అఫ్గనిస్తాన్ సంక్షోభంపై శాంతి కవిత: గాంధారి

By telugu teamFirst Published Sep 3, 2021, 3:08 PM IST
Highlights

అల్లకల్లోలంగా ఉన్న ఆఫ్గనిస్తాన్ నెత్తుటి తడి చరిత్ర మీద హైదరాబాద్ నుండి శాంతి రాసిన 'గాంధారి' కవితలో చదవండి.

అప్పుడన్ని జెండాలు ఉండేవికావు...
ఇన్ని జగడాలూ జరిగేవి కావు!
ఏ తుపాకీ నీడలు, నాగజెముడు పొడలూ
తనువుని తాకి భయపెట్టేవి కావు!
హిందూకుష్ పర్వత సానువుల్లో
గాంధారం గర్వంగా తల ఎత్తుకు తిరిగేది!
అమృతకలశంలా కుశలంగా ఉండేది!
ఆకాశం అద్భుత శిల్పాల్ని
ఆసాంతం మబ్బుల్లోనూ చెక్కేది!
రూమీ రచనల ద్రాక్షరసం తియ్యగా పంచేది!

పాష్తూన్ 'పాకూ' లను పాగాలుగా ధరించి
పౌరులంతా వేడుకల్లో పరవశిస్తూ
ముచ్చటైన 34 పరగణాలలోనూ ఆడి,పాడే వారు!
హీరాత్ లో సంగీతం హృదయ తంత్రులను మీటుతుంటే...
సూఫీ సుద్దులు జీవితపు సరిహద్దుల్ని
సరళంగా సంయమనంతో తాకుతుంటే...
పరదాలు వేయని ఆఫ్ఘన్ పొద్దులు
సరదాగా తల్లిలా ప్రేమతో హత్తుకుంటూ అనునయించేవి!

కానీ, ఇదేమిటి.. ఇవాళ.. ఇలా..???!!!

ముష్కరుల మౌఢ్యంలో ముషాయిరాలన్నీ మూలబడ్డాయి!
తాలిబాన్ తల్లడిల్లే తాకిడికి
మాదకద్రవ్యాల సాగులో మత్తెక్కిన మాతృభూమి
మతిభ్రమించి విషం చిమ్ముతోంది!
సంగీతం, సారస్వతం, స్వప్నాలు... సర్వం చిధ్రమై పోయాయి!
ఎడతెరిపిలేని యుద్ధాలు చేసి, చేసి
అలసిన గాయాలను పూడ్చుకుంటూ
ఏరుకున్న నెత్తుటి శకలాలను పేర్చుకుంటూ
పూనుకొని పునర్నిర్మాణం పురవీధుల్లో చేస్కుంటున్న
రెండు దశాబ్దాలు రంగులీనిన ప్రజాస్వామ్యం...
నేడు రక్తంలో తడిసి, రెల్లుగడ్డి దుబ్బలా నరికి వేయబడింది!
కంఠాలకు హారాల బదులు 'కొలష్నికోవ్' భారాలని
మొరాయించే బతుకు మీద దాడి చేస్తూ మొరటుగా మోయిస్తోంది!

నింజా యోధుల్లా నిద్రపోకుండా
'పాంజ్ షేర్' లోయ నుంచీ
పోరాడుతున్న సింహాల పంజా దెబ్బ
ఈ పోకిరీలను ఇంకెంతకాలం నిలువరించగలదు?!
నయా-తాలిబాన్ నయవంచనలో
మీనా అసాదీ, సహారా కరీమీ, సఫియా ఫిరోజా లాంటి
జాతి స్త్రీ రత్నాల ధృడ సంకల్పాలు
'షరియా' ఉక్కు సంకెళ్ళనెంతవరకూ తెంపగలవు?!

ప్రయోగాల పేరిట ఈ గడ్డ మీద
నాటిన జెండాలూ.. వేసిన విదేశీ పాదముద్రలూ...
అవహేళన పాలైన అగ్రరాజ్యాల అభయ హస్తాలూ...
ఏ ఒక్కటీ ఆశ్వాసననూ, ఆచ్ఛాదననూ ఇవ్వలేక
ఉగ్రవాదుల దాష్టీకంలో ధైర్యంగా నిలువలేక
అన్నీ పీలికలై చీలికలై పోయిన నిశ్చేతనత్వమే...!!
బురఖాలు కప్పి బూతులు తిట్టి నట్టింట్లో తొక్కిపట్టి
నలుగుర్ని నిఖా చేసుకుని నగుబాటు చేస్తాననే
భయ పూరిత భరోసాలిచ్చే భల్లూకాలకు
ఒక్క కామవాంఛకే స్త్రీ దేహాలు కనుక
పరదాల వెనుక డొల్ల తేరి నెత్తురోడుతూ
నవ్వటమే మరిచిపోయిన అమాయకపు నగ్నత్వమే....... !!!
"ఓ ప్రపంచ మేధావుల్లారా
ఆఫ్గాన్ స్త్రీలను కాపాడండ"నే
ఆర్ద్రత నిండిన అరుపు...ఆక్రోశన...
గొంతు కవాటం దాటని శూన్యత్వమే......!!!

click me!