ఆకాశంలో విభజన రేఖల్లేవు : రాగిణి, నవత

By telugu team  |  First Published Jan 27, 2021, 12:09 PM IST

డాక్టర్ వంగరి త్రివేణి డాక్టర్ ముదిగంటి సుజాతా రెడ్డి రాసిన నవల ఆకాశంలో విభజన రేఖల్లేవులోని రెండు ప్రధాన పాత్రల విశిష్టతను విశ్లేషించారు. ఆ నవలలోని పాత్ర చిత్రణ గురించి చదవండి.


ముదిగంటి సుజాతారెడ్డి “ఆకాశంలో విభజన రేఖల్లేవు” అనే నవలను 1995లో రచించారు.  ఈ నవల ద్వారా లిబిరల్ భావజాలంతో స్త్రీవాదాన్ని సృష్టించారు. 

నవలా శిల్పాన్ని అనుసరించి నవలలో ప్రధానాంగాలు “కథ, కథావస్తువు, పాత్రలు, నేపథ్యం”. తులనాత్మక ప్రాధాన్యతను బట్టి ఈ నాలుగు అంగాలు అదే క్రమంలో పరస్పరాశ్రయాలుగా పేర్కొనవచ్చును. ఒకవిధంగా పింగళి లక్ష్మీకాంతం నవలకు ఇచ్చిన నిర్వచనం గ్రహించవచ్చు. "ఛందస్సునే గాక ఆలంకారిక శైలిని సైతం విసర్జించి, వర్ణనా చమత్కారమునకు, కథానైపుణికి, పాత్ర చిత్రణకు మాత్రమే ప్రాధాన్యము నొసగిన ఆఖ్యానము నవలయైనది. ఇది వచన వాజ్మయ సరస్వతికి శిరోభూషణము” - పింగళి లక్ష్మీకాంతం, సాహిత్య శిల్ప సమీక్ష. పుట. 313.

Latest Videos

దానికి తగినట్లుగానే సుజాతారెడ్డి నవలను రచించారు. నవలల్లో వాస్తవికత ప్రధానమని అంటారు. ఆమె తన రచనల్లో వాస్తవికతను పాటించారు.

“లోకంలోని జీవితాలలో రచయిత తన విచక్షణతో కొంత కొంతను తీసి, దాని నంతా ఒకటే అనిపించేటట్లుగా ఫ్రేం చేసి, ఒక విశిష్ట ఖండంగా చూపెడుతాడు. దీనినే ఆంగ్లంలో ఫార్మ్ అని  అంటారు. ఫార్మ్ అన్నది కేవలం రచయిత సృష్టే. అది రచయిత యొక్క సొంతం. నిర్మాణం లేక స్ట్రక్చర్ అన్నది కూడా దీనిలో ఒక భాగమే. రచనలోని భిన్నాంశాలకు ఏకతను కలిగించడానికి రచయిత తాను ఎన్నుకున్న వస్తువుతో తపస్సు చేయాల్సి ఉంటుంది. రచయిత వస్తువుతో చేసే తపస్సునే శిల్పం అన్నారు”. ముదిగొండ వీరభద్రయ్య నవలాశిల్పం గురించి ప్రస్తావించారు.   (ముదిగొండ వీరభద్రయ్య, నవల - నవలా విమర్శకులు. పుట - 33).   ముదిగంటి సుజాతారెడ్డి తీర్చిదిద్దిన నవలాశిల్పం గూర్చి దాశరథి రంగాచార్య  “మలుపు తిరిగిన రథచక్రాలు” అనే నవలకు ముందు మాట రాసి అభినందించారు. ( "శిల్పం అనే దానికి కొలబద్దలు లేవు. అందం వలె శిల్పం అనుభవైక వేద్యం, సుజాతారెడ్డి శిల్పంలో మరింత నైపుణ్యత సాధించారు” - దాశరథి రంగాచార్య, మలుపు తిరిగిన రథచక్రాలు. పుట. ix .)

లిబరల్ ఫెమినిజం:

రచయిత అనుభవ పరిధి అతని కథల్లోని పాత్రల్లో వ్యక్తమవుతుంది. రచయిత పాత్రలను సహజంగా సృష్టిస్తాడు. వాస్తవికతకు అద్దం పట్టే పాత్రపోషణను నిర్వహిస్తాడు. మనకు నిత్య జీవితంలో కనిపించే వ్యక్తులనే నవలల్లో రచయిత పాత్రగా మన ముందుంచుతాడు.

