రవీంద్ర సూరి నామాల తెలుగు కవిత: నడిపోడు

By telugu teamFirst Published Nov 4, 2020, 2:35 PM IST
Highlights

రవీంద్ర సూరి నామాల నడిపోడు అనే దీర్ఘ కావ్యానికి శ్రీకారం చుట్టారు. ఆ దీర్ఘ కావ్యంలో ఓ ఖండికను ఏషియానెట్ న్యూస్ పాఠకులకు అందిస్తున్నాం.

అతడు నదై
మనలోకి ప్రవహిస్తూంటాడు
మనిషిలోని మాలిన్యాన్ని
చివరికంటూ తోసుకుంటూ
దూసుకుపోతూంటాడు
ఒక్కసారి వెనక్కి చూస్తే...

తరతరాల నుండీ
తాటి చెట్టంత కష్టాలతో
కథనం చేస్తున్న సమయం
కష్టాలు, నష్టాలను
కావడి కుండలుగా మోస్తున్న నాన్న

బాధల్ని - గాధల్ని
కథల్ని    - వెతల్ని
కష్టాల సుడిగుండాల్ని
కాలం నెత్తికెత్తితే
మంచి రోజు కోసం ఎదురు చూస్తూ
కత్తుల వంతెనపై నడిచొచ్చే అమ్మ
కష్టాల కడగండ్లను
కడుపులో దాచుకుని బతకడం
బతుకంతా చుట్టకుదురు లా ఇలా....
ఎన్నాళ్లు ....ఇంకెన్నాళ్లు అంటే
దేహం నిండా నిండిపోయిన దుఃఖం
సంతోషాన్ని సూరెక్కించింది
దాన్ని వచ్చే తరానికి
అందించే దాకా అంటుంది అమ్మ

తల్లిదండ్రుల దుఃఖం
ప్రతి కొడుకుని యోధున్ని చేస్తుంది
యోధుడు వచ్చే సమయం
ఆకాశాన్ని చీల్చుకుంటూ ఇంట్లోకి
సూరీడు  పొద్దై పొడుచుకొచ్చాడు
మధ్య తరగతి కుటుంబాల్లో
కష్టాలు కన్నీళ్లు కవలపిల్లలై
నిత్యం మనుషులతో సావాసం చేస్తుంటాయి
బాధలకు , బంధాలకు
వంతెనలు పుట్టుకొస్తాయి
విశాలమైన వంతెనపై
కడకు కడకు తిరుగుతూ
కడక్ గా ఉంటారే తప్ప
ఒక్కరూ అడుగులు  ముందుకెయ్యరే
నడిపోడే వంతెన అవుతాడు
అందరి వంతూ తనపై వేసుకుంటాడు
అప్పుడు
ఇక్కట్లు పక్కకు తప్పకుంటాయి
చీకట్లు తొలగి పోతాయి

అతడి ముందు
ఉపాధ్యాయుడు సైతం
విద్యార్థి అవ్వక తప్పదు

తను నడవడం చూసి
నేను నడవడం నేర్చుకున్నాను
నన్ను నిలబెట్టడానికి
తను కింద పడిన రోజులు
నాకు ఇంకా గుర్తే
మాటంటే నోటి నుండి కాదు
హృదయం నుండి రావాలనేది
తను నేర్పిన పాఠమే
అప్పుడప్పుడూ
నేను పోగొట్టుకున్న జీవితాన్ని
పిడికిట్లో పట్టేసి చూపిస్తుంటాడు
ఎప్పుడూ
నేను కనే కలే తనై ఉంటాడు
భవిష్యత్ దృశ్యానికి భరోసా తను

ఆకాశం గూడై
ప్రపంచాన్ని ఆనందంలో
తడిపేస్తూంటుంది
ప్రతి ఒక్కరూ
ఆకాశాన్ని ఇంటిని చేసుకోవాలనే
చిన్న చిన్న కలలు కనడం సహజం
కలలు చిన్నవే
'తీరటం' అనే విషయం చిన్నది కాదు
అక్షరాలు దిద్దించిన ఆ చేయి
అమ్మలా దీవించే ఆ చేయి
దిద్దిస్తూ,దీవిస్తూ ఉండడం
అందరికీ చేతనవదు
కన్న కలలన్నీ వర్షించని
ఆ మేఘాల ఘర్జనలకే
కరిగిపోతూంటే,
సముద్రంలో అల విరిగిపోయినట్టే
జీవితంలో కల విరిగిపోతూంటుంది
విరిగిన కలలు సైతం నిర్మిస్తుంటాడు
తను *సివిల్ ఇంజనీర్*
భవనాలే కాదు
మనిషిలోని బాధలను తొలగించి
ఆకాశాన్నంటే ఆనందాన్ని నిర్మించగలడు

పెళ్లంటే
ఏ ఇంట్లో అయినా
ఆనందాలు గంతులేస్తుంటాయి
ఇక ఆడపిల్ల పెళ్లంటే
అప్పు చేయాలి
ఆస్తులు అమ్మాలి
అన్నదమ్ములుంటే  వాటాలేసుకోవాలి
అవేవి జరక్కుండా
బాజా భజంత్రీలు మోగాయంటే
అక్కడ ఏదో జరిగి ఉండాలి
కళ్ళలో తడి రాకుండా
పెళ్లెలా జరగడం
జరిగింది మరి..
బాధ్యత తెలిసిన వారే
బరువులు ఎత్తుకుంటారు
చెట్టుకు అంటు కట్టినట్టుగా
బంధాలకు అంటుకడుతుంటాడు తను
ఎప్పుడూ అందరితో ఉంటాడు
అందరిలో ఉంటాడు
అందరివాడతడు..
నడిపోడొక సమూహ చైతన్యం.
       
(త్వరలో రాబోయే 'నడిపోడు'దీర్ఘకావ్యం లోని ఓ ఖండిక) 

click me!