చిలుకూరి రామ ఉమామహేశ్వర శర్మ జీవన కథ "నేనూ శాంత కూడా"

By Arun Kumar P  |  First Published Apr 3, 2022, 5:02 PM IST

చిలుకూరి రామ ఉమామహేశ్వర శర్మ  జీవన కథ "నేనూ శాంత కూడా" పైన విశాఖపట్నం నుండి మూర్తి కెవివిఎస్ రాసిన సమీక్ష ఇక్కడ చదవండి : 


చిత్రవర్ణ పాటు 'నేనూ శాంత కూడా'

"నేనూ శాంత కూడా" అనే జీవన కథని చదవడం ముగించిన పిమ్మట రెండు మాటలు రాయాలనిపించింది. చిలుకూరి రామ ఉమామహేశ్వర శర్మ గారు తన జీవన పయనాన్ని ఈ పుస్తకంలో రమారమి 360 పేజీలలో వివరించారు. నిజానికి ఈ పుస్తకాన్ని కొన్ని నెలల క్రితం ఎక్కడో పుస్తకాల షాప్ లో చూశాను గాని చదవడం కుదరలేదు.  కారణం ప్రత్యేకించి ఏమీలేదు.  అయితే అలజంగి మురళీధర రావు గారు తమ వాట్సప్ సందేశం లో ఓసారి ఈ పుస్తకం గురించి చెబుతూ భద్రాచలంలో పుట్టి ఆ పరిసరాల్లో పెరిగిన ఓ పోలీస్ అధికారి తమ జీవిత పయనాన్ని ఓ పుస్తకంగా రాశారు. మీకు ఏమైనా తెలుసా అని కవర్ పేజీని పంపారు.

Latest Videos

కొద్దిగా బుర్రకి పదును పెట్టగా అప్పుడు నాకు గతం అంతా సినిమా రీలులా నా ముందు తిరిగింది.  సుమారుగా మూడున్నర దశాబ్దాల కిందట ఈ మనిషిని కలిశాను, మాట్లాడాను.  ఎక్కడా అంటే చర్ల జూనియర్ కాలేజ్ లో ఇంగ్లీష్ లెక్చరర్ గా ఉన్న కోటేశ్వర్రావు గారి దగ్గరకి శర్మ గారు ప్రైవేట్ కి వస్తుండేవారు.  ఆ విధంగా తెలుసును.  అయితే ఆ తర్వాత నిరవధికంగా కొన్ని దశాబ్దాల పాటు తనతో ఎలాంటి మాటామంతీ లేదు. ఓసారి కోటేశ్వర్రావు గారు ఖమ్మంలో కలిసినపుడు ఈయన పోలీస్ శాఖలో అధికారిగా పనిచేస్తున్నట్లు మాటల మీద తెలిసింది.

వెంటనే పుస్తకాన్ని ఆన్ లైన్ లో తెప్పించుకుని చదివాను.  శర్మ గారి శైలి చెయ్యి తిరిగిన రచయిత వలె అనిపించింది. ఒక్కసారిగా ఆ రోజుల్లోకి వెళ్ళిపోయాను.  భద్రాచలానికి గంటన్నర ప్రయాణంలో ఉండే సత్యనారాయణపురంలో ఉండేవారు.  ఆ పక్కనే కలివేరు. భద్రాచలం డివిజన్ లో అనేక సంస్కృతులు కలిసిపోయి ఉంటాయి.  గిరిపుత్రుల సంస్కృతితో పాటు గోదావరి జిల్లా, తెలంగాణా జిల్లా పెనవేసుకున్నట్లుగా ఉంటాయి.  మరోవేపు చత్తీస్ఘడ్, ఇంకో వేపు ఒడియా మనుషులూ తిరుగుతుంటారు నానా పనుల మీద.  రెండు రాష్ట్రాల సరిహద్దులూ దగ్గరే.  ఇలా ఈ డివిజన్ అనేక జీవ నాడుల సంగమం.

 కూచిభొట్ల పార్ధసారధి గారు, చింతలపూడి వెంకటేశ్వర్లు గారు ఇలాంటి ఉపాధ్యాయుల గురించి చదివినపుడు వారితో మళ్ళీ మాట్లాడుతున్నట్లుగా అనిపించింది.  ఆ యిద్దరూ నాకు బాగా తెలిసినవారే.  పేరంటపల్లి వెళ్ళడం అక్కడ నిద్ర చేయడం నా అనుభవాల్ని నెమరేసుకునేలా చేసింది.   వెంకటేశ్వర్లు గారికి సాహసయాత్రలు చేయడం లో ఆసక్తి ఎక్కువ.  ఆయన సకలకళా వల్లభుడు అని చెప్పాలి.  కొత్తగూడెంలో శర్మ గారి చదువు ఇంకా ఇతర అనుభవాలు ఆసక్తి గా ఉన్నాయి.

ప్రైవేట్ గా డిగ్రీ చదివి ఎస్.ఐ .గా ఉద్యోగం సంపాదించడం ఆ తర్వాత రిటైర్ అయ్యే నాటికి  నాన్ కేడర్ ఎస్.పి గా తన ప్రస్థానాన్ని కొనసాగించడం గొప్ప విషయం.  జీవితం లో ఎన్నో ఎత్తుపల్లాల్ని, ఒడిదుడుకుల్ని ఎదుర్కొని విజయవంతమైన వ్యక్తిగా నిలిచారు.  వాటినన్నిటిని చాలా విపులంగా మనతో పంచుకున్నారు.  అన్నివిధాలా సహకరించే అర్ధాంగి దొరకడం అన్నిటికన్నా గొప్పవరం.  శాంత గారు ఆయన జీవితంలోకి ప్రవేశించడంతో శర్మ గారి జీవితం సుసంపన్నమైంది.

తన ఉద్యోగ జీవితంలోని అనుభవాల్ని చాలా పేజీల్లో వర్ణించారు. రకరకాల జిల్లాల్లో రకరకాల అనుభవాలు. వ్యక్తిగత జీవితంలోని ప్రత్యేక ఘటనలు, వాటిని అధిగమించిన తీరు హాయిగా రాశారు.  కొసావో సందర్శన, అక్కడి పని అనుభవాలు ఆసక్తికరంగా ఉన్నాయి.  ఎన్నో వత్తిడుల మధ్య కూడా సాహితీపిపాసని కలిగిఉండడం, దాన్ని కొనసాగిస్తూ రచయితల సమావేశానికి ఆతిథ్యమివ్వడం అభినందించదగిన విషయం.  ఏ మాత్రం అవకాశం ఉన్నా ఈ పుస్తకాన్ని చదవండి. ఈ పుస్తకంలోని కొన్ని ప్రత్యేక అంశాలు మీకు మరెక్కడ కనబడవు.  ఎందుకంటే ప్రతి మనిషి జీవితం తనకే సొంతమైన ఒక చిత్రవర్ణ పటం వంటిది. 

(వెల: రూ.250, పేజీలు : 362 , ప్రతులకు: ప్రముఖ పుస్తక కేంద్రాలు మరియు అమెజాన్ లో కూడా లభ్యం)
 

click me!