స్త్రీ పురుషుల మధ్య ప్రజాస్వామ్య విలువలతో కలిగిన ప్రేమ, సఖ్య సంబంధాలు ఉండాలని కోరుతూ “ఆకాశంలో విభజన రేఖల్లేవు” అనే నవలను ముదిగంటి సుజాతారెడ్డి రచించారు. నేటి సమాజంలో స్త్రీవాదులమంటూ వారు నిర్వహిస్తున్న సంస్థల ద్వారా వారు ఏ విధంగా ద్వంద్వ వైఖరులకు లోనవుతున్నారో ఈ నవలలో తెలిపారు. రచయిత్రి తాను చూసిన జీవితాలు, అనుభవాలను ఆధారంగా చేసుకుని పాత్రలను సృష్టించారు.

“ఆకాశంలో విభజన రేఖల్లేవు” అనే నవలలో రచయిత్రి అనేక పాత్రలను పోషించారు. తాను సృష్టించిన పాత్రలు నవలలో కథ ముందుకు సాగడానికి దోహదం చేశాయి. రాగిణి, నవతలు ఈ నవలలో ప్రధాన పాత్రలు. రాగిణిలో సంస్కారం, నవతలో అభ్యుదయ భావాలు కనిపిస్తాయి.

“ఆకాశంలో విభజన రేఖల్లేవు” నవలను కొందరు స్త్రీవాద వ్యతిరేకమని విమర్శించారు.  కాని డాక్టర్ మృణాళిని వంటి ఉత్తమ విమర్శకులు ముదిగంటి సుజాతారెడ్డి రచించిన “ఆకాశంలో విభజన రేఖల్లేవు” నవల మూసపోత ధోరణిని చేదించిందని వ్యాఖ్యానించారు.  ( స్త్రీ చైతన్యానికి నేపథ్యంగా “ఆకాశంలో విభజన రేఖల్లేవు” అనే నవలను ముదిగంటి సుజాతారెడ్డి రచించారని, “స్టీరియో టైప్ నుండి బయటపడిన స్త్రీల నవల” గా డాక్టర్ మృణాళిని తన వ్యాసంలో వ్యాఖ్యానించారు. (భూమిక, నవంబర్, 03 – ఫిబ్రవరి, 04, 2004, రచయిత్రుల ప్రత్యేక సంచిక). ఒకవిధంగా ఈ నవలను రాడికల్ ఫెమినిజం - అతివాద స్త్రీవాద ధోరణులు కలవారిని, పురుష ద్వేషం ప్రకటించే వారిని ఒక విధంగా విమర్శించడానికి రాశారు. మంచి - చెడు అనేది స్త్రీలలోనూ పురుషుల్లోనూ ఉంటుంది. పురుషులందరూ చెడ్డవారని చెప్పడం అతివాదం అవుతుంది. కానీ స్త్రీ వాదాన్ని తక్కువ చేయటానికి కాదు. ఈ నవలలో ప్రధాన స్త్రీ పాత్రలు సమర్ధులైన స్వేచ్ఛ స్వాతంత్య్రాలతో తమ దగ్గర గల భాగస్వాముల సహాయంతో కార్యనిర్వహణ చేసినట్లుగా వర్ణించారు. స్త్రీ శక్తి తక్కువది కాదని చెప్పారు. స్త్రీలకు పురుషులు తోడ్పడితేనే స్త్రీవాదం విజయవంతం అవుతుంది. కానీ పురుష విద్వేషంతో కాదని సుజాతారెడ్డి ఈ నవలలో చెప్పదలుచుకున్నారు. పురుషుల్లో మార్పు రానిదే స్త్రీ స్వేచ్ఛ సాధ్యం కాదని, విజయవంతం కాదని ఆమె అభిప్రాయం. అదే ఈ నవలలో  కనిపించే వస్తువు. అంతే గాక పాశ్చాత్య దేశంలో ఒక స్త్రీ వాదం గుంపు స్త్రీవాదం విజయం కావడానికి లేస్బియనిజం ఒక మార్గమని కూడా చెప్పారు. ( పురుషాధిపత్యాన్ని, పితృస్వామ్య వ్యవస్థను పతనం చేయాలంటే “లెస్బియనిజం” (స్త్రీల సమాలింగ సంపర్కం) మార్గమని చార్లెస్ బెంచ్ (1981), టీ గ్రేస్ ఆట్ కిన్సన్, ఆడ్రియన్ రిచ్, ద ఫ్యూరీస్ తదితరులు ప్రకటించారు. “స్త్రీవాదం సిద్ధాంతమైతే లెస్బియనిజం దాని ఆచరణ మార్గం” అని టీగ్రేస్ ఆట్ కిన్సన్ ప్రకటించింది. ఈ ధోరణి రాడికల్ లెస్బియనిజం లో చోటుచేసుకుంది. పుట. iv ) దానిని దృష్టిలో పెట్టుకొని సుజాతారెడ్డి ఈ నవలను రాశారు.

