శ్రీరామోజు హరగోపాల్ కవిత : నువ్వు, నేను, ఓ లడాయి

By SumaBala BukkaFirst Published Oct 24, 2023, 1:50 PM IST
Highlights

మిగిలిపోయిన గోడకోసమా? ఒకే ఒక్క మసీదుకోసమా ఈ యుద్ధం ?? అంటూ శ్రీరామోజు హరగోపాల్ రాసిన కవిత  ' నువ్వు, నేను, ఓ లడాయి ' ఇక్కడ చదవండి : 
 

ప్రియాతిప్రియమైన నీకు,
నీ సాన్నిధ్యంలో నేను మైమరచి ఉన్నపుడు
ఇజ్రాయిల్, గాజాల మీద యుద్ధం బాంబులు వేసింది
పిల్లలు, తల్లులు, తండ్రులు - సైనికులు చనిపోయారు
మిగిలినవారికోసం తూటాల మీద 
పేర్లు రాస్తున్నట్టు సమాచారం
దుఃఖం కంఠంలో సోయితప్పింది
నిన్ను కూడా చూడనీయని కన్నీటితెర

తెరపై నాటకం
కూలిన గుడి నుంచి 
మిగిలిపోయిన గోడకోసమా, 
తగులబడిపోతున్న బతుకుల నుంచి 
ఒకే ఒక్క మసీదుకోసమా ఈ యుద్ధం ??
నిరాశ్రితులు, పరాశ్రితులు
గ్రంథాల్లో నిక్షేపించిన చరిత్రగనుల్లో 
శవగంధాలను వెతికేవారు 
మనుష్యులని మరిచిపోయారమ్మీ

నాటకంలో సంధి
ఇక్కడ, మనమున్నచోట 
మనుషులు(మనుషులేనా !? )
కాష్టం మంటలకు చుట్టలు కాల్చుకునే మగర్రాజులు
యూదులు యాదవులేనా గేలి
ఆర్యుల కథేనా 
పాలస్తీనా, ఇజ్రేలీలగాథని హేళన

రంధి, తీరని బాధ
రెండు ముక్కలై రెండు రాజ్యాలకు 
వత్తాసు బత్తాయిలు
శాంతేనా వీళ్ళంతా కోరేది
కాదు, కాకూడదు...చల్లారని చితిమంటలు
పసిగుడ్లనుంచి ముసలివగ్గుల దాక 
చావుగోసలు చూడాలని
అరే....ఏం మజాకో
నిద్రలు, నిద్రలో కలలు, కలల్లో గొప్పమాలోకం
శాంతి, సౌఖ్యం హుళక్కి
చరిత్రను తవ్వి వెనక్కిపోదామంటరు
అపుడు నేనున్నానా?

అపుడేముండె
నీకు తెలియనిది
నా జననం
నా హననం
నా ఖననం
నిన్ను కలిసినపుడే తెలిసింది
వీళ్ళు జర్మనీ గోడలై
మనిద్దరి నడుమ నిలుస్తారని
మనం కూల్చుతుంటాం
వాళ్ళు చైనా కోట గోడలు కడుతుంటారు
మనం ప్రేమించుకోవడం మాని
చెరో గునపమై తెగబడుదాం
గోడలు కూల్చడమే
మన పని...
 

click me!