ప్రవసినీ మహకుద్ ఒరియా కవిత: అమ్మాయి - సీతాకొక చిలుక

By telugu team  |  First Published Apr 15, 2021, 4:00 PM IST

ఇరుగు పొరుగు శీర్షిక కింద ప్రముఖ కవి వారాల ఆనంద్ ప్రవసినీ మహాకుద్ ఒరియా కవితను తెలుగులో అందించారు. ఆ కవితను ఇక్కడ చదవండి.


నీ పిడికిట్లో ఏమి దాచావు 
అత్యంత ఆసక్తితో అడిగింది 
ఓ తల్లి తన కూతుర్ని

ఆ అమ్మాయి కళ్ళూ పెదాలూ 
దేహం ముఖం 
ఆమె కొంటె నవ్వును దాచలేక పోయాయి

Latest Videos

నా పిడికిట్లో నీలం తెలుపు 
సీతాకొక చిలుకను దాచాను 
చూడు అంటూ పిడికిలి తెరిచింది 
కానీ సీతాకొక చిలుక లేదు
ఉండాలమ్మా 
నేనే తోటలోంచి తెచ్చాను

తల్లి తన హృదయపు లోతుల్లోంచి 
గాఢమయిన నిట్టూర్పు విడిచింది

పాత కథే 
అర్థంలేని నష్టం ఓటమి లొంగుబాటు
ఫలితంగా అలవికాని దుఖం

నేనుకూడా చూశాను తల్లీ కలల్లో 
నీలం తెలుపు రెక్కల నడుమ 
అమాయక పడుచుదనాన్ని 
ఫెలుసయిన యవ్వనాన్ని 

కానీ వాటిని ఆశించేందుకు 
నాకు ధైర్యం లేక పోయింది
'అది నిన్నూ నాలాగే 
శూన్య నేత్రాల్ని మిగిల్చి 
ఎడారిగా చేసి ఎగిరిపోకుండా 
నీ వేళ్ళను బంధించు '
అంది తల్లి కూతురితో

ఆశ్చర్యాద్భుతాలు నిండిన చూపులతో 
కూతురు తల్లినే చూస్తూ వుండిపోయింది.

ఒరియా మూలం: ప్రవసినీ మహకుద్ 
ఇంగ్లీష్: ఏం. విజయలక్ష్మి 
తెలుగు : వారాల ఆనంద్ 

click me!