జలఖడ్గానికి జ్ణాపకాలు విచ్చిన్నమవుతాయి అంటూ సిద్దిపేట నుండి డాక్టర్ సిద్దెంకి యాదగిరి రాసిన కవిత " జలదృశ్యం " లో చదవండి
బీడు పారిన భూమ్మీద
ఎదురుచూసే మూగ జీవాల గోస చూడక
తల్లడిల్లుతున్న ఆకాశం ద్రవిస్తున్న హృదయ ఘోష
ఎడతెగక కురుస్తున్న కన్నీరే దు:ఖ వర్షమై
ఆయువు పోస్తున్న అపర బ్రహ్మ
ఏ జీవి భూమ్మీద అంతరించదనీ
చిల్లులు పడ్డ గగనం
నిండే జలాశయమై
నిశ్శబ్ధంగా వాగ్ధానం చేస్తుంటది
సముద్రాన్ని ఎత్తిపోస్తున్న మొగులు
నిరంతరం మహా జలపాతమై పరవళ్ళు దోక్కుతుంటే
నేల నిత్య బాలెంత
వాన మంచిదే
ముంచేదే అతివృష్టి
జల పిడుగుతో హత్య గావించబడ్డ పంట
బతికిన రైతునూ చంపుతుంటది
గాలితో అరిచి కేకేస్తే గుడిసె బతుకు సమాధి
కళకళలాడే ఊల్లూ జలమయం
జలఖడ్గానికి జ్ణాపకాలు విచ్చిన్నమవుతాయి
మిగిల్చిన బాధ జీవితకాలం షాక్
వానమ్మా!
సాలేటి వానకు భూమి పులకించాలే
ప్రకృతి పరిమళించాలే
బతుకులు వికసించాలే
ప్రవాహం చర్నాకోలతో పెట్టే వాతలూ వద్దు
తల రాతలు మార్చి రాసే
కుండపోతా వద్దు
జరామర్ణాలు నీ ఆధీనంలో ఉన్న ఓ వాన ......
మా బతుకంతా జల దృశ్యమే...
సజీవ కావ్యమే
(ఒడవని వానకు...)