తెలుగు అకాడమీ నిధుల గోల్ మాల్ కు పునాదులు ఎక్కడ పడ్డాయనేది చూడాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన పరిణామాలు తెలుగు అకాడమీ పరువు ప్రతిష్టలను పూర్తిగా దిగజార్చాయి.
హైదరాబాద్: తెలుగు అాకాడమీ అధికారుల నిర్లక్ష్యమే నిధుల గోల్ మాల్ కు కారణమని ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. వారిపై క్రిమినల్ చర్యలు మాత్రమే కాకుండా శాఖాపరమైన చర్యలు కూడా తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. అయితే, ప్రస్తుత గోల్ మాల్ కు పునాదులు ఎక్కడ పడ్డాయనేది ఆసక్తికరమైన విషయం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సత్యనారాయణ రెడ్డికి తెలుగు అకాడమీ డైరెక్టర్ బాధ్యతలు అప్పగించింది. ఆ పదవిలో ఆయన దాదాపు ఐదున్నరేళ్ల పాటు కొనసాగారు. ఈ ఐదున్నరేళ్ల పాటు తెలుగు అకాడమీ అధికార వర్గాలు అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా నిబంధనలను కూడా ఉల్లంఘించారనేది అర్థమవుతోంది.
తెలుగు అకాడమీకి సంబంధించి మూడు ప్రధానమైన కమిటీలు ఉంటాయి. గవర్నింగ్ బాడీ, పరిపాలనా వ్యవహారాల స్థాయీ సంఘం, విద్యావిషయక వ్యవహారాల కమిటీ. వీటిలో గవర్నింగ్ బాడీ అత్యున్నత స్థాయి కమిటీ. అయితే, సత్యనారాయణ రెడ్డి వచ్చిన తర్వాత ఆ కమిటీనే ఏర్పాటు చేయలేదు. గవర్నింగ్ బాడీకి విద్యా శాఖ మంత్రి చైర్ పర్సన్ గా, విద్యాశాఖ కార్యదర్శి వైస్ చైర్మన్ గా ఉంటారు. ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ, కాలేజీయేట్ ఎడ్యుకేషన్ కమిషనర్, సాంకేతిక విద్యా శాఖ కార్యదర్శి, రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్లు సభ్యులుగా ఉంటారు. తెలుగు అకాడమీ డైరెక్టర్ మెంబర్ కన్వీనర్.
Also Read: తెలుగు అకాడమీ స్కాం: పోలీసుల అదుపులో అకాడమీ అకౌంట్స్ ఆఫీసర్ రమేశ్.. 11కి చేరిన అరెస్ట్‌లు
అకాడమీ పాలనా వ్యవహారాల స్థాయీ సంఘం (స్టాండింగ్ కమిటీ) కూడా ఉంటుంది. ఇది మాత్రం ఉంది. ఈ కమిటీకి విద్యాశాఖ కార్యదర్శి చైర్మన్ గా, ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి, సాంకేతి విద్యా శాఖ కార్యదర్శి ఆర్థిక శాఖకు చెందిన నామినీ సభ్యులుగా ఉంటారు. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన అంశాలు మరియు ఇతర ముఖ్యమైన అంశాలపై ఈ కమిటీ ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఈ కమిటీ సత్యనారాయణ రెడ్డి డైరెక్టర్ గా వచ్చిన తర్వాత ఒకటి, రెండు సార్లు మాత్రమే సమావేశమైంది. బడ్జెట్ ఆమోదం కూడా పొందాల్సి ఉంటుంది. స్టాండింగ్ కమిటీలో తీసుకున్న నిర్ణయాలను గవర్నింగ్ బాడీ ముందు పెట్టాల్సి ఉంటుంది. గవర్నింగ్ బాడీ ఆమోదం తర్వాతనే ఏవైనా ముందుకు సాగాలి. అయితే, అటువంటివి ఏమీ లేకుండా తెలుగు అకాడమీలో ఇద్దరు అధికారులు నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తూ వస్తున్నారు. ఇక్కడే అవినీతికి, అక్రమాలకు పునాదులు పడ్డాయని చెప్పవచ్చు.
