రాజకీయ అస్తిరతతో అతలాకుతలం అవుతున్న ఆఫ్గనిస్తాన్ లో 'అక్కడేంజరుగుతోంది' అంటూ ఆవేదనతో కాకినాడ నుండి సుంకర గోపాల్ రాసిన కవిత ఇక్కడ చదవండి.
అక్కడేం జరుగుతోంది
స్వేచ్ఛను తుపాకీతో కాల్చుకుని
హింసను హాయిగా తింటున్నారు
మనిషిని చూసి
మనిషి వేల కిలోమీటర్లు
పారి పోతున్నాడు
హక్కులు ,చట్టాలు
చూపును కోల్పోయాయి
బతకడానికి బెత్తెడు చోటు కోసం
ప్రాణాలు కంచెలు చాటుతున్నాయి
స్త్రీల మనసుల్లో
రాతియుగపు పనిముట్లు
గుచ్చుకున్న చప్పుడు
శరీరంలోకి విషం చిమ్ముతున్న
ఆకుపచ్చ పాములు
అక్కడేం జరుగుతోంది
గుంజకు కట్టేసిన
బలి పశువు కంట్లోని భయం
అక్కడ యథేచ్ఛగా
కాళ్లాడిస్తుంది
ఇప్పుడా దేశం
నాలుగు దిక్కుల్లో
తూటాలు రాజేసిన
నిప్పుల సెగలో
తల క్రిందులగా వేలాడదీసిన
మనిషి దేహంలా ఉంది
ఏపుగా పెరిగిన విధ్వంసానికి
గాయపడ్డ గుండెలు
వాడిన పూల్లా రాలుతున్నాయ్
అన్నీ
వాళ్ళ సొంతమే గాని
ఏవి తమవి కావని
నిరాశను నెత్తి మీద పెట్టుకుని
ఆశల్ని బుడగల్లా పగలు గొడుతున్నారు
ఏ వెలుగు లేదు
ఏ వెన్నెల రాదు
రాజ్యం నిండా
అశాంతి జ్వాల
అమనుషుల హేల
అధికార కాంక్షతో
మొద్దుబారిన హృదయాలు
కన్నీళ్లకు కరగవు
రక్తం తాగే పెదవులకు
ఓర్పు, సహనం వ్యర్థ పదాలు
ఇప్పుడు
ఏ అల్లా రాడు
ప్రవక్త ప్రేమ సూత్రాలు ఉండవు
గాంధార రాజ్యాన్ని
కన్నీళ్లు, రక్తం కాపాడవు
తుఫాను గాలిలా
విరుచుకు పడటమే
పిడికిళ్ళు మండించడమే
ఇప్పుడు చెట్లు ఊపిరి బిగపట్టాలి.