కథా వస్తువు:

రామారావు నీరజలది ఆదర్శ వివాహం. వాళ్ళిద్దరూ అరమరికలు లేని అన్యోన్య దాంపత్య జీవితాన్ని సాగించారు. నీరజకు రామారావు అన్ని పనుల్లోనూ సహకరించేవాడు. వంటపని, ఇంటిపనిలోనూ ఆయన తోడ్పాటు నీరజకు ఉండేది. రామారావు న్యాయవాది. ఎలాంటి కేసులు చేపట్టిన గెలిచేవాడు. నీరజ కూడా ఉన్నత విద్య అభ్యసించింది. కానీ ఏ ఉద్యోగం చెయ్యడానికి గాని, బయట పనులు చెయ్యడానికి గాని ఇష్టపడేది కాదు. వివాహం అయిన తర్వాత ఇల్లే ఆమెకు స్వర్గం అయింది. భర్త, పిల్లల ఆలనా పాలనా చూసుకోవడమే ఆమె ప్రథమ కర్తవ్యంగా భావించేది. వాళ్లకు ఒక కూతురు ఒక కుమారుడు. ఇద్దరు పిల్లలతో రామారావు నీరజల సంసారం ఉల్లాసంగా సాగుతున్న క్రమంలో రామారావు రోడ్డు ప్రమాదంలో అకాల మృతి పొందుతాడు. ఈ సంఘటనతో నీరజ మానసికంగా చాలా క్రుంగిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో కుటుంబ భారం అంతా రామారావు కూతురు రాగిణి పై పడుతుంది. ఎంతో గుండె నిబ్బరంతో, మనోధైర్యంతో ఎన్నో సమస్యలను రాగిణి ఎదుర్కొన్నది. 

రాగిణికి  నవత అనే స్నేహితురాలు ఉండేది. నవతా స్త్రీవాద భావాలు కలది. వివాహ వ్యవస్థపై పురుష సమాజంపై వ్యతిరేకత కలది. స్త్రీ స్వేచ్చకు, సమానత్వానికి వివాహ వ్యవస్థ అవరోధం కలిగిస్తుందని భావించేది. నవతా తన ప్రతిభాషణంలో పురుషులపై విముఖతతో గల  విషయాలను ప్రస్తావించేది. కానీ రాగిణి మాత్రం అందుకు విరుద్ధమైంది. సమాజంలో స్త్రీ పురుషుల పాత్ర సమానమైనదేనని భావించేది. నవత తన తల్లిదండ్రుల స్నేహపూర్వక సంబంధాన్ని కళ్లారా చూసింది. అలాంటి నేపథ్యంలోనే ఆమె పెరిగింది. పురుషునికి స్త్రీ,  స్త్రీకి పురుషుడు పరస్పర సహకారం, ప్రోత్సాహం పెంపొందించుకోవాలని రాగిణి అభిలషించేది. ఇలా రాగిణి, నవతల మధ్య గల పరస్పర విరుద్ధమైన సంభాషణలు జరుగుతుండేవి. ముఖ్యంగా ఈ నవలలో రాగిణి యోషిత అనే సంస్థ ద్వారా జరుగుతున్న అన్యాయాన్ని బయటపెట్టింది. స్త్రీవాదులమని చెప్పుకొనే స్త్రీలలో, స్త్రీల కోసం నడుపుతున్న సంస్థల్లో పనిచేసే స్త్రీలలో ఒక్కొక్కసారి ఎట్లా ద్వంద ప్రమాణాలు చోటుచేసుకుంటున్నాయో తెలియజేసింది. 

