నేడు డా.దాశరథి 98వ జయంతి సందర్భంగా గన్నమరాజు గిరిజామనోహర బాబు రాసిన కవిత " శిరసెత్తిన చైతన్యం " ఇక్కడ చదవండి :
అవును , నిజం
చైతన్యం శిరసెత్తింది
ఉక్కుపాదాలకింద నలిగిపోతున్న
మనిషిని కాపాడింది చైతన్యం
సామాన్యునిలో శౌర్యం
మొలకెత్తించిందీ ఈ చైతన్యమే
బానిసగాబతకడం మాని
వీరుడై పోరాటపథం పట్టాలనీ
కత్తిపట్టి కర్తవ్యం నెరవేర్చాలనీ
అప్పుడు ఖచ్చితంగా విజయంనీదేననీ
నరనరానా శౌర్యం నింపిందీ
నిస్సందేహంగా ఈ చైతన్యమే
undefined
ప్రవహించే చైతన్యం
నేర్పింది పోరాటమొక్కటేనా ?
కాదు, అంతమాత్రమే కాదు
మండే గుండెల్లో మల్లెల గుబాళింపుల్నీ
పరిమళింపజేసింది
వసంతాల పచ్చదనాన్నీ
శృంగారపుటూహల్నీ నింపుకుంటూ
హృదయాన్ని సున్నితరీతిలో మధుమయం చేసింది
అగ్నిధారై కురిసిన ఈ చైతన్యమే
కవితాపుష్పకమై విహరించింది
రుద్రవీణగా మ్రోగిన ఈ చైతన్యమే
గాలిబ్ గీతాలై ప్రవహించింది
లోకానికి అమృతాభిషేకంచేసి
పునర్నవాన్ని కలిగించింది
తిమిరంతో ఘన సమరం జరిపి
బతుకుల్ని అమరం చెయ్యాలని తపన పడింది
ఆలోచనాలోచనాల్ని సారించి
సత్యాన్వేషణ చెయ్యాలని బోధించింది
నిస్తేజపు శిశిరాన్ని తప్పించి
నిత్య వసంతాన్నే నిలపాలని కోరింది
శిరసెత్తిన చైతన్యం
శిఖరమైవెలిగింది ...