గ్రంథాలయం' ఇతివృత్తంగా కవితలకు ఆహ్వానం

By Arun Kumar P  |  First Published Mar 2, 2023, 9:40 AM IST

తెలుగు ప్రజల్లో పుస్తక పఠనంపై ఆసక్తిని పెంచేందుకు 'పాలపిట్ట బుక్స్‌ - లీడ్‌ లైబ్రరీ' మరో గ్రంథాలయోద్యమం తరహా ప్రయత్నాలు చేపట్టాయి.    


హైదరాబాద్ : చదువుతో పాటే సంస్కారం అబ్బుతుంది. చదువు అవసరాన్ని గుర్తింపజేయడమే కాదు చదువుకోడానికి ఆలవాలమైన గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేయాలి.మరో గ్రంథాలయోద్యమం ఇవాళ్టి అవసరం. లీడ్‌ లైబ్రరీ ఆధ్వర్యాన అనేక గ్రామాలలో లైబ్రరీలు ఏర్పాటు చేస్తున్నారు.ఇదే తరహాలో  గ్రామగ్రామాన విజ్ఞాన భాండాగారాలు వెలిసేలా ప్రయత్నించడం అవసరం. సాంకేతిక వనరులు ఎన్ని వున్నా పుస్తకం పట్టుకొని చదివే అలవాటును ఈకాలం విద్యార్థులలో, యువతలో ప్రోది చేయాలి. వారిని గ్రంథాలయాల వైపు నడిపించాలి. ఇప్పటికే ఉన్న గ్రంథాలయాల పునరుజ్జీవనానికి తోడ్పడాలి. అనేక ప్రాంతాలలో చిన్న చిన్న లైబ్రరీలయినా ఏర్పాటు చేయాలి. ఒక్కమాటలో చెప్పాలంటే వందేళ్ళ కిందటి మాదిరిగా గ్రంథాలయోద్యమం కోసం శ్రీకారం చుట్టాల్సిన సందర్భమిది. 

దాదాపు వందేళ్ళ కిందట తెలుగునాట సకల ప్రాంతాలలో గ్రంథాలయోద్యమం ఉధృతంగా సాగింది. వట్టికోట ఆళ్వారుస్వామి, కోదాటి నారాయణరావు లాంటి వారు క్రియాశీలకంగా వ్యవహరించారు. ఊరూరా గ్రంథాలయాల ఏర్పాటుకు ఎంతో కృషి చేశారు. ఆనాటి కాలంతో పోలిస్తే అక్షరాస్యత పెరిగింది.  కానీ గ్రంథాలయాలు నిస్తేజమవుతున్నాయి. విద్యార్థులకు, గ్రంథాలయాలకు సంబంధం లేకుండా పోయింది. మొబైల్‌లో కూడా పుస్తకాలు చదువుకోవచ్చు అని చెబుతున్నారు. కానీ ఎంతమంది ఆ సదుపాయాన్ని వినియోగించుకుంటారు. అయినా పుస్తకం పట్టుకొని చదవడం ద్వారా లభించే ఆనందం భిన్నమైంది. అందుకని పుస్తకాలు చదివించే అలవాటును పెంపొందింప జేయాలి. ఈ పనిని ఉద్యమంగా చేపట్టాలి. కనుక  ఈ విషయమై స్పందించి, గ్రంథాలయం ఇతివృత్తంగా 'జ్ఞానదీపం-గ్రంథాలయం' పేరుతో పాలపిట్ట బుక్స్‌ - లీడ్‌ లైబ్రరీ కలిసి ఒక కవితా సంకలనం ప్రచురించాలని సంకల్పించారు. ఇందుకోసం వస్తు శిల్పాలలో నవ్యతని పాటిస్తూ కవితలని పంపించవలసిందిగా కాసుల రవికుమార్‌ కవులను కోరుతున్నారు.

Latest Videos

undefined


కవితలు పంపడానికి చివరి తేదీ మార్చి 30, 2023.

మీ కవితలను  palapittabooks@gmail.com లేదా kasula.ravikumar8@gmail.com కు పంపగలరు. 
పోస్టులోను పంపవచ్చు. చిరునామాః 
పాలపిట్ట బుక్స్‌,
ఫ్లాట్‌ నెంః 2, ఎం.ఐ.జి-2, బ్లాక్‌-6, 
ఏపిహెచ్‌బి, బాగ్‌లింగంపల్లి
హైదరాబాద్‌-500044
ఫోనుః 9490099327, 7981068048
 

click me!