ఇరుగు పొరుగు కింద ప్రముఖ తెలుగు కవి వారాల ఆనంద్ అటల్ బిహారీ వాజ్ పేయి హిందీ కవితను రెండు అనుభవాలు పేరు మీద అందించారు. ఆ కవితను చదవండి.
మొదటి అనుభూతి
లోతయిన మరకలు, బహిర్గతమవుతున్న ముఖాలు
ఇంద్రజాలం ముక్కలై, ఇవాళ నిజంగా
భయమవుతున్నది
ఇప్పుడు పాట పాడలేను
పగిలి వెదజల్లబడ్డ గాజు ముక్కల్లాంటి నగరం పై దృష్టి పడింది
నా వాళ్ళ జాతరలో నేను కలువలేకున్నాను
ఇప్పుడు పాట పాడ లేను
కడుపుపై కత్తిలాంటి చంద్రుడు
రేఖ ఉచ్చు లో నిలిచిపోయాను
ముక్తి క్షణాల్లో మళ్ళీ మళ్ళీ బంధింప బడతాను
నేనిప్పుడు పాట పాడలేను
-రెండవ అనుభూతి
ఇప్పుడొక కొత్త పాట పాడతాను
పగిలిన చుక్కల్లో బసంతీ రాగం వినిపించింది
బండలాంటి ఛాతీలో కొత్త అంకురం మొలకెత్తింది
నదులన్నీ పసుపువర్ణం అద్దుకుని
కోయిల రాత్రుల్ని తలపిస్తున్నాయి
తూర్పున అరుణ వర్ణపు ఛాయలు చూడగలుగుతున్నాను
ఇప్పుడు కొత్త పాట పాడతాను
పగిలిన స్వప్నాల విషాదాన్ని ఎవరు వింటారు
లోపలి పగుళ్ళ దుఃఖం కనుపాపల్లో ద్యోతకమవుతున్నది
ఓటమిని అంగీకరించను పోరు దారిని విడువను
కాలం యొక్క కపాలం పై లిఖిస్తూ తుడిచేస్తూ
వుంటాను
ఇప్పుడు సరికొత్త పాటను పాడుతూనే వుంటాను
హిందీ : అటల్ బిహారీ వాజపేయీ
తెలుగు: వారాల ఆనంద్