రష్యా-ఉక్రైన్ యుధ్ధం ప్రారంభమై సంవత్సరం పూర్తయిన సందర్భంగా విశాఖపట్నం నుండి శాంతి రాసిన కవిత
' అలవాటు ' ఇక్కడ చదవండి :
శాంతి కవిత : అలవాటు
రష్యా-ఉక్రైన్ యుధ్ధం ప్రారంభమై సంవత్సరం పూర్తయిన సందర్భంగా విశాఖపట్నం నుండి శాంతి రాసిన కవిత
' అలవాటు ' ఇక్కడ చదవండి :
undefined
అందులో చారిత్రక విశేషమేముంది...?!
ఎందరి దినాలు తీరినాయో తెలిపే
ఒక కలచివేయని కబురు
కన్నీళ్లు తెప్పించని వార్త
కొన్ని గణనాంకాల వివరాలు..అంతే!!
అలవాటైపోయింది.. మరి!
జీవాలు కొన్నే 'హరీ' మన్నాయని
కొంచమే పచ్చిక తవ్వి పచ్చి గోరీలుగా కట్టారని
ఈ పొద్దు హద్దులెక్కువ మీరనే లేదని
పెద్దగా అరిష్టం.. పిల్లలకు, పిట్టలకూ కష్టం
స్త్రీలకు మాన నష్టం జరగనే లేదన్న దినపత్రికను
దిగదుడిచిన కళ్ళు దిగులు పడతాయి
అలవాటైపోయింది మరి..!
మరికొంత వినాశనం జరిగుంటే
మరిన్ని విద్రోహ చర్యులు వినుంటే
ఇంటా బైటా కాస్త చర్చించుకోవచ్చని
దేశాధినేత దౌర్బల్యమో
దేశ ప్రజల దౌర్భాగ్యమో తేల్చి వర్ణించి
విషాదాన్నో వివాదాన్నో వర్గీకరించుకోవచ్చని
టీవీలు అంతర్జాలాలు ఆత్రంగా చూసిన కళ్ళు
చవులూరించని 'చచ్చు' విషయాలకు
తెగ చిరాకు పడ్తాయి
అలవాటైపోయింది మరి..!
గీతలు గీయలేని నీటి మీదనే
కన్పించని కోతలు కోస్కున్న
నరహంతకులైన నేతలు
భూతలం మీద కంచెలు దాటినా దాటకున్నా
భగ్గుమనే చేతలు చూపరా..?!
అసహాయత..అణచివేత
యుద్ధపు అవతారికలుగా చేసి
భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు
హెచ్చరికగా నెత్తుటి చారికలు గీసేసి
ప్రతిరోజూ పద్ధతిగా పైశాచికంగా
గుచ్చే సూదులకు నొప్పి ఉండదు
చచ్చే చావులకు నిప్పూ ఉండదు
మూలిగే మూల్గులకు చప్పుడస్సలుండదు!
అందుకే యుద్ధం జరిగింది..
జరుగుతుంది..జరుగుతూనే ఉంటుంది..
అలవాటైపోయింది మరి..!
ఆలోచించి చూస్తే
అది తాతల నాడే వేస్కున్న పాశం!
ఒక అద్భుత వ్యాపారావకాశం!
పోగాలంతో పోరాడే దేశాలకు
పారాడే పాశవిక మోసాలకు
మందిని చంపుకు తినేటప్పుడు
నంజూడు కొచ్చిన లవలేశం కాదు
లావు లాభాలైన మీనం..మేషం
అలవాటైపోయింది మరి..!
చమురు కావాలి
తిండి గింజలు కావాలి
మందులు మాకులు కావాలి
ఇవేవీ లేకున్నా
మారణాయుధాలు దండిగా కావాలి!
కనుకనే కినుక పడకుండా
గంధకం వాసనను సుగంధం చేస్కుని
పడి ముక్కలైన బడుల నుండీ
విధ్వంసమైన వీధుల గూండా
స్మశానాల అంచుల వెంబడీ
తూటాలుత్పత్తి చేసే తయారీదారులు
బంగారు బాటలు వేస్కుంటారు!
"ఇంకొక ఫిరంగి పేల్చండి
రెండు క్షిపణులు రాల్చండ"ని రెచ్చగొడ్తూ
ఎండిన డొక్కల జోలెలు
బళ్ళకొద్దీ తోలిన బాంబుల్తో నింపుతారు
తమ చిక్కం డాలర్ల తో నింపుకుంటారు
అలవాటైపోయింది మరి..!
కడుపులో చల్ల కదలని
కరుణామూర్తులైన మహాదేశాధినేతలు మాత్రం
మారణ హోమానికి నాంది పల్కిన నింద
'ఎవరి నెత్తిన వేద్దామా?' అని ఆలోచిస్తూ
తాపీగా తుపాకీలు పేలుస్తుంటారు
నిర్ధాక్షిణ్యంగా జీవజాలాన్ని
నరమేథంలో హవిస్సులా వ్రేలుస్తుంటారు
అందరికీ అలవాటైపోతుంది......మరి!!!