అసలు సిసలైన పల్లె పదాల పొత్తం "ఆరుద్ర పురుగు"

By telugu team  |  First Published Apr 1, 2021, 2:27 PM IST

కూకట్ల తిరుపతి కవితా సంపుటి "ఆరుద్ర పురుగు"  పై మందమర్రి నుంచి బోయిని సరోజ పోచమల్లు రాసిన సమీక్ష ఇక్కడ చదవండి.


కూకట్ల తిరుపతి  రాసిన 37 వచన కవితల సంపుటి "ఆరుద్ర పురుగు".  ఇందులో అన్ని కవితలు తెలంగాణ భాషలో నడిచినవి.  వస్తువులన్నిటిలో  తెలంగాణ తనమే ఉంటది.  అంటే ఇక్కడి పండుగలు, పబ్బాలు, బతుకులు, పోరాటాలు.  ఇంత మంచి పుస్తకం పరిచయం చేసే అవకాశం దొరికినందుకు ముందు మీకు శెనార్థులు.

ఓ...కవి తన మనో భావాలకు అక్షర రూపం ఇవ్వడమంటే....! అది పాల సముద్ర మథనమే...! అక్షరామృతాన్ని అందివ్వడానికి ఆ కవి తన ఆలోచనల్ని ఎంతగానో మధిస్తే తప్ప కవితామృతాన్ని పాఠక లోకానికి పంచలేడు.

Latest Videos

ఇక ఈ కవితలలో మనుషులకు మనుషులకు మధ్యగల మానవీయ బంధం విలువ.  విశ్వాసం గల ఒక జంతువు పట్ల మనుషులు చూపే ప్రేమ.
కడేసిన కర్రె గొంగడి...భుజం పై ఏసుకొని.... ఇంకా పచ్చి పాలు ఓసి పావురంగా పెంచుకున్న జంతువు.  సెంగలిచ్చుకుంటా కాల్లల్ల కలె మెదులుకుంటా .... రెక్కలల్ల, బొక్కలల్ల పెరిగిన పాణం.  మందకు వందల మంది బోయిల పెట్టు ఒకతే కాపలగా వుండే..ఒక జంతువు గురించి బాగా చెప్పిండు కవి ..."మా తాత యాదిలో " శీర్షికన రాసిన కవిత ఆలోచింపజేస్తుంది.

చెరువు కుంటల్ల అడుగున పేరుకపోయిన మట్టిని మీగడతో పోల్చటం...
కుమ్మరోల్ల బతుకుల గురించి, మాగిన మట్టిని తెచ్చి తడిపి మట్టితో ఆల్లు  సేసె అస్తువుల గురించి.. ముఖ్యంగా మట్టి పూల ఆసనను వర్ణించిన తీరు బాగుంది. "మట్టి పూలు ఒక మనాది" కవిత ప్రపంచీకరణ మోసాన్ని తేట తెల్లం చేసింది.

మన తెలంగాణను ఎప్పటికీ ఏలుదామనుకున్న ఆంధ్రోళ్లను  తరిమికొట్టే గర్జన.  హైదరాబాద్ మాది. ఉడుం లెక్క వచ్చి.....పున్నమి జీవితాలల్ల......అమాస తెచ్చిండ్రు.....ఖబర్దార్ బిడ్డా! నా నేలను ఇడిసి, ముల్లె మూట సదరుకొని పోకుంటే ....గండి మైసమ్మ కాడ గావు వడతా బిడ్డా....చాలా బాగుందన్నా! తెగించిన కొట్లాట.  తెలగోలుజేసే, పంచాది.

తెలంగాణ అచ్చిన సంబరంల సోయి తప్పి.... ఇప్పుడే పురుడువోసుకున్న పసిబిడ్డ బొడ్డు తాడుకు బదులు బొండిగ కోసేరు.... భౌగోళిక తెలంగాణ కాదు....
సామాజిక తెలంగాణ రావాలి అని చెప్పడం.  దండు కట్టింది, దరువులేసింది, ధూంధాంల దుమ్ములేపింది బహుజన దండులే కదా!  అది ఆకుపచ్చ తెలంగాణగా మారాలి.

"నెత్తికెత్తుకొనే రోజులు"  కవితలో బతుకమ్మ పూల గురించి చెప్పిన తీరు ముచ్చటేస్తది. తీరొక్క పూల వర్ణన బడుగు జీవుల బతుకు చిత్రాలుగా గీశారు.  బతుకమ్మకు పనికిరాని పువ్వు అంటూ ఏదీ ఉండదుగా...గుడికి, జెడకు  నోసుకోని పువ్వులు.  ఆదరణకు,అందలానికి ఆశపడక  ఉద్యమానికి ఊతం అయినయి.   వెలేసిన మనుషులు,  వెలుతురు సోకని జీవితాలకు కూడా ఒక రోజు వస్తుంది అని చెప్పడం సముచితంగా ఉంది.  ఇది బడుగు జీవుల కోసం భరోసా గీతం పాడినట్టుగా ఉంది.  ఇలానే తంగేడు పువ్వు వర్ణన చాలా బాగుంది. ఇందులో తంగేడు ఔషధ గుణాలను సవివరం చేశారు. తెలంగాణ రాష్ట్ర పుష్పంగా తంగేడును గుర్తించడం సముచితమంటాడు కవి.

ఎన్కటికెల్లి వొత్తున్న మన ఆచారాలు, మన సంప్రదాయాలు  ముఖ్యంగా గొల్ల, కురుమల మల్లన్న బోనాలు, పట్నాల గురించి రాసిన కైతలు సహజంగా ఉన్నాయి.  నియ్యతి గల్ల జీవితాలకు అద్దం పడుతున్నట్టుగా ఉన్నాయి.  దేశీ మూలాల సోయిని ఎరుక జేస్తున్నాయి. "శరణు మల్లన్న, పొలమ రాజుల పండుగ" కవితలు ఇందుకు ఉదాహరణలు.

