అరుణ ధూళిపాళ కవిత : సేద తీరాలి !!

Published : Oct 20, 2023, 10:48 AM IST
అరుణ ధూళిపాళ కవిత : సేద తీరాలి !!

సారాంశం

గాయాల గాట్లకు ఓదార్పు చందనమవ్వాలి అంటూ అరుణ ధూళిపాళ రాసిన కవిత ' సేద తీరాలి !! ' ఇక్కడ చదవండి : 

అందరికీ ఉండదు
గుండె లయను 
అర్థం చేసుకునే మార్దవం...
అది కలగాలంటే,
తెలిసి ఉండాలి
చివికే వస్త్రం లాంటి
జీవితపు విలువ ..
నాడులు స్పందించి మేలుకోవాలి..

వయసు, వరుసలు, బంధాలతో
సంబంధం లేకుండా
పుట్టుకనుండి చావుదాకా
మనసు పొరల్లోకి
సుడిగాలై ఆవరించాలి
కన్నీటి ప్రవాహాలకు 
ధైర్య వచనాల వంతెన వేయాలి
మండే గుండెమంటలకు
చలివేంద్రమై సేదతీర్చాలి
గాయాల గాట్లకు
ఓదార్పు చందనమవ్వాలి
సంతోష సమరానికి
అడుగు ముందుకు వేయాలి

నేనున్నాననే మాట
ప్రతి ఎదలో పల్లవించాలి
జీవన ప్రయాణంలో
యాతనను మరచి
మరపురాని క్షణాలు
మార్గమంతా పరుచుకోవాలి
మానవతా పొత్తిళ్ళలో
నిదురించాలి హాయిగా....
నిర్వేదం లేని గమనంగా.....!!!!

PREV
click me!

Recommended Stories

Tim Cook books టిమ్ కుక్ ని మార్చేసిన పుస్తకాలు.. చదివితే మనకూ స్ఫూర్తి పాఠాలు
అపరాజిత అయోధ్య : రామాలయ చరిత్ర, శతాబ్దాల పోరాటం