విప్పలేని పొడుపుకథ ఒకటి మనతో దాగుడుమూతలు ఆడుతున్నది అంటూ నిజామాబాద్ నుండి పొద్దుటూరి మాధవీలత రాసిన కవిత ' వారధి ' ఇక్కడ చదవండి :
నిండు చెరువు ఒడ్డుపై
నీ ప్రక్కనే కూర్చుని
మనసు విప్పి మాట్లాడుకోవాలని ఉంది
గుండె బరువును ఒడుపుగా దించుకోవాలి
జీవితం నదిలోని ఆటుపోట్లను
అలుగువారిన చెఱువు
గుట్టుగా గుండెల్లో దాచుకుంది
తామరాకు మీది నీటిబొట్టు వలె
వరుసకు అందని బంధమేదో మనమధ్య అల్లుకుంది
పోటీపడి మరీ ఒడ్డును ఢీకొడుతున్న అలలు
తీరాన్ని దాటలేవని తెలిసి
సంఘర్షణల కెరటం ఒకటి
తనకు తానే సంకెళ్ళు వేసుకుంది
నర్మగర్భంగా దాగిన సుడిగుండం నిర్దయగా
మనసును మెలితిప్పుతున్నది
అలలను తన్నుతు ఊరపిచ్చుక ఒకటి
ఆకాశం వైపు ఎగిరిపోయింది
కట్ట అంచున మొలిచిన తుంగ పొద
నిర్వికారంగా తల ఊపిన సవ్వడి...
ఎన్ని వేదనలను కళ్ళారా
చూసిందో...నిస్సహాయంగా
చెరువు గర్భం నిండా ఎన్నో ప్రాణులు
జీవన్మరణ పోరాటంలో అలసిపోని యోధులు ఊపిరాడనివ్వని ఊసులను మూటకట్టుకొచ్చాయి నీళ్ళు
మాటకు, నీటికి
గట్టి బందమేదో వున్నట్లుంది
మనసుకు, మట్టికి
పోలిక ఏదో పెనవేసుకున్నట్లు ఉంది
కవితకు, కన్నీటికి మధ్య
వారధి ఎవరో కట్టినట్టున్నారు...
విప్పలేని పొడుపుకథ ఒకటి
మనతో దాగుడుమూతలు ఆడుతున్నది
అందుకే
ఒక్కసారి మనసు విప్పి
నీతో మాట్లాడాలి...