కరీంనగర్ లో సాహితి సోపతి పదేళ్ల పండుగ జరిగింది. ఈ సందర్భంగా వివిధ సాహితీ ప్రక్రియలపై చర్చగోష్టులు జరిగాయి. పుస్తకావిష్కరణలు కూడా జరిగాయి.
సాహితీ సోపతి సంస్థను నెలకొలిపి పదేండ్లు నిండిన సందర్భంగా ఏప్రిల్ 5,2021 సోమవారం కరీంనగర్ ఫిలిమ్ భవన్ లో ఒక రోజు కథ, కవిత్వ సదస్సు తెలంగాణ సాహిత్య అకాడమి సౌజన్యంతో జరిగింది.
పొద్దటి పూట అన్నవరం దేవేందర్ అధ్యక్షతన జరిగిన "కవిత్వం ముచ్చట" లో కె. ఆనందాచారి, డా. కాంచనపల్లి గోవర్థన రాజు, డాక్టర్ నలిమెల భాస్కర్, డాక్టర్ గండ్ర లక్ష్మణరావు, గాజోజు నాగభూషణం, మల్లావజ్ఝల నారాయణ శర్మ, గులాబీల మల్లారెడ్డి తదితరులు మాట్లాడారు. కూకట్ల తిరుపతి సంపాదకత్వం వహించిన "సోపతి" బులెటిన్-2 ను కె. ఆనందాచారి, దామరకుంట శంకరయ్య రచన "సీతాకోక రెక్కలు" హైకూలను డాక్టర్ కాంచనపల్లి గోవర్థన రాజు ఆవిష్కరించారు.
undefined
కందుకూరి అంజయ్య అధ్యక్షతన జరిగిన కథ ముచ్చటలో జూపాక సుభద్ర, డాక్టర్ బి.వి. ఎన్. స్వామి, బెజ్జారపు రవీందర్, బూర్ల వేంకటేశ్వర్లు, మాడిశెట్టి గోపాల్, బుర్ర తిరుపతి తదితరులు ప్రసంగించారు. డిగ్రీ విద్యార్థుల కవిత్వం "విద్యార్థి కలం" ను జూపాక సుభద్ర ఆవిష్కరించారు.
అక్కెపల్లి ఫౌండేషన్ కరీంనగర్, సినారె విశిష్ట సాహిత్య పురస్కార ప్రశంస పత్రాలు, తలా పదకొండు వందల పదహారు నగదుతో నడిమెట్ల రామయ్య, కందుకూరి అంజయ్య, కూకట్ల తిరుపతి, తోట నిర్మలారాణి, పెనుకొండ సరసిజ, దామరకుంట శంకరయ్యలకు ప్రదానం చేశారు. సాహితీ సోపతి-పదేండ్ల పండుగకు కూకట్ల తిరుపతి, సి. వి. కుమార్ సమన్వయకర్తలుగా వ్యవహరించారు. అనంతరం ఈ పండుగలో పాల్గొన్న సాహిత్యకారులకు జ్ఞాపికలను అందించారు.
ఏప్రిల్ 11న కొత్తపల్లి నరేంద్రబాబు సాహిత్య పురస్కారం ప్రదానం
ప్రముఖ కవి, సీనియర్ జర్నలిస్ట్, కవిసమ్మేళనం సాహిత్యవేదిక వ్యవస్థాపకులు కొత్తపల్లి నరేంద్రబాబు స్మారకార్థం ప్రతిఏటా ఇచ్చే సాహిత్య పురస్కారానికి విశేష స్పందన లభించిందని, ఈ ఏడాది అవార్డు కోసం పలు కవితాసంపుటిలు పోటీపడ్డాయని ప్రముఖ కవి, నిర్వాహకులు కొత్తపల్లి సురేష్ తెలిపారు.
మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఉపాధ్యాయుడు, యువకవి తగుళ్ళ గోపాల్ రాసిన "దండకడియం" కవితా సంపుటిని ఈ ఏడాది కొత్తపల్లి నరేంద్రబాబు సాహిత్య పురస్కారానికి అవార్డు కమిటీ ఎంపికచేసింది. న్యాయనిర్ణేతలుగా ప్రముఖ సాహితీవేత్తలు జి.వెంకటకృష్ణ, పలమనేరు బాలాజీ, కె.నాగేశ్వరాచారి వ్యవహరించారు.
ఏప్రిల్ 11వ తేది ఆదివారం ఉదయం అనంతపురంలో జరిగే ప్రత్యేకసభలో కవి తగుళ్ల గోపాల్ కు అవార్డు అందజేసి సత్కరించనున్నట్లు కొత్తపల్లి సురేష్ వివరించారు.సాహిత్యాభిమానులు, కవులు, రచయితలు, నరేంద్రబాబు అభిమానులు, ఆత్మీయులు హాజరై జయప్రదం చేయాలని కోరారు.