సీతాకాంత్ మహాపాత్ర ఒరియా కవిత: కాలం ఎగిరిపోదు

By telugu team  |  First Published Jan 28, 2021, 2:36 PM IST

ఇరుగు పొరుగు శీర్షిక కింద ప్రముఖ తెలుగు కవి వారాల ఆనంద్ ఒరియా కవి సీతాకాంత్ మహాపాత్ర కవితను తెలుగులో అందించారు ఆ కవితను ఇక్కడ చదవండి


ఎగిరిపోయేది కాలం కాదు 
మనుషులు సమస్త జీవజాలమే ఎగిరిపోతుంది
నల్లటి కోటు తొడుక్కున్న మేఘం 
రూప చిత్రం లా కూర్చున్న నాన్నకు
వీడ్కోలు చెబుతూ ఎగిరిపోతుంది
నాన్న తల ఇంటి ముందున్న 
వరండా గోడను అసరాచేసుకుంటుంది 
మరుసటి రోజు 
ఆయన వెనుతిరిగి 
అస్తమిస్తున్న సూర్యునితో పాటు 
ఎగిరిపోయి క్షితిజం లో చేరిపోయాడు
రోదిస్తున్న వృక్షానికి వీడ్కోలు చెబుతూ 
ఆకులు రాలిపోతాయి
కట్టెలు కొట్టేవాడొచ్చి 
చెట్టును నరికేస్తాడు 
తాను పుట్టి పెరిగి నిలబడ్డ నేలకు 
వీడ్కోలు చెబుతూ చెట్టు నేలకు ఒరుగుతుంది
అకస్మాత్తుగా 
ఇల్లూ, నదులూ,అడవులూ, పొలాలూ, చిత్తడి నేలలూ 
బంధువులూ 
కాలం చిత్రించిన అనంతమయిన చిత్రాలూ 
నిశీధిలోకి కదిలిపోవడం చూస్తాం.

Latest Videos

-తెలుగు: వారాల ఆనంద్

click me!