు ఇంకొంచెం అర్థమయ్యేలా ఆక్కడి ఆనవాయితీ గురించి అతనికి వివరించారు. నీతిపరుడు అంతావిని విపరీతంగా ఆశ్చర్యపోయాడు. అయితే వాళ్ళ పద్ధతిని కాదనలేకపోయాడు. మారు మాట్లాడకుండా చెప్పిందానికి తలూపాడు.
మర్నాటి నుంచి చీకటిపడగానే అతడు ఇంట్లో వుండకుండా బయటికి పోయి అందర్లాగే తెల్లవారుతుండగా తిరిగి రావడం మొదలుపెట్టాడు. కానీ అతడు రాత్రుళ్లు బయటికి దొంగతనాల కోసం పోలేదు. ఎందుకంటే అతడు నీతిమంతుడు. దొంగతనం చేయడం అతనికి తెలియదు. అది తప్పని తెలుసు. అతని నైజం వేరు. ఈ విషయంలో ఎవరూ ఏమీ అనలేని స్థితి. రాత్రంతా ప్రకృతిలోనో, పొలాల వెంట తిరుగుతూనో, నది వంతెన మీద కూర్చొని కింద నీటి ప్రవాహాన్ని చూస్తూనో గడిపాడు.
కానీ, తెల్లవారిన తర్వాత తిరిగొచ్చేసరికి అతని ఇల్లు దోచుకోబడింది. ప్రతి రోజూ ఇలాగే జరుగుతూ వారం గడిచేసరికి మంచి మనిషి ఇల్లు మొత్తం ఖాళీ అయింది. చివరికి అతనికి తినడానికి కూడా ఏమీ దొరకని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే అతని ఇంట్లో ఏదీ మిగల్లేదు.
ఇంత జరిగినా మంచిమనిషికి అదో పెద్దసమస్యగా అనిపించలేదు. ఎందుకంటే అది అందరిలా దొంగతనాలు చేయడం చేతకాక తెచ్చుకున్న పరిస్థితి. తన నీతి నిజాయితీల కారణంగా వచ్చింది. తన సత్ప్రవర్తనే అన్నీ కోల్పోయేలా చేసింది. తను ఇతరుల ఇళ్ళలో
దొంగతనం చేయకుండా వేరేవాళ్లకు మాత్రం తన ఇంటిని దోచుకునే అవకాశం కల్పించాడు.
మంచిమనిషి నడవడి కారణంగా ప్రతిదినం ఒక ఇల్లు దోపిడికి గురికాకుండా ఎవరో ఒకరికి ప్రయోజనం జరుగుతూ వచ్చింది. నిజానికి అతడు దోచుకోవాల్సిన ఎవరిదో ఒక ఇల్లు తెల్లారేటప్పటికి ఏమీ దోచుకోబడకుండా ఎప్పట్లాగే వుంటూ వచ్చింది. ఇది మరో పెద్ద పరిణామానికి తెరతీసింది. అతడు దోచుకోకుండా వదిలేసిన ఇళ్ల యజమానులు క్రమేపీ ఇతరుల కంటే సంపన్నులవుతూ వొచ్చారు. అట్లా ధనికులైన వాళ్ళంతా ఇంక తాము రాత్రుళ్లు కష్టపడి దొంగతనాలకు పోవాల్సిన అవసరం లేదని భావించారు. మరోవైపు ప్రతీరాత్రి నిజాయితీపరుని ఇల్లు దోచుకునేందుకు వొచ్చే ప్రతి ఒక్కరూ ఇంట్లో ఏమీలేక ఖాళీ చేతులతో వెనుదిరుగుతూ కొద్దిరోజుల్లో అనివార్యంగా వాళ్ళూ పేదవాళ్ళయ్యారు.
అనూహ్యంగా సంపన్నులైనవారు తమకు డబ్బు పెరగటంతో పాటు వాళ్ళుకూడా క్రమేపీ నీతిమంతుని మాదిరి సత్ప్రవర్తన అలవర్చుకోవడం మొదలుపెట్టారు. “ఇంక రాత్రుళ్లు దోపిడికి పోవాల్సిన పనిలేదు. నీతిమంతుని లాగే హాయిగా అట్లా ప్రకృతిలోకి వెళ్ళి గడిపేద్దాం” అని భావించారు. చీకటిపడగానే బయట ప్రకృతిలో తిరిగి, కొంతసేపు వంతెనమీద కూర్చొని నది ప్రవాహాన్ని చూసి తెల్లవారుజామున ఇళ్లకు రావడం చేశారు. ఇది అప్పటివరకూ ఉన్న వ్యవస్థలో అయోమయానికి, అస్తవ్యస్థతకు దారితీసింది. ఫలితంగా కొందరు సంపన్నులవుతుండగా మరెంతోమంది పేదలవుతున్నారు.
