ఇరుగు పొరుగు శీర్షిక కింద ప్రముఖ కవి వారాల ఆనంద్ ధంగ్జమ్ ఇబోపిషాక్ మణిపురి కవితను తెలుగులో అందించారు. చదవండి.
ఇవ్వాళ ఈ నెల మీద
ఎవ్వరూ బిగ్గరగా మాట్లాడలేరు
ఎవ్వరూ బహిరంగంగా కలలు కనలేరు
అందుకే కవితా
నీతో పువ్వులా ఆడుకుంటాను
నా కళ్ళముందు
సంఘటన వెనుక సంఘటన
కొన్ని అద్భుతమయినవి మరికొన్ని వణికించేవి
నడుస్తూనే నిద్రపోతున్నా
కళ్ళు తెరిచే కలలు కంటున్నా
నిలుచునే చెడ్డ కలలు కంటున్నా
కలల్లోనూ వాస్తవంలోనూ
భయంతో వణికించే సంఘటనలు
నా చుట్టూరా
మూసిన కళ్ళు
అరచేతులతో మూసిన చెవులు
హృదయాన్ని మట్టి ముద్దగా
మలుస్తున్న వైనం
నేను పువ్వులపై కవిత్వం రాస్తాను
ఇవ్వాళ ఈ నెల మీద
పువ్వులగురించే ఆలోచించాలి
పువ్వుల గురించే కలలు గనాలి
నా భార్యకోసం చిన్న పాపకోసం,
నా ఉద్యోగం కోసం
హాని జరకుండా
నన్ను నేను రక్షించుకోవడం కోసం
మణిపురి మూలం: ధంగ్జమ్ ఇబోపిషాక్
ఇంగ్లీష్: రోబిన్ ఎస్. గాంగమ్
తెలుగు: వారాల ఆనంద్