అన్నిటి కంటే మన తల్లిభాష గొప్పదనం గురించి మాబాగా రాసిండు కవి.  బడికి పోయేదాక అమ్మ బాష మాట్లాడే మనం బడికి పోయినంక బల్లె పంతులు చెప్పే పాఠాల భాష మాట్లాడుతాం.  ముఖ్యంగా బడిపంతులు నీతో సెప్పించిన ప్రమాణిక భాషా పాఠం. మన తెలంగాణభాషను ఎలా తొక్కేసిందో తెలుస్తుంది.  "ఆయిల్లా ఆన అచ్చి ఆకిట్ల అడ్లుతడిసినయ్...."దీన్ని బల్లె పంతులు ..నీతో సెప్పించిన వైనం "రాత్రి వాన వచ్చి వాకిట్లో వడ్లు తడిసినయ్"అని నీకు నేర్పిన పాఠం. ఇంటి భాషకు దూరం జేసింది. "మనకు బడి పలుకుల భాష కాదు.పలుకు బడుల భాష కావాలే" - కాళన్న చెప్పిన మాటలను ఇప్పటి కన్నా నిలబెట్టుకొందాం.

మన వ్యవహారంలో మాత్రమే కాదు  ఇప్పటికి మన పాఠ్య పుస్తకాలను ఆంధ్ర భాషనే ఏలుతుంది.  తెలంగాణ అచ్చినాక పాఠ్య పుస్తకాలలో కొంత మార్పు వచ్చినా, ఇంకా మన తెలంగాణభాషలో బొత్తిగా పాఠాలు రాక పోవడం దురదృష్టం కాదా! పాఠ్య పుస్తకాలలో మన తెలంగాణ కవులను ఎనబై శాతం మందిని పరిచయం  చేస్తున్నారు. సీమాంధ్ర కవులకు ఇరవై శాతం అవకాశం ఇస్తున్నారు. తప్ప మన తల్లిభాషను, మన ఇంటిభాషను పూర్తిగా తీసుకు రావడం లేదు.  ఆంధ్ర భాషా పెత్తనంల మన భాష మీద పూర్తి పట్టు ఎవరికి లేకుండా పోతున్నది.  మన భాషల మాట్లాడుడు మోటు అనుకుంటున్నరు.  మన తెలంగాణ పోరు గడ్డ, ఉద్యమాలకు ఊపిరి పొసే నేల తల్లి.   అలాంటి మన తల్లి భాషకు సరైన గౌరవం దక్కలేదు.  సమాజంలో కొంత మార్పు వచ్చినా, అసలు సిసలైన భాషకు ఇంకా అన్యాయమే జరుగుతున్నది.

రాజన్న సినిమాలో నైజాం కాలంల ప్రజలు ఎదురుకున్న కట్టాలు, ఆడవాళ్ళను వాళ్ళు పెట్టిన బాధలు, గఢీల దొరసాండ్లు,  దొరల పెత్తనంతో జనాలు వడ్డ బాధలు చూపెట్టిరు.  మన భాషతో మనం వడ్డ బాధలను చూపించడం నాకు బాగా నచ్చింది.  అలాంటి సినిమాలు ఇంకా రావాలి.   జనాలను చైతన్య పరచాలి.  "జీల్గుల జాతర",  జిలాల గుట్ట, బతుకు సోగడ"  పేర్లతో ఉన్న కవితలు ఎంతో ఆవేదనతో రాసినవి.   ఇప్పటికీ విచ్చల విడిగా  జరుగుతున్న వనరుల విధ్వంసం,  దోపిడీల గురించి జనాన్ని మేలుకొల్పె రచనలు ఇంకా రావాల్సిన అవసరముంది.    ఇప్పటికైనా జనం సోయికి  రావాలే. బల్లె పాఠాల కాడి నుండి  మొదలుకొని,  అందరూ మన తెలంగాణ భాషను మాట్లాడితే ఎంతో బాగుంటంది.  దాన్ని కాపాడుకుంటేనే మన ఉనికి, మూలాలు బతికి బట్టకడుతయి.  ముందు తరాలకు గూడా సరిగ్గా అందుతది.  మన కవులు రచయితలు ప్రత్యేక తెలంగాణ ఉద్యమ కాలంలో మనభాషలో రచనలు విరివిగా చేశింరు.   రాష్ట్ర ఆకాంక్షను చాటింరు.  జనాన్ని ఉద్యమ బాట పట్టించింరు.  అదే రీతి ఎప్పటికీ కొనసాగవలసిన అవసరముంది. అచ్చమైన తెలంగాణ భాష, నుడికారం, జాతీయాలు, పలుకుబడులు, పద బంధాల కూర్పుగా వచ్చిన "ఆరుద్ర పురుగు" కు అభినందనలు.  కూకట్ల తిరుపతి కలం నుండి మరిన్ని అస్తిత్వవాద రచనలు జాలువారాలని మనసారా కోరుకుంటున్నాను. ఇప్పటికిప్పుడు మన భాషను కాపాడుకోవడం కోసం ఏదన్నా  ఉద్యమం వస్తే మంచిగుండు. పరాయి భాష పెత్తనాన్ని తొక్కేస్తే బాగుండు.

ప్రతులకు: కూకట్ల లక్ష్మి,
ఇ.నం : 1-29/1,
గ్రామం: మద్దికుంట,
మండలం: మానకొండూర్,
జిల్లా: కరీంనగర్.

click me!