ఈ క్రమంలో సంపన్నులకు మరో ఆలోచన కలిగింది. వాళ్ళకో సంగతి స్పష్టమైంది. తాము రాత్రుళ్లు దొంగతనాలకు పోకుండా ప్రకృతిలో గడుపుతూ వుంటే కొంతకాలానికి తము కూడా పేదలమై పోతామని తెలుసుకున్నారు. అందుకని వాళ్లో కొత్త పద్ధతి కనిపెట్టారు. తమకోసం దోపిడీలు చేసేందుకు సేవకులను నియమించుకోవాలని అనుకున్నారు.
“తినడానికి తిండిలేని వాళ్ళకు, నిరుపేదలకు డబ్బులిచ్చి మనకు బదులు వాళ్ళతో దొంగతనాలు చేయిద్దాం” అని తీర్మానించుకున్న సంపన్నులు కొంతమంది పేదలతో ఈ మేరకు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. వాళ్ళకు వేతనాలు, కమిషన్లు నిర్ణయించారు. కాంట్రాక్టులు ఇచ్చారు. వాస్తవంగా వాళ్ళు ఇప్పటికీ దొంగలే. మరోవిధంగా ఇప్పటికీ ఒకరిని ఒకరు దోచుకుంటూనే వున్నారు. డబ్బున్నవాళ్ళు ఇట్లా కుదుర్చుకున్న ఒప్పందాల వల్ల వ్యవస్థలో అసమానతలు బాగా పెరిగిపోయాయి. ధనవంతులు మరింత ధనికులైతే పేదవాళ్ళు ఇంకా నిరుపేదలయ్యారు.
అపర కుబేరులైనవారికి ఇక దోపిడీ చేసే అవసరం ఎంతమాత్రం లేకుండా పోయింది. అదే సమయంలో వీళ్ళంతా దేశంలో అప్పటివరకూ వున్న ఆనవాయితీని కాదని తాము దోచుకోవడమే తప్ప తమనెవరూ దోచుకోకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేసుకోవాలను కున్నారు. తామెప్పటికీ ధనికులుగానే వుండిపోవాలను కున్నారు. ఎందుకంటే ఇదిలాగే వొదిలేస్తే ఆనవాయితీ ప్రకారం పేదవాళ్ళు తమ ఇళ్లను దోచుకుంటారు. అలా జరిగితే తాము మళ్ళా దరిద్రులవుతారు. అందుకని సంపన్నులు ఒక ప్రణాళిక రచించారు. తమ భద్రత కోసం, ఆస్తులు అధికారాల రక్షణ కోసం.. పోలీసు దళాలను నియమించాలని, పెద్దసంఖ్యలో జైళ్లను నిర్మించాలని నిర్ణయించారు. ఫలితంగా సంపన్నులకు పేదలను అడ్డుకునేందుకు ఒక వ్యవస్థ ఏర్పడింది. ఆ చిన్నదేశంలో ఇన్ని సమూల మార్పులు రావడానికి పరోక్షంగా నీతిమంతుడు కారణమయ్యాడు. అతడు అడుగుపెట్టిన తర్వాత కొద్దికాలంలోనే ఇవన్నీ జరిగాయి. ఇప్పుడా దేశంలో బహిరంగంగా ప్రజలెవరూ దోపిడీ చెయ్యడం, దోచుకోబడటం గురించి మాట్లాడటం.. చర్చించడం మానేశారు.
అంతిమంగా వ్యవస్థలో ఇప్పుడు రెండే వర్గాలు ఏర్పడ్డాయి. ఒకటి ధనికులు, రెండు పేదవాళ్ళు. అయితే నైతికంగా చూస్తే వాళ్ళంతా దొంగలే. కానీ మొదటినుంచీ నీతిమంతుడైన మంచిమనిషి మాత్రం కొద్దికాలానికే తినడానికి కూడా తిండిలేక ఆకలిచావు చచ్చాడు.
***
ఇటాలో కాల్వినో బయోగ్రఫీ
ఇటలీ లెజండరీ రచయిత ఇటాలో కాల్వినో కథకుడు, నవలాకారుడు, పాత్రికేయుడిగా సుప్రసిద్ధులు. విభిన్నమైన ఇతివృత్తాలతో ఆయన చేసిన ఊహాత్మక రచనలు ఇరవై శతాబ్ది ఇటలీ కాల్పనిక రచయితల్లో అగ్రగామిని చేశాయి. కథ, నవల, జానపద కథలను కొత్త రూపాలలో చిత్రించి జీవం పోశారు.