స్త్రీ, పురుషుల మధ్య ప్రేమ స్నేహ సంబంధాలు ఉండాలని, సహజమైన లైంగిక సంబంధాలు ఉండాలని ముదిగంటి సుజాతారెడ్డి ఈ నవలలో పేర్కొన్నారు. స్త్రీల అభ్యుదయం, అసమానతల నివారణకు పురుషుల సహకారం ఉండాలి. అంటే పురుషుల్లోనూ స్త్రీలతో సహకరించే, గౌరవించే గుణాలు రావాలి. స్త్రీ స్వేచ్చ, పురుషునికి న్యూనతా భావాన్ని కలిగించకూడదు. అంటే పురుషుల్లో మార్పు రావాలని, కుటుంబం ప్రజాస్వామ్య విలువలతో సంరక్షింపబడాలి అని రచయిత్రి ఆకాంక్షించారు. ఇంకోవైపు స్త్రీల స్వార్థపూరిత ద్వంద్వ ప్రమాణాలను విమర్శించారు. తీసుకున్న వస్తువుకు అనేక పాత్రల జీవిత కథనాల కూర్పుతో ఈ నవల ఇతివృత్తాన్ని కోనసాగించారు. ఈ నవలకు “ఆకాశంలో విభజన రేఖల్లేవు” అనే పేరు పురుషుల సమానతను సూచిస్తుంది. 

కథనం:

కథాకథనం మీద పాశ్చాత్య సాహిత్యంలో భిన్నమైన దృక్పథాలు ఉన్నాయి. (కథనం సాధారణంగా కథావస్తు స్వభావం మీద ఆధారపడి ఉంటుంది. వస్తువు ఎన్ని రకాలుగా ఉంటుందో; కథనం కూడా అన్ని రకాలుగా ఉండడానికి వీలుంటుంది.” - మహారచయిత టాల్ స్టాయ్ ).
    
“రచయిత తన స్వభావాన్ని వదులుకొని, పాత్రలలోకి పరకాయ ప్రవేశం చేయాల్సి ఉంటుంది. అట్లాగే కథనంలో పాత్రల అంతరంగ చిత్రణ చేసినప్పుడు కూడా రచయిత పరకాయ ప్రవేశం చేయాల్సి ఉంటుంది” అని ముదిగొండ వీరభద్రయ్య నవలా కథనాన్ని గుర్చి తెలిపారు. (ముదిగొండ వీరభద్రయ్య, నవల –నవలా విమర్శకులు. పుట. 22 ) 

“కథనంలో కథతో పాటు కథావస్తువునూ, పాత్రలనూ, వాతావరణాన్ని  (నేపథ్యాన్ని) రచయిత ఆవిష్కరించాలి. అంటే పాఠకుడిలో తాను ఎలాంటి ప్రతిస్పందన (రియాక్షన్) ను  ఆశిస్తున్నాడో దానిని ముందుగానే నిర్ణయించుకొని, దాని కోసం తన కథన చమత్కారాన్ని ఉపయోగించాలి” అని వల్లంపాటి వెంకటసుబ్బయ్య నిర్వచించారు. (వల్లంపాటి వెంకటసుబ్బయ్య, నవలా శిల్పం. పుట. 57 ) .

“ఆకాశంలో విభజన రేఖల్లేవు” నవలలో రామారావు మరణంతో ప్రారంభించి; తర్వాత ఆయన జీవితం, విద్యాభ్యాసం, ఆదర్శ వివాహం, లాయర్ వృత్తిలో పేరుప్రతిష్ఠలు, అతనిలోని ఆధునిక భావాలను వివరించారు. వర్తమానంలో కథ ప్రారంభించి, వెనకకు, ముందుకు కథను జరుపుతూ ఈ నవల చివరికి వర్తమానంలోకి వచ్చారు. నవలకు ప్రాణప్రదమైన వివిధ సన్నివేశాలను, విషయాలను చిత్రించి కథా గమనానికి ఉత్తేజాన్ని కలిగించే విధంగా ముగించారు. సుజాతారెడ్డి తన నవలకు వాస్తవిక దృష్టి కోణాన్ని ఎన్నుకొని కథాకథనం సాధించారు. వివిధ విషయాల వివరణతో, వర్ణనలతో కథాస్వరూపంతో పాఠకులలో ఆలోచనలు, ప్రతిస్పందనలు కలిగింపచేశారు. ముదిగంటి సుజాతారెడ్డి నవలలు కథా కథనానికి చెందినవి. నవలకు, జీవితానికి ఉన్న సంబంధాన్ని కథావస్తువు తెలుపుతుంది. సుజాతారెడ్డి తన నవలలో “ఫ్లాష్ బ్యాక్” పద్ధతిని ఉపయోగించుకున్నారు. (వాస్తవికంగా కథను చెబుతూ ఉన్నప్పుడు కాలక్రమాన్ని తప్పకుండా పాటించాలన్న నియమం ఎక్కడా లేదు. కాలాన్ని తారుమారు చేయవచ్చు. కథనంలో ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక పాత్ర గతాన్ని సింహావలోకనం చేసుకోవాల్సిన అవసరం కలుగవచ్చును. దీనినే “ఫ్లాష్ బ్యాక్”గా రచయిత ఉపయోగించుకోవచ్చును. ).