ఇప్పటి వరకు తెలుగు అకాడమీ ఈ ఏడాది బడ్జెట్ కూడా ఆమోదం పొందలేదు. బడ్జెట్ ఆమోదం పొందకుండానే ఖర్చులు పెడుతూ వస్తున్నారు, చెల్లింపులు జరుపుతూ వస్తున్నారు. సత్యనారాయణ రెడ్డి డైరెక్టర్ గా వచ్చిన తర్వాత గవర్నింగ్ బాడీని ఏర్పాటు చేయడానికి ఏ విధమైన ప్రయత్నమూ జరగలేదు. ఈ విషయాన్ని ఆయన చైర్ పర్సన్ కు గానీ, వైస్ చైర్మన్ కు గానీ తెలియజేయలేదని తెలుస్తోంది. నియమనిబంధనలను అన్నింటినీ తుంగలో తొక్కి తెలుగు అకాడమీని ఓ ప్రైవేట్ సంస్థగా, గుత్త సంస్థగా భావించి వ్యవహారాలు నడుపుతూ వస్తున్నారు. సోమిరెడ్డి డైరెక్టర్ తర్వాత అదే సంప్రదాయం కొనసాగుతూ వచ్చింది.
ఆ విషయాన్ని పక్కన పెడితే మరో కమిటీ విద్యా విషయక వ్యవహారాల స్థాయి సంఘం విషయంలో పూర్తి నిర్లక్ష్యం వహిస్తూ వచ్చారు. ఈ కమిటీకి తెలుగు విశ్వవిద్యాలయం వైస్ చాన్సర్ అధ్యక్షుడిగా ఉండేవారు. అయితే, నిబంధనావళిని కాస్తా సవరించి ప్రముఖ విద్యావేత్తను కూడా నియమించే వెసులుబాటు కల్పించుకున్నారు. ప్రముఖ విద్యావేత్త కింద ఇప్పటి వరకు అధ్యక్షుడిగా పనిచేసివారు ఆచార్య రవ్వా శ్రీహరి మాత్రమే. దాన్ని గాలికి వదిలేశారు. కొండలరావు నుంచి యాదగిరి వరకు విద్యా విషయక వ్యవహారాల కమిటీ ప్రధానమైన పాత్ర వహిస్తూ కొత్త ప్రాజెక్టులు చేపడుతూ ఉండేది. విద్యార్థులకు అవసరమైన పాఠ్యపుస్తకాలను ప్రచురించడమే కాకుండా ఇతర ప్రాజెక్టులు చేపట్టి తెలుగు భాషాభివృద్ధికి పనిచేస్తూ ఉండేది. పలు కార్యక్రమాలు తీసుకుంటూ వచ్చేది. తెలుగు అకాడమీ వ్యవహారాలంటే విషయ నిపుణుల కూడలిగా కనిపించేది.
అయితే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాని ప్రాధాన్యం పూర్తిగా తగ్గుతూ వచ్చింది. సిబ్బంది లేరనే సాకుతో పాఠ్యపుస్తకాల తయారీ, ప్రచురణకు మాత్రమే పరిమితమైంది. ఒకటి, రెండు ప్రాజెక్టులను మాత్రమే చేపట్టింది. అయితే, ఈ పుస్తకాలను అవసరానికి మించి ప్రచురించినట్లు కూడా ప్రచారంలో ఉంది. పుస్తకాలను గోడౌన్ కు తరలించి, సబ్జెక్టు మారిందనే సాకుతో చిత్తు కాగితాల కింద అమ్ముతూ వస్తున్నారు. దీనివల్ల పేపర్ ఖర్చులు, ప్రింటింగ్ ఖర్చులు వృధా అవుతూ వస్తున్నాయి. ఇలా ఎందుకు చేస్తున్నారనేది అందరికీ తెలిసిందే. ఇందులో ఉన్నతాధికారులకు చేకూరే ప్రయోజనం ఎంతనేది తెలియాల్సి ఉంది. వారికి ప్రయోజనం లేకుంటే ఈ విధమైన తప్పుడు అంచనాలు, నిర్ణయాలు ఎందుకు జరుగుతాయనేది ప్రశ్న. సత్యనారాయణ రెడ్డి హయాంలోనే తెలుగు అకాడమీ భవనం మరమ్మతు, పాత సరంజామాను తీసేసి కొత్త సరంజామాను సమకూర్చుకున్నారు.
మూడు కమిటీలకు తెలుగు అకాడమీ డైరెక్టర్ మెంబర్ కన్వీనర్ మాత్రమే. మెంబర్ కన్వీనర్ గా వ్యవహరించాల్సిన డైరెక్టర్ అత్యున్నత స్థాయి నిర్ణాయక అధికారిగా వ్యవహరించారని అర్థమవుతోంది. దానివల్లనే ప్రస్తుత అనర్థానికి, దయనీయమైన స్థితికి దారి తీసిందనేది నిజమే కావచ్చు.