తెలుగు సాహిత్యంలో తెలుగు కవిత్వం విశిష్టమైంది. ప్రముఖ కవి శ్రీరామోజు హరగోపాల్ ఎంత మాత్రమింకా.. అంటూ తన కవితను అందిస్తున్నారు, చదవండి.
ఎంత గాయపరుస్తావు గాలి,
ప్రియ ప్రియతమ మోహన జీవనవంశిలో రాగాలను తొలిచి
పెదవినద్దడమే మరిచావు
అనుక్షణిక జీవనానురక్తిలో
అశ్రుసిక్తమైన కాలిబాట
పైన జ్ఞాపకాలు కురిసే మేఘంగొడుగు
అల్లుకున్న బంధాలని
కత్తిరించే మృత్యుప్రహారాలను కాచుకుని, కాచుకుని
ఉట్టిపోయినవి కండ్లు
ఇంకానా నీ క్రోధం
ఈ నరమేధం చాలు
undefined
పచ్చికమెట్ల మీద ఆమెపాదాల కుంచెలతో
గీసిన మంజుల మంజీర శింజానాలు వినే గడువునివ్వవు
ఎక్కడ వాలిపోతున్నది కాలంపొద్దు
ఎక్కడ రాలిపోతున్నది మనసునెల
కొంచెం దుఃఖపుగంధాలు ఎగియని మందిరమొకటి చూపించు
కొంచెం మనుషులు అవిసిపోని మార్గమొకటి ముందుండి నడిపించు
నేస్తమా,
నేను సర్వదా సిద్ధం
నీ పిలుపే ఆలస్యం