దృష్టికోణం:

సర్వసాక్షి దృష్టికోణం రచయితకు సంబంధించింది. ఇందులో రచయిత స్వయంగా కథ చెబుతాడు. కథ, కథావస్తువు, పాత్రలు, నేపథ్యం ఏర్పరుచుకుంటాడు. పాత్రల ప్రవర్తనను వర్ణిస్తాడు. పాత్రల మనసులోతుల్లోని భావాలను ఆవిష్కరిస్తాడు. కథ జరిగే ప్రతి చోటా కథారచయిత ఉండి పాటకుడిని తీసుకొని వెళ్తాడు. ముదిగంటి సుజాతారెడ్డి ఈ నవలలో సర్వసాక్షి దృష్టి కోణాన్ని అవలంబించారు. ఉత్తమ పురుష దృష్టి కోణంలో కథను కథకుడు తనను తాను ఒక పాత్రగా మార్చుకుని నేను  అని ప్రస్తావించుకుంటూ ఉంటాడు. కథనం ద్వారా తనను తాను అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తున్న పాత్ర ప్రధానంగా ఉన్న నవలకు,  ఒకే పాత్ర ప్రధానంగా ఉన్న నవలకు ఈ దృష్టి కోణం బాగా సమకూరుతుంది. కాని అనేక పాత్రల సమాహారమైన “ఆకాశంలో విభజన రేఖల్లేవు” అనే ఈ నవలలో రచయిత్రి సర్వసాక్షి దృష్టికోణంలోనే పాత్ర సృష్టి చేసారు. 

పాత్ర చిత్రణ:
రాగిణి - నవత

రామారావు కూతురు రాగిణి. తల్లి ప్రేమలో, తండ్రి లాలనలో అల్లారుముద్దుగా పెరిగింది. కానీ విధి వీరి జీవితాన్ని వెక్కిరించింది. రామారావును రోడ్డు ప్రమాదంలో బలి తీసుకున్నది. తండ్రి మరణంతో ఆ కుటుంబం మొత్తం దుఃఖసాగరంలో మునిగిపోయింది. తండ్రి శవాన్ని హాస్పిటల్ నుండి తీసుకొనే సన్నివేశాల్లో హాస్పిటల్ సిబ్బంది అవినీతికి పాల్పడటం; వారి లంచగొండి తనానికి, అనాగరిక రాక్షసత్వానికి విస్తుపోయింది. తండ్రి దహన సంస్కారాల భారమంతా రాగిణి మీద పడింది. అప్పటి నుండి కుటుంబ బాధ్యతను రాగిణి నిర్వర్తించింది. 

