వర్తమాన దుఃఖానికి అక్షర రూపం 'అనిమేష':

By telugu team  |  First Published Oct 6, 2020, 11:55 AM IST

సాహిత్య అకాడమీ పూర్వ అధ్యక్షులు    డాక్టర్ నందిని సిధారెడ్డి రాసిన కావ్యం 'అనిమేష' ఆవిష్కరణ  కార్యక్రమం నిన్న సాయంత్రం హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో జరిగింది.


ప్రపంచ బాధను తన బాధగా స్పందించిన శ్రీశ్రీ తర్వాత ఆ విధంగా స్పందించిన కవి నందిని సిధారెడ్డి అని 'అనిమేష' ఆవిష్కరణ సభలో   తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ నాళేశ్వరం శంకరం అన్నారు. వరవరరావు సముద్రం కావ్యం ఉద్యమానికి కేంద్రమైతే,  నగ్నముని కొయ్యగుర్రం దీర్ఘ కవిత  దివిసీమ ఉప్పెనకు కేంద్రం.  అదేవిధంగా అనిమేష కావ్యం ఈ రోజు ప్రపంచాన్ని కమ్ముకుని ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేస్తన్న వికృత కోవిడ్ కు కేంద్రం అని ఈ సభకు అధ్యక్షత వహించిన  నాళేశ్వరం శంకరం వివరించారు. మహాభారతం 18 పర్వాల కావ్యమైతే  కోవిడ్ నేపధ్యంలో సిధారెడ్డి రాసిన అనిమేష  19 పర్వాల కావ్యం అని అన్నారు.

సాహిత్య అకాడమీ పూర్వ అధ్యక్షులు    డాక్టర్ నందిని సిధారెడ్డి రాసిన కావ్యం 'అనిమేష' ఆవిష్కరణ  కార్యక్రమం నిన్న సాయంత్రం హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో జరిగింది. ఈ సభలో ప్రముఖ పాత్రికేయులు ఏలూరి రఘు ఈ కావ్యాన్ని  ఆవిష్కరిస్తూ తెలంగాణ జీవన మాధుర్యాన్ని కవిత్వీకరించిన కవి నందిని సిధారెడ్డి అని అన్నారు.   కవిత్వం ద్వారానే కాకుండా తెలంగాణ సాహిత్య అకాడమీ ద్వారా ఎన్నో అద్భుతాలు సాధించిన  వీరు  నేడు  అంతటా అలుముకున్న విషాద గాథను,   చెదిరిన ప్రజల స్వప్నాలను చక్కగా కవిత్వీకరించారు అని పేర్కొన్నారు.   దుఃఖం నుంచి, భయం నుంచి ఈ కావ్యం మనల్ని బయట పడేస్తుంది‌ అని విశదీకరించారు.

Latest Videos

డా.వి. శంకర్ అనిమేష కావ్యాన్ని పరిచయం చేస్తూ  అర్థవంతమైన శీర్షికలతో, అద్భుతమైన శిల్పంతో సిధారెడ్డి  తనదైనశైలిలో రాసిన కావ్యం ఇది అని అన్నారు.  ఈ కావ్యంలో ప్రకృతికి మనిషికి ఉన్నటువంటి సంబంధాన్ని, సమన్వయాన్ని  కవి చక్కగా 19 గాథల్లో అక్షరీకరించారు అని పేర్కొన్నారు.  మానవ నాగరికత అభివృద్ధి క్రమంలో జరుగుతున్న విధ్వంసం, వివిధ నాగరికతల ప్రస్థానం ఈ కావ్యంలో ఉందన్నారు.   ప్రకృతిని చూసి మనిషి ఆనంద పడడమే జీవితం.  ప్రకృతి ఉనికి మనిషితోనే.  మనిషి ఉనికి ప్రకృతితోనే. ఈ విషయాన్ని చక్కగా కవిత్వీకరించిన ఈ కావ్యంలో భావం వెంట పదాలు పరుగులు తీస్తున్నవి అని విశ్లేషించారు.

జి. దేవీ ప్రసాద్ ఆత్మీయభాషణ  చేస్తూ సామూహికంగా వ్యాపించే లక్షణాలు ఉన్న కోవిడ్ విషయంలో ప్రభుత్వ వైఫల్యాన్ని కవి సిధారెడ్డి ముక్కు సూటిగా ఎత్తిచూపారు అని అన్నారు.  శవాన్ని కుటుంబ సభ్యులు కూడా తాకలేని, చూడలేని విషాద దృశ్యాలను చదువుతుంటే దుఃఖం తన్నుకొస్తుంది అన్నారు.

మరో ఆత్మీయ అతిథి విరాహత్ అలీ మాట్లాడుతూ అనిమేష కోవిడ్ నేపధ్యంలో వచ్చిన మొట్టమొదటి కావ్యంగా  పేర్కొన్నారు.  వలస కూలీల  నడకను , బాధలను కవిత్వీకరించిన విధానం మన కంట నీరు పెట్టిస్తుంది అన్నారు. కరోనా వ్యాక్సిన్ వ్యాపారం భుజంమీద చేయివేసి కొత్త రూపం ఎత్తుతుంది అని  రాయడం కవి ముందు చూపుకు నిదర్శనం అన్నారు. 

అనిమేష కావ్యాన్ని రచించిన కవి నందిని సిధారెడ్డి మాట్లాడుతూ - కావ్యం రాయాలనే తపన పది సంవత్సరాల నుండి ఉంది.  కావ్య రచనకు కావాల్సిన సమయాన్ని ఇప్పుడు కాలమే ఇచ్చింది అని అన్నారు.  ఈ సభలో చిత్రకారుడు అహోబిలం ప్రభాకర్,  తెలంగాణ రచయితల సంఘం జంటనగరాల బాధ్యులు కందుకూరి శ్రీరాములు, బెల్లంకొండ సంపత్ కుమార్ మరియు సామిడి జగన్ రెడ్డి, రూప్ కుమార్ డబ్బీకార్,  ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్  తదితరులు పాల్గొన్నారు.

click me!