అందుకున్నాను: సచ్చిదానంద కవిత్వం ‘నేను రాసేటప్పుడు’

By telugu team  |  First Published Aug 30, 2021, 2:12 PM IST

అందుకున్నాను శీర్షికలో భాగంగా ఈ వారం‘నేను రాసేటప్పుడు’  ‘WHILE I WRITE’ by K.SATCHIDANDAN అందిస్తున్నారు వారాల ఆనంద్ .


ఇటీవలే సుప్రసిద్ధ మలయాళీ,ఆంగ్ల భాషా కవి, రచయిత,అనువాదకుడు కే.సచ్చిదానందన్ రాసిన ‘నేను రాసేటప్పుడు ’ (WHILE I WRITE) అందుకున్నాను. మలయాళ కవిత్వంలో ఆధునికతకు పాదులు వేసిన కవుల్లో ముందు వరుసలో వున్న సచ్చిదానందన్ వివిధ భారతీయ ప్రపంచ భాషల కవిత్వాన్ని మలయాళంలోకి విరివిగా అనువాదం చేసారు. ఆయన మలయాళం లోనే 60 కి పైగా పుస్తకాలు వెలువరించారు. వాటిలో 21 స్వీయ కవితా సంకలనాలు, 20 కి పైగా అనువాద సంకలనాలు, పలు నాటకాలు, వ్యాసాలూ, యాత్రా రచనలు, ఆంగ్లంలో పలు విమర్శనా గ్రంధాలు వెలువరించారు. అంతే కాదు ఆయన సమగ్ర కవితా సంకలనం కూడా వెలువడింది.

"Poetry as I conceive it is no mere combinatorial game; it rises up from the ocean of the unsayable, tries to say what it cannot stay, to name the nameless and to give a voice to the voiceless” అన్నాడు సచ్చిదానందన్.

Latest Videos

ఆధునిక కవిత్వం మరాఠీలో మర్దేకర్, కన్నడలో ఆడిగ, హిందీలో ముక్తిబోద్ ల తర్వాత చాలా కాలానికి మలయాళంలో 1960ల్లో ఆరంభమయింది. అదునికత ఎన్.వి.కృష్ణా వారియర్ రచనల్లో మొదట ధ్వనించినప్పటికీ ముఖ్యంగా అయ్యప్ప ఫనిక్కర్, కక్కడ్, అత్తూర్ రవివర్మలతో ఆధునికత విస్తరించిందని చెప్పుకోవచ్చు. వారి రచనల ప్రభావం సచ్చిదానందన్ పైన ఆయన తరం పైన గొప్పగా వుంది అనవచ్చు. సచ్చిదానందన్ కవిత్వంలో ఆధునికతతో పాటు, సరళత, సూటిదనం, ప్రతీకాత్మకత, ముఖ్యంగా వ్యంగం కనిపిస్తాయి. ఆయన కవిత్వం నిండా న్యాయం,స్వేచ్చ, ప్రేమ, ప్రకృతి, భాష, మరణం ప్రధాన అంశాలు. సచ్చిదానందన్ కి  కేవలం కవిత్వమే కాదు సంగీతం, పెయింటింగ్, సినిమాల పట్ల గొప్ప ఆసక్తి వుంది. వాటిని అధ్యయనం చేసి అనుభూతించే తత్వమూ వుంది. కేరళలో ఫిలిం సొసైటీ ఉద్యమం ఉదృతంగా వున్న 70 లలో అంటే అదూర్ గోపాలక్రిష్ణన్ చిత్రలేఖ ఫిలిం సహకార సంఘం ఏర్పాటు చేసి ‘స్వయంవరం’ రూపొందించి గొప్ప విజయాన్ని సాధించిన కాలం అది. అప్పుడే సచ్చిదానందన్ తాను అధ్యాపకుడిగా పని చేసిన ఇరింజలకుడా లో ఫిల్మ్ సొసైటీ స్థాపించి ఐసెన్ స్టీన్, గోడార్డ్, టార్కోవిస్కి, కురుసోవా, ఆన్జేలోపోలస్ లాంటి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన దర్శకుల సినిమాలతో రిట్రోస్పెక్తివ్ లను నిర్వహించాడు.