రాగిణి తల్లిలా అందంగా ఉంటుంది. తండ్రిలా పొడుగు, సన్నగా ఉన్నా బలంగా ఉంటుంది. రాగిణి తండ్రి క్రమశిక్షణలో పెరిగింది. దానితోపాటు స్వేచ్చా స్వాతంత్ర్యాలు పొందింది. ఆమె తండ్రి రోజు పొద్దున్నే పత్రికల్లో చదివిన విషయాలను రాగిణితో మాట్లాడేవాడు. రాగాణి తన తండ్రి లాగా స్పోర్ట్స్ పై అభిమానం కలది. రాగిణి కాలేజీలో స్పోర్ట్స్ సెక్రటరీగా నిలబడి గెలిచింది. రాగిని ఇంటర్ తర్వాత బి.కాం.లో చేరి డిగ్రీ పూర్తి చేసింది. తండ్రి మరణించిన తరువాత ఒక మంచి కంపెనీలో పి.ఎ.గా ఉద్యోగం పొందింది. 
రాగిణి సంస్కారం గల యువతి. అభ్యున్నతికి అన్ని వైపుల నుండి కారణాలు వెదుకుతుంది. ఆడపిల్లలకు, మగపిల్లలకు సెక్స్ గురించి కొంత అవగాహన ఉండాలంటుంది. లేకపోతే దాని లోతుపాతులు తెలియక దాని ఆకర్షణలో సహజమైన కోరికల బలంతో కాని పనులు చేయడం, దానితో ఆడపిల్లలే బాధపడతారని చెబుతుండేది. ఆ బాధలను మరిచిపోలేక మానసికంగా ఆవేదనతో పీడింపబడుతున్నారని తన స్నేహితురాలు నవతతో చెబుతూ ఉండేది. అంతేగాక స్త్రీ అభ్యుదయాన్ని, ప్రగతిని సాధిస్తుంటే ఆ నూతన వ్యక్తిత్వం గల స్త్రీకి తగ్గట్టుగా పురుషుడు ఎదగాలని, అలా లేకపోతే స్త్రీ పురుషుల మధ్య ఘర్షణలు తప్పవని ఆమె నమ్ముతుంది. కానీ కొంత మంది స్త్రీలు ఆడవాళ్ళ సమస్యలన్నింటికి మగవాళ్లే కారణమని అనడం సహజంగా లేదని, స్త్రీ పురుషుల మధ్య ఆర్థిక మనస్తత్వ సంబంధమైన కారణాలెన్నో అనేక సమస్యలను లేవదిస్తుందని అంటుంది.  కాబట్టి స్త్రీ సమస్యలకున్న నిజమైన సామాజిక ధార్మిక సాంస్కృతిక ఆర్థిక మనస్తత్వ కారణాలేమిటో తెలుసుకుని స్త్రీ అభ్యున్నతికి కృషి చేయాలని ఆమె ఆకాంక్షించింది. తీవ్రవాదానికి పోతే సమాజంలో తాత్కాలిక ఉపశమనం లభించవచ్చు. కానీ శాశ్వతమైన ఫలితం ఉండదని ఆమె అభిప్రాయం.

రాగిణి స్నేహితులు నవత. నవత తండ్రి అభ్యుదయ భావాలు కలవాడు. కానీ చిన్నప్పుడే నవత తండ్రి గుండెపోటుతో మరణించాడు. నవత తల్లి మంజుల. తన భర్త పరిశ్రమను, తాతలనాటి ఇల్లును, వ్యవసాయ భూములను అమ్మి అప్పులు తీర్చివేసింది. భర్త పోయిన తరువాత మంజుల ఒక ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్ గా చేరింది. నవతను పెద్దచేసింది. నవత కాలేజీలో స్టూడెంట్ యూనియన్  సెక్రెటరీగా ఎలక్ట్ అయ్యింది. బి.ఎ. డిగ్రీ  చదువుతున్నప్పుడు నవత ఏవేవో సభలు, సమావేశాలు, సంఘటనలంటూ తిరిగేది. యాక్టివ్ గా సభల్లో, సమావేశాల్లో పాలు పంచుకునేది. స్త్రీలకూ ఎక్కడైనా అన్యాయం జరిగిందని తెలిస్తే దాన్ని ప్రజల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి, చట్టం – న్యాయం దృష్టికి తీసుకోని రావడం; ఆ స్త్రీలకు రక్షణ, భద్రతలను కల్పించడం; పురుషుల అత్యాచారాల నుండి, దోపిడీ, అణచివేతల నుండి కాపాడడం తమ కర్తవ్యమని అందరి ముందు చెప్పుకునేది. తీవ్రవాద ధోరణిని అనుసరించడమే గాకా, జెండర్ రాజకీయాల్లో పక్షపాత వైఖరిని ప్రదర్శించేది. విచ్చలవిడి స్వేచ్చను  అనుభవించేది. ద్వంద్వ ప్రమాణాలను పాటించేది. స్త్రీ పరుష లింగ సంపర్కం (హేటరోస్కువల్స్) వల్ల వివక్షతకు, అణచివేతకు, అవమానాలకు గురవుతున్నామని నవత వాదించేది. తమకు న్యాయం కావాలని, సామాజిక గౌరవం కావాలని అందుకు సమలింగ సంపర్కమే పరిష్కారమని అంటుండేది. రాడికల్ స్త్రీవాదంలో “లెస్బియనిజం” ప్రాధాన్యతను గూర్చి రాగిణితో సంభాషించేది. లేస్బియనిజం ఒక శక్తివంతమైన సాధనంగా అభివర్ణించేది. లేస్బియనిజం ద్వారా అసలు మగజాతియే స్త్రీ జీవితంలో అవసరం లేదన్నంతగా నవత నమ్మేది. జెండర్ రాజకీయాలను తన వాదాలతో పెంచి పోషించేది. మగాడు ఆడదాని మీద చేసే పెత్తనం , దౌర్జన్యం ఈ లోకంలో నశించాలన్నది నవత ఉద్దేశం. నవత మంచి ఉత్సాహవంతురాలు,  కార్యదక్షురాలు కాబట్టి “యోషిత” సంస్థకు కార్యదర్శిగా ఎన్నుకోబడింది. నవత లాంటి భావజాలం కలిగినవాళ్ళు ఈ సంస్థను నడుపుతున్నారు. ఆడవాళ్ళలో జాగృతి చైతన్యం రావాలంటే ఒక ఉద్యమం రావాలని నవత కోరుకునేది. సభలెక్కి పురుషాధిక్యాన్ని, స్త్రీ బలహీనతలను ఎండగట్టిన నవతనే  తన బావ నరేష్ ఆకర్షణకు లోనవుతుంది. ఆయన కోసం చక్కగా అలంకరించుకునేది.

