ఫోటో బయోగ్రఫీ : ‘సత్యజిత్ రే ఎట్ 70’

By Arun Kumar P  |  First Published May 30, 2022, 2:23 PM IST

అందుకున్నాను శీర్షికలో భాగంగా ఈ వారం ‘సత్యజిత్ రే ఎట్ 70’  అందిస్తున్నారు వారాల ఆనంద్.


సత్యజిత్ రే 100వ జయంతి సందర్భంగా నా బుక్ రాక్ లోంచి ‘సత్యజిత్ రే ఎట్ 70’ అందుకున్నాను. అది ఓ గొప్ప ఫోటో బయోగ్రఫీ. మనకు బయోగ్రఫీలు, ఆటో బయోగ్రఫీలు తెలుసు కానీ ఇది ఫోటో బయోగ్రఫీ. అంటే రే జీవితాన్ని, భిన్న మూడ్స్ ని మన ముందుకు తెచ్చారు ప్రముఖ ఫోటోగ్రాఫర్ నిమాయి ఘోష్.(‘చిన్నమ్మూల్’ తీసిన నిమాయి ఘోష్ కాదు, ఇతను వేరు)

దృశ్య శ్రవణ స్థిత ప్రజ్ఞుడు సత్యజిత్ రే శతజయంతి సంవత్సరంలో ప్రపంచమంతా ఉత్సవాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా బెంగాల్లోనయితే మరీ ఎక్కువ. సత్యజిత్ రే ఫిలిం ఇన్స్టిట్యుట్ లో ఆయన విగ్రహావిష్కరణ చేసారు. సెమినార్లు ఫిలిం ఫెస్టివల్స్ ఇంకా ఎన్నో, అంతెందుకు ఇటీవలే ముగిసిన కేన్స్ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ లో ఈ మధ్యే Restore చేసిన ఆయన సినిమా ‘ప్రతిద్వంది’ ప్రదర్శించారు.

Latest Videos

సత్యజిత్ రే మనల్ని విడిచి వెళ్లిన 30 ఏళ్ల తర్వాత కూడా ఇంకా ఆయన సృజన ఎంతోమంది కళాకారులని ఉత్తేజ పరుస్తున్నది. ఆయన ఆవిష్కరించిన దృశ్య వాస్తవికతను ఇంకా అర్థం చేసుకోవాల్సివుంది,  ముందుకు తీసుకేల్లాల్సి వుంది.

ఇక ఈ పుస్తకం విషయానికి వస్తే దీని రచయిత నిమాయిఘోష్. రచయిత అంటే మామూలు అర్థంలో కాదు తను తన కేమెరాతో ఇమేజెస్ తో రే జీవితాన్ని మన ముందుంచాడు.  ప్రఖ్యాత ఆంగ్ల రచయిత సామ్యుల్ జాన్సన్ వెంట వుండి  గొప్ప జీవిత చరిత్ర రాసిన బోస్వెల్ లాగా రే వెంట దాదాపు 25 ఏళ్ళు వుండి రే ఫోటోలు తీసిన వాడు నిమాయి ఘోష్. తన మొదటి రోజుల్లో ఎప్పుడూ ఫోటోగ్రాఫర్ కావాలని అనుకోని ఘోష్ ఒక సారి రే ని కలిసాక ఆయన ఆసక్తి మారిపోయింది. అప్పటిదాకా గాయకుడు లేదా నటుడు కావాలనుకున్న జీవితం మలుపు తిరిగింది. మొదట ఘోష్ కలకత్తాలో ఒక నాటక గ్రూపులో చేరాడు. అక్కడ ఉత్పల్ దత్, రబీ ఘోష్ తదితరుల పరిచయం కలిగింది.  వారు ఆయన్ను నాటకాల్లో డైరెక్ట్ చేసారు.