కవి అనేవాడికి కవిత్వం మినహా మరే మతమూ ఉండాల్సిన అవసరం లేదంటాడు సచ్చిదా. అంతే కాదు ‘I can be spiritual without being religious’ అనికూడా అన్నాడు.సచ్చిదానందన్ కవిత్వం ఇప్పటికే అరబిక్, అస్సామీ,బెంగాలీ, ఇంగ్లిష్, ఫ్రెంచ్, జర్మన్,గుజరాతీ,మరాఠీ, కన్నడ, తెలుగు, లాత్వియన్, ఉర్దూ భాషల్లోకి అనువదించబడింది. 1946 లో త్రిస్సూర్ ప్రాంతంలోని పుల్లూట్ లో జన్మించిన సచ్చిదానందన్ ఆంగ్ల సాహిత్యంలో కేరళ విశ్వవిద్యాలయంలోనూ, డాక్టరేట్ ను కాలికట్ విశ్వవిద్యాలయం లోనూ పూర్తి చేసారు. తన తొలి కవితా సంకలనం ‘అంచు సూర్యన్’(అయిదుగురు సూర్యుళ్ళు)ను 1970 వెలువరించారు. అప్పటినుంచి అవిశ్రాంతంగా రచనలు చేస్తూ ఫనిక్కర్ సూచనల మేరకు అధ్యాపత్వాన్ని వదిలి ధిల్లీలో సాహిత్య అకాడెమి పత్రిక ఇండియన్ లిటరేచర్ కు సంపాదకుడిగా చేరిపోయారో అనంతరం అకాడెమి కార్యదర్శిగా పదేళ్ళు పనిచేసారు. అనంతరం ఇందిరా గాంధీ ఓపెన్ యూనివర్సిటీ లో స్కూల్ అఫ్ ట్రాన్స్లేషన్ లో ఆచార్యుడిగా పనిచేసి పదవీ విరమణ పొందారు. అనేక భారతీయ భాషా కవులతో పాటు అనేక మంది అంతర్జాతీయ కవుల రచనల్ని మలయాళీ భాషలోకి అనువదించారు. పోలాండ్, ఇటలీ తో సహా పలు జాతీయ అంతర్జాతీయ అవార్డులు అందుకున్న సచ్చిదానందన్ పైన దర్శకుడు బాలూ మీనన్ బయోపిక్ రూపొందించి విడుదల చేసారు.

ఇట్లా కేరళనే కాదు మొత్తంగా దేశం గర్వించదగ్గ కవి సచ్చిదానందన్.

ఆయన రాసిన  ‘నేను రాసేటప్పుడు’  WHILE I WRITE లోంచి రెండు కవితల అనువాదాలు మీకోసం.....

మూలం : కే.సచ్చిదానందన్

తెలుగు స్వేచ్చానువాదం: వారాల ఆనంద్  


‘నడవ’ కారిడార్ 

చాలాకాలంగా ఈ దారెంబడి 
నడుస్తూనే వున్నా 
కానీ 
నా గదికి చేర లేకపోతున్నా
ఈ దారేమో 
భూమధ్య రేఖలా 
గుండ్రంగా సాగుతూనే వుంది
నిప్పుల కుంపటి లాంటి ‘సహారా’ను 
ఈ పాదాలతో దాటడం కష్టం
గడ్డకట్టిన ఆర్కిటిక్ సముద్రం 
ఈతకొట్టడాన్ని అనుమతించదు
నాకు తెలుసు 
నా గది ఎక్కడో ఒక చోట వుంది 
. . .

ఎప్పుడూ కలవని 
ఓ నిజమయిన మిత్రుడు
ఎప్పుడూ రాయని 
ఓ నిజమయిన కవిత
ఆ గదిలో నాకోసం ఎదురు చూస్తున్నారు 
. . .
ఆ దారెంబడి వెళ్తున్న వాళ్ళని అడిగాను 
ఈ దారెటు వెళ్తుందని 
పాపం 
వాళ్ళకూ తెలియదు
గది తెరవడానికి తమ వద్ద 
తాళం చెవులు లేకున్నా 
వాళ్ళు కూడా తమ తమ గదులకోసం 
వెతుకుతూనే వున్నారు.

--------------------------

వీడ్కోలు 

పట్టాల మీద ఆన్చిన తల
పరుగు పరుగున సమీపిస్తున్న రైలు చేసే 
దడ దడ శబ్దాన్ని వింటూ
ఇనుప చక్రాల కింద 
తన గొంతు 
నలిగిపోక ముందు ఆలపించే 
కలలు నిండిన గీతం
మన కవిత్వం .

click me!