ఇతర పాత్రలు:

ఉత్తమ పురుష దృష్టికోణం నుండి సాగిన నవలలో కథనము, వ్యాఖ్యానము కూడా కథకుడే  చేస్తాడు. అంటే కథను చెప్పుకుంటూ పాత్రలను గురించి, సంఘటనలను గురించి తన అభిప్రాయాన్ని చెప్పుకుంటూ పోతాడు. ఆ సందర్భంలో ఇతర పాత్రల ప్రసక్తి కథనానికి బలోపేతం అవుతుంది. (“ఉత్తమ పురుషలో కథ చెబుతున్న పాత్ర నవలలోని ప్రధాన పాత్రగా ఉండవచ్చు లేదా నవలలోని సంఘటనల్లో సాధ్యమైనన్ని ఎక్కువ సంఘటనల్ని చూసే అవకాశం ఉన్న ఇతర పాత్రలు కూడా కావచ్చు” - వల్లంపాటి వేంకట సుబ్బయ్య, నవలా శిల్పం. పుట. 76 )

మీనా మాథూర్:  మీనా “యోషిత” ప్రెసిడెంట్. మీనా మొదట లెక్చరర్ గా పని చేసింది. మీనా భారతీయ సంస్కృతికి  ప్రతిరూపంగా కనిపించేది.  వంటల్లో, అల్లికల్లో, సంగీతంలో ప్రావీణురాలు. చక్కగా పట్టుచీరలో పెద్దజడ, పెద్దబొట్టుతో ఉండేది. కొంతకాలానికి ఆమెలో హటాతుగా మార్పు కనిపిస్తుంది. వ్యక్తులను, సమాజానికి, ప్రభుత్వానికి అన్నింటికీ వ్యతిరేకంగా ఉపన్యాసాలు ఇవ్వసాగింది. క్రమంగా ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తిగా తన కాలాన్ని స్త్రీ సంఘటనను నడపడంలో గడపసాగింది. విక్రం మాథూర్ తో పరిచయం ఏర్పరచుకొని తన పేరును మీనా మాథూర్ గా మారుతుంది. కొంతకాలం తర్వాత విక్రం ఆమె దగ్గరకు రావడం తగ్గింది. అయినా అతన్ని ఏమీ అనలేదు. కానీ పురుష ప్రపంచం మీద కక్ష పెంచుకుంది. స్త్రీని అణచివేసింది, బానిసను చేసింది ఆమె మీద దౌర్జన్యం నడిపేది అంతా పురుషుడే అని ఆమె ఉద్దేశం. ఇండస్ట్రియలిస్టు మాథూర్ ద్వారా  అంతర్జాతీయ సంస్థల నుండి ఫండ్సు ఎలా తెచ్చుకోవాలో పరిచయాలు పెంచుకుంది. మెళకువలు నేర్చుకుంది.