ఒక రోజు రే సినిమా ‘గోపీ గ్యానే భాగా బయ్నే’ లో నటిష్టున్న రబీ గోష్ ను కలవడానికి నిమాయి కొంతమంది మిత్రులతో కలిసి షూటింగ్ జరుగుతున్న గ్రామానికి వెళ్ళారు. అక్కడే నిమాయి మొట్టమొదటి సారిగా రే ను చూసాడు. ఎవరో కెమెరా చేతికిస్తే ఫోటోలు తీయడం ఆరంభించాడు. ఇక అంతే ఫోటోగ్రఫీ, సత్యజిత్ రే ఆయన జీవితంలో భాగమయి పొయ్యారు. అట్లా 25 ఏళ్ళ పాటు రే ను చూస్తూ భిన్న సంద్రర్భాల్లో విభిన్న మూడ్స్ లో సత్యజిత్ రే ని తన కెమెరాలో నిక్షిప్తం చేసాడు. రే రాసుకుంటున్నప్పుడూ. రికార్డింగ్ రూములో వున్నప్పుడు .. కేమెరాతో.. ట్రాలీ లో లాంగ్ షాట్ లో క్లోసప్ లో ఇలా ఒకటేమిటి సినిమా షూటింగ్ కు సంబంధించి అన్ని కోణాల్లో రే ఆక్షన్ ని తన కెమెరాతో షూట్ చేసాడు. కేవలం షూటింగ్ సమయాల్లోనే కాదు రే నవ్వు, కోపం, ఆశ్చర్యం, ఆనందం.. అన్ని భావాల్నీ తనకు చెప్పకుండా తీసాడు నిమాయి ఘోష్.

ఫోటో తీయడానికి ‘రే’ను అనుమతి ఎప్పుడూ అడగలేదు అంటాడు ఘోష్. తీస్తూ పోయా అంతే నన్నాడు. ఒక్కోసారి ఫోటోలని చూసి అరె ఇదెప్పుడు తీసావు అని రే అన్నప్పుడు తనకు ఎంతో ఆనందం కలిగేదని ఘోష్ రాసుకున్నాడు. రే నవ్వు చిన్న పిల్లాడిలా వుండేది అన్న ఘోష్ తాను ఎప్పుడయినా depression కు గురయినా, తనకేప్పుడయినా  low  అనిపించినా మానిక్ దా ( సత్యజిత్ రే) వద్దకు వెళ్లి ఆయన్ని చూస్తే చాలు గొప్ప హుషారు వచ్చేది అనికూడా రాసుకున్నాడు.

హెన్రి కార్టర్- బ్రేస్సన్ ముందు మాట రాస్తూ ఇదొక విజువల్ గిఫ్ట్ అన్నాడు. ఇంకో మాటలో సత్యజిత్ రే రాస్తూ నిమాయి ఘోష్ పెన్ తో కాకుండా కెమేరాతో తన జీవితాన్ని రాశాడన్నారు. ఇంకా ఈ ‘సత్యజిత్ రే ఎట్ 70’ లో రే గురించి ప్రపంచ వ్యాప్తంగా వున్న గొప్ప గొప్ప దర్శకులు రచయితలూ వెలిబుచ్చిన అభిప్రాయాల్ని క్రోడీకరించారు.

“ రే సినిమాలు చూడ్డం ద్వారానే భారతీయ అంతరాత్మని అత్యంత లోతుగా అర్థం చేసుకోగాలిగానని’ మయిఖేలాన్జిలో అంటోనియోనీ అన్నాడు. రే సినిమాల్లో వాస్తవికత ఎదిగి కవిత్వ వాస్తవికతగా రూపుదిద్దుకుంటుంది అన్నాడు ఎం.ఎఫ్ హుసెన్. ‘గాంధీ’ పాత్రను పోషించిన బెన్ కింగ్స్లే రాస్తూ “ I salute you, the greatest of our poets of our cinema “ అన్నాడు. ఇలా ఒకరేమిటి లిండ్సే ఆండర్సన్, గోవింద్ నిహలానీ, అరవిందన్, అదూర్, గస్తాన్ రోబెర్గ్, సల్మాన్ రష్దీ, మ్రినాల్ సేన్, ఇలా ఎందరెందరో ‘సత్యజిత్ రే ఎట్ 70’  లో సత్యజిత్ రే పై తమ ప్రేమని అభిమానాన్నీ చాటుకున్నారు.

ఇవన్నీ ఎట్లున్నా నిమాయి ఘోష్ తీసిన రే ఫోటోలు మాత్రం ఆయనను విభిన్న మూడ్స్ లో విభిన్న కోణాల్లో ఆవిష్కరించాయి. కొన్ని నవ్వు తెప్పిస్తే మరికొన్ని సంతోషం కలిగిస్తాయి. గ్రేట్ ఫోటోస్. దాదాపు జీవిత చరిత్రని ఫోటోలలో బందించిన ఘోష్ అభినందనీయుడు. రే అభిమానులూ మంచి సినిమా అభిమానులూ తప్పకుండా చూడాల్సిన, చదవాల్సిన పుస్తకమిది.  

నిమాయి ఘోష్ 1934లో 8 మే న జన్మించారు.  2020 మార్చ్ 25 న తనువు చాలించారు. రే గొప్ప ఇమేజెస్ ని అభిమానులకు మిగిల్చారు.

థాంక్ యు నిమాయి దా .

click me!