మనసు విప్పి, ఎపుడైనా నాతో మాట్లాడావా?? అంటూ సహచరున్ని ప్రశ్నిస్తున్న ప్రసూన బిళ్ళకంటి కవిత " ఆత్మ ఘోష " ఇక్కడ చదవండి
ఆత్మ ఘోష
నీతోనే నేనుంటా
నీలోనే నేనుంటా
ఐనా
నేనంటే నీకు లెక్కేలేదు
దేహానికి హారతి పడుతావు
అందాన్ని ఆరాధిస్తావు
అలంకరణకు అగ్రపీఠం వేస్తావు
కానీ నేనున్నానని మరిచే పోతావు
కోరికలను కొండెక్కిస్తావు
కోపానికి నిచ్చెనలేస్తావు
ఆనందం చిందులు వేయగ
అందలమే ఎక్కేస్తావు
కానీ నన్నే పక్కన పడవేస్తావు
అసలు నేను లేని నువ్వే లేవని తెలిసి
తెలిసీ తెలియనట్లుగా అంతరంగంలో నొక్కిపట్టి
ఒక నిమిషం అయినా నాకోసం కేటాయించావా ?
నేనే నీ ఆత్మనైనా
నా ఆత్మఘోష విన్నావా ??
మనసు విప్పి, ఎపుడైనా
నాతో మాట్లాడావా ???