శిఖా - ఆకాష్ కవిత : చీకటి పాట

By SumaBala BukkaFirst Published Jul 8, 2023, 11:31 AM IST
Highlights

ఆ చీకటి కన్ను ఈ నీడల లోకానికి బతుకు స్వరమౌతుంది  అంటూ  శిఖా  - ఆకాష్ రాసిన కవిత  ' చీకటి పాట ' ఇక్కడ చదవండి :

చూపు మసకబారిన చోట
స్వరాలకు కన్నులు మొలుస్తాయి
చీకటి దీపం మేల్కొని
దీపానికి చీకటి లేదని
ఒక గాయం
ఆ వీధిన గేయమై వికసిస్తుంది
రద్దీలో పరిగెడుతున్న కూడలిని 
నిలువునా రోడ్డుకు కట్టేసి
ఒక సమ్మోహన రాగం
బిచ్చమెత్తుకుంటుంది
అక్కడొక వర్షం విచ్చుకుంటుంది
కాలం కాసేపలా
వినమ్రంగా మొక్కుతుంది
ఒక సముద్రమేదో..
అలల ఊయలలో వీధిని 
జో కొడుతుంది
అనంత జీవనకాంక్షా స్వరం
కదల బారిన క్షణాల
రోడ్డు పుష్పిస్తుంది
వీధికి వసంతాన్నిస్తుంది
ఆశ భూమిని ఆహ్వానిస్తుంది
సంకల్పాన్ని ఆకాశం హత్తుకుంటుంది
బతుకు ఒక పాటల పల్లవై మోగుతుంది
ఎడారులు అరణ్యాలై చిగురుస్తాయి
భయానికి ధైర్యం వస్తుంది
ఓటమికి భయం పుడుతుంది
జీవితాన్ని బతికించడానికి
చీకటిని చంపేయడానికి
నిన్ను నీలోకి ఒంపెయ్యడానికి
అనంత వేగాలను కాసేపలా ఆపేసి
ఆనంద రాగాల మధ్య 
సేద తీరడానికి
ఆ చీకటి కన్ను
ఈ నీడల లోకానికి
బతుకు స్వరమౌతుంది
స్వేచ్ఛా శ్వాసల వెలుతురు బీజమౌతుంది
యుద్ధనౌకై నిలబడుతుంది
(కూడలిలో బిచ్చగాడి పాట విన్నాక)
 

click me!