అరుణ:  అరుణ “యోషిత” సభ్యురాలు. అరుణ కుటుంబం వాళ్లంతా మొదటి నుంచి అభ్యుదయ భావాలు కలవాళ్ళు. బాగా చదువుకున్నవాళ్ళు. ఆమె చెల్లెళ్ళు, అన్న, తమ్ముడు అందరు అమెరికాలో సెటిల్ అయ్యారు. అరుణ మొదట అభ్యుదయ భావాల జోలికి పోలేదు. డిగ్రీ చదివిన తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ తో  పెళ్లయింది. కొడుకు కావాలని, నలుగులు ఆడపిల్లల్ని కన్నది. భర్త వద్దంటున్న వినలేదు. తర్వాత ఒక కొడుకు పుట్టాడు. వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత కాలేజీకి వెళ్లే సమయంలో తీరిక ఉండడంవల్ల “యోషిత”లో చేరింది. “ఇంటి చాకిరి, పిల్లల పెంపకంలో  స్త్రీల స్వేచ్చా స్వాతంత్రాలు హరించబడ్డాయి. స్త్రీలకు ఏ విషయంలోనూ తమ అధికారాన్ని చెలాయించే అవకాశం లేదు. స్త్రీని కేవలం పిల్లలను కనే యంత్రంలాగా మగాడు చూస్తున్నాడు” అని ఆమె అభిప్రాయం.

డాక్టర్ సువర్ణ:  “యోషిత” సభ్యుల్లో డా. సువర్ణ ప్రముఖమైన వ్యక్తి. ఆమె డాక్టర్ గా పని చేసి వైద్య వృత్తిని వదిలి యోషితలోచేరింది.  ఇందులో చేరక ముందు ఎన్నో ఉద్యమాలకు సారథ్యం వహించింది. పుస్తకాలు రాసింది. ఎన్నో సంస్థల నుండి అవార్డులను అందుకుంది. యోషితలో చేరి స్త్రీ విముక్తి కోసం పోరాటం నడుపుతుంది. డా. సువర్ణ తన విద్యార్థి దశలోనే ఒక డాక్టర్ ను వివాహం చేసుకుని వదిలేసింది. తర్వాత ఒక పత్రికాధిపతిని చేసుకుంది. అప్పుడే ఆమెకు ఉద్యమాలతో పరిచయమైంది. బాగా గుర్తింపు, కీర్తి వచ్చాయి.  తర్వాత అతన్ని కూడా వదిలేసి అమెరికన్ డాక్టర్ని చేసుకుంది. “లైంగికంగా స్వేచ్చతో ఉన్న స్త్రీలే తమ లక్ష్యాన్ని సాధించగలుగుతారు. వాళ్లలో ఒక ధైర్యం తెగింపు చొచ్చుకుపోయే గుణం వస్తుంది. పురుషాధిపత్యాన్ని సమాజంలో నశింపచేయాలి. స్త్రీకి అన్ని రంగాల్లో గుర్తింపు రావాలంటే స్త్రీ పురుషుని ఆధీనంలో ఉండకూడదు అని,  లైంగికాది రంగాల్లో స్వతంత్రమైనప్పుడే స్త్రీ ఏమైనా సాధించగలగుతుంది.” అని సువర్ణ అభిప్రాయం.

మిసెస్ కాంతా:  యోషిత సభ్యుల్లో కెల్లా మిసెస్ కాంతా అందంగా  ఉంటుంది. ఆమె ఫ్యాషన్ కోసమే “యోషిత”లో చేరింది. భర్త ప్రైవేట్ కంపెనీలో పెద్ద ఆఫీసర్. ఆమె హైసొసైటి వాళ్ళతో స్నేహం చేస్తుంది. ఆమెతో భర్త ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ ఆమె స్వేచ్చా ప్రణయాన్ని నిర్వహిస్తుంది.

ఈ విధంగా సుజాతారెడ్డి “యోషిత” సంస్థకు చెందిన పాత్రలను పరిచయం చేసింది.  వీరే గాకా పద్మావతి, లీలా, ఆశ, మేఘన వంటి సభ్యులను; వారి వారి ద్వంద్వ వైఖరులను చూపించారు. ఈ నవలా ఇతివృత్తాన్ని అనేక పాత్రల జీవన కథనంలో సహజసిద్ధంగా రచయిత్రి ముదిగంటి సుజాతారెడ్డి రూపొందించారు. 

స్త్రీ పురుషుల మధ్య ప్రేమ, సఖ్య సంబందాలు ఉండడం; స్త్రీల అభ్యుదయం, స్వేచ్చ సమానతల సాధనకు పురుషుల సహకారం ఉండడం మొదలగు అంశాలను రచియిత్రి పేర్కొన్నారు. ఒక విధంగా లిబరల్ ఫెమినిజం భావాలతో నవలా రచన చేసిన రచయిత్రులలో ముదిగంటి సుజాతారెడ్డి మొదటివారు. 

- డాక్టర్ వంగరి త్రివేణి

click me!