మదనపల్లె అక్కాచెల్లెళ్ల హత్య: భక్తి ముదిరి నెత్తురయ్యింది!

By telugu teamFirst Published Jan 29, 2021, 11:27 AM IST
Highlights

మదనపల్లిలో మూఢభక్తితో కన్న పిల్లలను చంపుకున్న  హృదయవిధారక సంఘటన నేపథ్యంలో అరసం రాష్ట్ర కోశాధికారి సోమశిల తిరుపాల్ రాసిన కవిత 'భక్తి ముదిరి నెత్తురయ్యింది! ' చదవండి.

దేవుడు మనిషిని సృష్టించాడన్నదీ నమ్మకం! 
మనిషే దేవున్ని సృష్టించాడన్నదీ వాస్తవం! 
ఇదీ అనాగరిక కాలం కాదు..!
అంతరిక్షంలో మనిషి ఆనవాళ్లను వెదుకుతున్నం 
గ్రహాంతరాల్లో గాలిమేడలు కట్టాలనుకుంటున్నం 
విశాలగగనంలో విహంగాలు చేస్తూ... 
ఆవాసాల కొరకు సాహసాలు చేస్తున్నాం 
అయినా.....  సరే...... 
ఆదిమజాతి అజ్ఞానాంధకారాన్ని విడువలే!

అక్షరాలను రాసులుగా పోసిన చోట 
విజ్ఞానం వికాసమై విహరించిన చోట 
లెక్కల పుస్తకాలకు  రెక్కలు తొడిగి 
బంగారు పథకాలు బహుమతిగా గెలిచిన మేధ
సైన్స్ తో సహజీవనం చేస్తూ 
చదువుల సారమెరిగిన చోట
కదలని రాతిబొమ్మలనుచూసీ... 
కండ్లు తెరిచిండనీ నమ్మడం  విచిత్రమే !
మరణం తర్వాత జననం అన్నదీ   విషాదమే! 

భక్తీ ఓ నమ్మకం... సైన్స్ ఓ నిజం! 
ఇది కనిపెట్టిన మనిషి  అద్భుతం!
అన్నీ తెలిసి అందరిని గమనిస్తూ.... 
అలా నడుస్తూ నడుస్తూ...  
మూఢాందకారంలోకి ప్రవేశిస్తే....
భక్తి రాగం శృతి తప్పి ముప్పు తెచ్చింది! 
"దివ్య"మైన సరిగమలు పలికే భక్తివీణ తెగింది! 

ఏ దేవుడు ఎవరి కలలో ఏం జెప్పిండో గానీ.. 
అందివచ్చిన ఆడబిడ్డలను అంతమొందించడం 
ఏ దేవుడు చూపిన మార్గమిదీ... ? 
ఏ దేవత చేసిన పాపం ఇదీ..?

అక్షరాస్యులతో అలరారుతున్న ఆవాసం అయినా 
అణువణువునా నిండిన మూఢాంధకారమది! 
వేలాది విద్యార్థుల దోసిట్లో అక్షరాలు పోసిన నేల 
అయినా..మూర్ఖత్వం నిండిన ఉన్మాద భక్తిపర్వం 
క్షుద్ర పూజలతో కోల్పోయిన విచక్షణ జ్ఞానం 
మితిమీరిన మూఢభక్తితో కన్నపేగును కడతేర్చీన 
                                                          అజ్ఞానం

అతీంద్రియ శక్తులకూ అంత మహిమే ఉంటే...
అంటువ్యాధులతో అంతమైనోళ్ళను బతికించండీ! 
మంత్రాలకు చింతకాయలు రాలనట్లే...
కంత్రి మంత్రగాళ్ళకూ ఏవీ రాలవు! కాసులుతప్పా.!
తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లూ.... 
భక్తి ముదిరీ.. నెత్తురు అయ్యింది....!!  
మహిమ పేరుతో.. మరు జన్మ నమ్మకంతో 
రెండు నిండు జీవితాలు నేలకు రాలిపోయినయ్!

click me!