తెలుగు సాహిత్యంలో తెలుగు కవిత్వానికి విశేషమైన స్థానం ఉంది. రూప రుక్మిణి కె రాసిన ప్రేమ చెలమ కవిత చదవండి
వేదనో సంవేదనో
మనసు పొరలలో
ఆమె గొంతు పెకలకుండా మాటదారికి అడ్డుపడుతుంటావు
నీవెప్పుడూ ఇంతే!!
ఒత్తిడి ఒరలో కత్తి మొనకు తేలుతూ..
ఎక్కడ ఏమి జరిగినా
ఆమె చేతి టీ కప్పులో తుఫానవుతూ..
తన చేతి గాజుల చప్పుడు కూడా నీ గుండెలో రైళ్ల మోతలా ఉంది అని ఆమె చెవులకు చీదరింపురాగం వినిపిస్తూనే...
పండగపూట మామిడి తోరణంలా నిత్యం పచ్చని నవ్వులు నవ్వమంటావు,
పలకరింపులు లేనిచోట వంతపాటకి పదమవ్వమంటావు,
నీ ఇష్టాయిష్టాల్లో ఆమె అభిరుచిని కడిగేస్తావు,
పరుసు బరువు సమానం అన్నవాడివి,
పనిబరువుకిమాత్రం
బుగ్గగిల్లిన సముదాయింపులలో
నీ చిరునవ్వులకు తాళం వేయిస్తూ
బిగించిన కౌగిలికి ప్రాణం ఉక్కబెట్టేస్తావు
అలసిన నీ మనసుకి సేదతీర్చేమందుగా ఆమెను చేసుకుంటావు.,
అలసిన ఆమె మనసుకి,శరీరానికి ఎప్పుడూ..ఎక్కడా..ఏ రిటైర్మెంట్లు లేవన్న సంగతి మరచి.
ఇప్పుడు పెద్దగా ఆమె మిగుల్చుకున్నదేమున్నదిలే..!!
తప్పక,
తప్పుకు తిరగలేక
విరిగిన వెన్నుపాముకు
ఊతకర్ర అవుతూ
జారిన పేగుల్లో ,
ముడత పడ్డ దేహంతో
ఆ'కలి' కి ఆఖరి ముద్దవుతూ
నలిగిన నవ్వుని,
నిర్జీవపు చూపుని,
కన్నీటి చెలమని,
మాట పెగలని గొంతునే కదా.!
నీ ప్రేమగా,గొప్ప చరిత్రగా
చెప్పుకుంటుందీ లోకానికి.