1923 అక్టోబరులో క్యూబాలోని శాంటియాగో డి లాస్ వేగాస్ లో జన్మించారు. చిన్నతనంలోనే ఆయన కుటుంబం క్యూబాను విడిచి ఇటలీలోని స్వంత ఊరు తిరిగొచ్చింది. తన మెట్రిక్ చదువు పూర్తికాగానే ఇటలీ సైన్యంలో పనిచేయమని వచ్చిన ఆదేశాల మేరకు రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ప్రతిఘటన దళంలో చేరి పనిచేశారు. ఇటలీ జర్మనీ స్వాధీనమైన రెండేళ్ల కాలం అజ్ఞాతంలోనే గడిపారు. 1945 లో యుద్ధం ముగిశాక ఆయన కమ్యూనిస్టు పార్టీలో చేరాడు. సాహిత్యంలో డిగ్రీ చదువు కోసం వర్సిటీలో చేరి మరోపక్క కమ్యూనిస్టు పత్రిక ఎల్ యునిటాలో పనిచేశాడు. అప్పుడే వామపక్ష పత్రికలకు రచన సాగించారు.
కాల్వినో ఆధునిక జీవనగతులను చిత్రించే క్రమంలో ఫాంటసీ, కల్పితాన్ని, హాస్యాన్ని మిళితం చేసి అదే క్రమంలో సాహిత్యరూపాల్ని సరికొత్తగా పునర్నిర్వచించారు. ఆయన రాసిన తొలి రెండు నవలలు ప్రతిఘటన దళంలో తన అనుభవాల ప్రేరణతో రాసినవే. మొదటి నవల 1947 ‘ది పాత్ టు ది నెస్ట్ ఆఫ్ స్పైడర్స్’ తనచుట్టూ వున్న వయోజనులు, సంఘటనల నడుమ కౌమారదశలోని ఒక యువకుని నిస్సహాయ అనుభవాల దృక్కోణంలో ప్రతిఘటనను వీక్షిస్తూ రాయబడింది. 1949 లో ‘ఆడమ్,వన్ ఆఫ్టర్ నూన్’ కథల సంకలనం వచ్చింది. 1950 దశకంలో కాల్వినో నిర్ణయాత్మకంగా ఫాంటసీ, ఉపమానం దిశగా మళ్ళాడు. ఈ కాలంలోనే తనకు అంతర్జాతీయ ఖ్యాతి ఆర్జించిన మూడు గొప్ప రచనలు చేశారు. వీటిలో మొదటిది ‘ది కలోవెన విస్కౌంట్’. ఒక ఫిరంగి పేలుడు ద్వారా ఒక మనిషిలో మంచి సగం, చెడు సగం అని రెండుగా వీడిన రూపక కథ. అతడు ఒక రైతు అమ్మాయితో ప్రేమ ద్వారా తిరిగి సంపూర్ణమవుతాడు. అత్యంత ఆదరణ పొందిన మరో ఫాంటసీ ‘ది బరోన్ ఇన్ ది రీస్’ 19వ శతాబ్దికి చెందిన ఒక ప్రముఖ వ్యక్తి విచిత్ర కథ. వాస్తవం ఊహల నడుమ పరస్పర చర్యలను, ఉద్రిక్తతలను చమత్కారంగా విశ్లేషిస్తుంది. 1959 లో వచ్చిన ‘ది నాన్ ఎగ్జిస్టెంట్ నైట్’ వెటకారంతో కూడిన ఇతిహాసిక కథ.
1956 లో వచ్చిన ఇటాలియన్ ఫోక్ టేల్స్ పుస్తకం ఆయన్ని అగ్రశ్రేణి రచయితల సరసన నిలబెట్టింది. ఇటలీలోని అన్నీ ప్రాంతాల మాండలికాల నుంచి 200 జానపద కథలను సేకరించి తనదైన శైలిలో సంకలనం చేశారు. విమర్శకులు దీన్ని అపూర్వ చారిత్రక ప్రాధాన్యం గల గ్రంథమని కితాబు ఇచ్చారు. ‘ది వాచర్’ అనే మూడు కథల మరో సంపుటి 1963 లో వచ్చింది. కాల్వినో రచనా జీవితమంతా ఎందరో రచయితలు విస్మరించిన వాస్తవాలకు అద్దంపట్టే కొత్త సాహిత్య రూపాల కోసం నిరంతరం శోధన కొనసాగిస్తూ వొచ్చారు. టి-జీరో, కాస్మికామిక్స్, ఇన్విజిబుల్ సిటీస్, ది కాజిల్ ఆఫ్ క్రాస్డ్ డెస్టినీస్, ఇఫ్ ఆన్ ఏ వింటర్స్ నైట్ ఏ ట్రావెలర్ ఆయన ఇతర ముఖ్యమైన నవలలు. ఎల్ యునిట బహుమతి, రిక్కియాన్, సెంట్ విన్సెంట్ బహుమతి, బగుట్ట బహుమతి, సలేంటో, ఆస్తి, ఫెల్ట్రినెల్లి , ఆస్ట్రియన్ స్టేట్, వరల్డ్ ఫాంటసీ ఆయన పొందిన అవార్డుల్లో కొన్ని. ఆయన జీవితం ఆధారంగా చలన చిత్రాలు వొచ్చాయి. కాల్వినో 1985 సెప్టెంబరు 19 న మరణించారు. ఆయన పేరొందిన జానపద కథ ‘ది బ్లాక్ షీప్’ కు ఇది తెలుగు.