అద్భుతమైన రచయితలతో తెలుగు సాహిత్యసేవ చేస్తున్న యువ రచయిత డాక్టర్ సుంకర గోపాలయ్య పెన్నా రచయితల సంఘం అందించే పురస్కారానికి ఎంపికయ్యాడు.
పెన్నా రచయితల సంఘం తెలుగు సాహిత్యకారులకు ప్రోత్సహించేందుకు గత 12 సంవత్సరాలుగా ఉత్తమ కవితా సంపుటాలకు సాహిత్య పురస్కారాన్ని అందజేస్తున్న విషయం తెలిసిందే.ఈ సాహిత్య పురస్కారం - 2022 కి గాను కవితా సంపుటాలకు ఆహ్వానించగా దాదాపుగా 40 కవితా సంపుటాలు వచ్చాయని...వాటిలో "డాక్టర్ సుంకర గోపాలయ్య " రచించిన "మా నాయన పాట" అనే కవితా సంపుటి ఎన్నిక అయినట్టు పెన్నా రచయితల సంఘం ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ పురస్కారానికి న్యాయ నిర్ణేయతలుగా మేడిపల్లి రవికుమార్, శ్రీమతి మందరపు హైమావతి వ్యవహరించారు.త్వరలో జరగబోయే సాహిత్య పురస్కార బహూకరణ సభలో విజేతలకు నగదు బహుమతితో పాటు పురస్కారాన్ని అందజేస్తామని పెన్నా రచయితల సంఘం తెలిపింది.
''పురస్కారానికి ఎంపికైన గోపాల్ కొత్త తరంవాడు... కొత్త అభివ్యక్తీ కలిగిన వాడు. అందుకే ప్రతి కవితా, ప్రతి పదచిత్రం తాజా పరిమళాలు వెదజల్లుతున్నాయి. ఆలా అని పదచిత్రాలు ఇబ్బడి ముబ్బడిగా గుప్పించడు. ఎంతవరకు, ఎక్కడ ఎలా వాడాలో బాగా తెలిసిన వాడు. పడవలు నడిపే తెడ్లను ఉద్యమ జెండాలుగా తెలుగు కవిత్వంలోకి పట్టుకొచ్చినవాడు. అతడి అభివ్యక్తి వినూత్నంగా ఉంటుంది. ‘చెట్టంటే మేఘానికి వర్షరాగం నేర్పిన/ సంగీత విద్వాంసుడు ' ఇలాంటి అభివ్యక్తులతో ప్రతి వస్తువునీ తాజా అయిన కొత్తచూపుతో ప్రకృతిని, జీవితాన్ని, సమాజాన్నీ నిశితంగా, నిబద్ధతతో కవిత్వంగా అందించాడు గోపాలయ్య'' అంటూ పెన్నా రచయితల సంఘం అభినందించింది.