సంధ్యారాణి ఎరబాటి తెలుగు కవిత: పక్షి హృదయం

By telugu teamFirst Published Nov 2, 2020, 1:11 PM IST
Highlights

మనిషి హృదయం కన్నా  పక్షి హృదయం ఎంత  స్వచ్చమైనదో  సంధ్యారాణి ఎరబాటి మిచిగాన్,డెట్రాయిట్, అమెరికా నుండి వినిపిస్తున్నారు.  ఈ కవితలో చదవండి.

పత్ర విన్యాసాల హరితంలో
రెక్కలసత్తువను  నమ్ముకున్న  పక్షిని నేను...
అకలుషితమైన  అంతరంగంతో 
 తోటకే
ఒక అలంకారం నేను...
ఏటి వాలుల పక్క
తోట సన్నిధిలో
కొమ్మ ఊయలలూగుతూ
ఉంటాను..
మనిషి అలికిడికి  మాత్రం
ఉలిక్కిపడుతుంటాను..
.
అసమానతల పడవల్లో 
పయనిస్తూ ఉంటారు
సంపదల ఆరాటాలలో
తేలుతూ ఉంటారు..
బాధ్యత బరువులసంద్రం లో మునుగుతూ ఉంటారు
స్వార్థపు మాలిన్యాలను
సేవిస్తూ ఉంటారు
మనుషులు...

మా పక్షుల్లో అంతరువులు లేవు
వంచనలు ద్రోహాలు
వేశాలు మోసాలు
అసలే లేవు...
పేద గొప్పా తేడా లేదు
ప్రాణుల మధ్య తారతమ్యాలు లేవు...
అనుబంధాలు
రక్త సంబంధాలు
సమూహల కోలాహలాలు
ప్రమాదాల...తీరాలు లేవు

తరాలుగా ధనార్జన దాహం లేదు
ప్రజనాయకుల పీడన లేదు
అణగారిన వర్గంలేదు
అణగదొక్కే జనం లేరు
కలతలు కన్నీళ్లు లేవు
బుసలు కొట్టే పగలు లేవు

ఆడంబరాలకి అట్టహాసాలకి దూరంగా
గుంపులో  ఎగిరినా
గుండె మారని పక్షిని నేను
రాగవైరాగ్యాల చింతన లేని కూనని నేను
ఆకులురాలినా
 ఎదలో ఆశలు వీడని అడవిలా ఉంటాను
ఉదయ వేణువుతో
రాగమాలపిస్తాను
పవన వీవనలోపరవశిస్తాను...
ఆకాశ వీధిలో సాగిపోతుంటాను..
అల సంధ్య వేళకి
గూడు చేరుకుంటాను
నదీ కౌముది లో
తారకలు చూస్తాను
అన్నిటికీ దూరంగా
ఆవహించిన శూన్యం లో
ప్రవహించే రాగమాలిక నేను
అoబరంలో సంబ్రమoగా
సాగే స్వేచ్ఛని నేను...
స్వచ్ఛమైన పక్షిని నేను...

click me!