గోపగాని రవీందర్ కవిత : రక్త చలన సంగీతం

By Arun Kumar P  |  First Published Jul 6, 2023, 9:25 AM IST

ఖాళీ కొమ్మలను చూసి చెట్టెప్పుడు దుఃఖపడదు అంటూ గోపగాని రవీందర్ రాసిన కవిత 'రక్త చలన సంగీతం' ఇక్కడ చదవండి :


ఇప్పుడు ప్రతిది బహిరంగమే
మనసులో దాచుకోవడానికేమి లేవు 
మార్కెట్ మాయాజాలంలో
వస్తువ్యామోహ వ్యూహంలో 
వ్యక్తి గతమంటూ లేవు 
విషయాలన్నీచోట్ల
సామాజిక మాధ్యమాల్లో 
ప్రసారమవుతూనే ఉన్నాయి 
సూక్ష్మంగా పరిశీలిస్తేనే తప్ప
అంతరార్థం బోధపడదు..!

చేదు అనుభవాల ఊబిలోకి 
బరువెక్కిన ఆలోచనలతో
అట్టడుగు దాకా దిగిపోతూనే 
దరుల వైపు పట్టు కోసం
కార్య సాధకుడిలా వెతుకుతుంటాం 
కొత్త అనుభూతులు 
పరిమళించే  జ్ఞాపకాలు 
కొత్తదనంలోని భిన్నత్వామే కావాలి 
ఖాళీ కొమ్మలను చూసి
చెట్టెప్పుడు దుఃఖపడదు
విచ్చుకునే మొగ్గలతోనే
సవాల్ విసురుతుందెప్పుడూ..!

Latest Videos

undefined

చిరు సమస్యలకే 
డీలాపడిపోవాలెందుకూ?
ఆత్మీయమైన పలకరింపులకై 
అభిమానపు ఆదరణలకై 
ఆరాటపడాలెందుకూ?
సంతృప్తి లేని
నిలకడ మీద లేని 
అసాధారణమైన సంపద లెందుకూ?
జలాశయాల మీద స్వేచ్ఛగా 
పక్షులు విహరించినట్లుగా 
మానవీయతతోనే చిగురించాలి...!

ప్రయాణాలెప్పుడు ఆనందకరమే 
సమూహంలో ఒంటరి ప్రయాణమంటే 
దిగులు బండలను  మోసుకుంటు సాగడమే 
తనువులో వేగంగా పారుతున్న 
రక్త చలన సంగీతాన్ని
మనసుపెట్టి ప్రశాంతంగా వింటే చాలు 
గోడలు పెల్లలు పెల్లలుగా  
కూలిపోయినట్లుగా 
ఆవరించిన నిరాశల మేఘాలు 
మంచులా కరిగిపోతాయి...!
 

click me!