ప్రముఖ తెలుగు కవి దాశరథి కృష్ణమాచార్యులు 98వ జయంతి సందర్భంగా డాక్టర్ బీంపల్లి శ్రీకాంత్ రాసిన తెలుగు కవిత ఇక్కడ చదవండి...
తెలంగాణ ధిక్కారపోరాటానికి దిక్సూచిగా నిలిచి
అక్షరగంధంతో సాహిత్యంలో పరిమళించిన కవితాపతాక
కోటిరత్నాల తెలంగాణవీణను మీటిన రుద్రవీణ దాశరథి
నియంతృత్వ నిజాంపై కవితాగాండీవాన్ని ఎక్కుపెట్టి
అక్షరశరాలను సంధించిన ధిక్కార కవితాబాణం
ఉరుములుమెరుపులు కురిపించిన అగ్నిధార దాశరథి
నా తెలంగాణ కోటిరత్నాలవీణ అంటూ సింహంలా గర్జించి
కవితాజులుంను విదిలించిన తెలంగాణ కవిసింహం
నియంతలకు అక్షరాలతో సమాధానమిచ్చిన దాశరథి
గాయపడిన కవిగుండెలలోంచి ఎగిసిపడిన కావ్యాలను
అత్యద్భుతరీతిలో ఆవిష్కరింపజేసిన కవితాపుష్పకం
అక్షరాలను తూటాలుగా మలిచిన కవితాశరథి దాశరథి
అక్షరాస్త్రాలతో జనంగుండెలను కవాతు పెట్టించి
ఆలోచనలోచనాలతో దర్శనం చేయించిన కవితాఖడ్గం
తిమిరంతో సమరం చేసిన అక్షరసేనాని దాశరథి