సిధారెడ్డి ‘అనిమేష’:ఉపద్రవం నుంచి ఉపశమనం దాకా!

By telugu team  |  First Published Nov 2, 2020, 1:33 PM IST

డాక్టర్ నందిని సిధారెడ్డి అనిమేష తెలుగు కావ్యాన్ని వి. శంకర్ సమీక్షించారు. సమస్త ప్రాణికోటిలో తానూ ఒక జీవినని, తన కోసం ప్రకృతి అని కాక ప్రకృతిలో తానూ ఒక భాగం అనే సత్యం తెలుసుకోవాలని హితవు పలుకుతాడు. ‘అనిమేష’ కావ్యం రాయడం ద్వారా డా.నందిని సిధారెడ్డి నిర్వర్తించిన కర్తవ్యం అదే. అంటున్నారు.


సమీక్షకుడు: డా.వి.శంకర్

కండ్ల ముందు మనుషులు అనూహ్యమైన మహమ్మారి బారినపడి తల్లడిల్లుతుంటే బాధ్యత గల కవి ఏం చేస్తాడు? ఆ వైపరీత్యానికి కారణాలు వెతుకుతాడు. అందుకు దారితీసిన మనిషి తప్పటడుగులను ఎత్తి చూపుతాడు. ప్రకృతికి మనిషికి ఉన్న జీవబంధాన్ని గుర్తు చేస్తాడు. స్వార్థం కోసం మనిషి చేసే ప్రకృతి విధ్వంసంతో సజీవ, నిర్జీవ పదార్థాలు పుట్టుకొచ్చి మానవ మనుగడను ప్రశ్నిస్తాయని హెచ్చరిస్తాడు. వివేకంతో ప్రవర్తించకపోతే రెప్ప వాల్చకుండా గమనిస్తున్న ప్రకృతి మానవ తప్పిదాలను సరిదిద్దుతుందని పర్యవసానం తెలుపుతాడు. సమస్త ప్రాణికోటిలో తానూ ఒక జీవినని, తన కోసం ప్రకృతి అని కాక ప్రకృతిలో తానూ ఒక భాగం అనే సత్యం తెలుసుకోవాలని హితవు పలుకుతాడు. ‘అనిమేష’ కావ్యం రాయడం ద్వారా డా.నందిని సిధారెడ్డి నిర్వర్తించిన కర్తవ్యం అదే. 

Latest Videos

ప్రపంచ మానవాళిని అతలాకుతలం చేస్తున్న మహమ్మారి కరోనా వైరస్ చైనా నుంచి ప్రపంచమంతా విస్తరించింది. ఈ శతాబ్దంలోనే అతి పెద్ద విలయం సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికి నాలుగు కోట్ల మందికి సోకి పదకొండు లక్షలకు పైగా ప్రాణాలను బలిగొన్నది. అమెరికా అధ్యక్షుని నుంచి ఆసియా ఖండంలోని అనామకుని దాకా ఎవరినీ వదలలేదు. ఈ వ్యాధి వల్ల మన దేశంలో ఇప్పటివరకు లక్షమందికి పైగా ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఇవి బయటకు చెబుతున్న లెక్కలే. అసలు లెక్కలు ఇంతకు మించి ఉంటాయి. 

మానవజాతి ఊహించని, కంటికి కనిపించని ఒక నిర్జీవ కణం కరోనా. మనిషి గొంతు, ఊపిరితిత్తులు దాని విధ్వంస కేంద్రాలు. ఒకరినొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నా, తాకినా, తుమ్మినా, దగ్గినా ఎదుటి వారి ముక్కులోకి ప్రవేశిస్తుంది. ఊపిరితిత్తుల్లోకి చొరబడి, ప్రాణాలు తీస్తుంది. ఆ సూక్ష్మకణమే మానవజాతికి సవాల్ విసిరింది. మానవ సంబంధాలను కల్లోలంలోకి నెట్టివేసింది. మనుషులు కలవడం మాట అటుంచితే, తన చేతితో తన ముక్కు తూడ్చుకోవాలన్నా భయపడే స్థితి దాపురించింది. తన దేహం తనకే అంటరానిదిగా మారింది. మానవ సమూహాల మధ్య ఇంతకు ముందున్న విశ్వాసాలు, సంప్రదాయాలు సడలిపోయేలా చేసింది. ప్రాణం నిలుపుకుంటే చాలు అనే పరిస్థితి సృష్టించి, మనిషిని సొంత ఇంట్లోనే బందీని చేసింది. జన సమూహాలతో సందడిగా కనిపించే పట్టణాలు పల్లెలు అని తేడా లేకుండా బహిరంగ ప్రదేశాలను నిర్మానుష్యం చేసింది. దేశం, ప్రాంతం ఏదైనా ఈ భూమ్మీద మానవున్ని ప్రాణభయంతో భీతావహున్ని చేసింది. వైరస్ సృష్టించిన ఈ భయానక స్థితి ఒకవైపు, దాన్ని అడ్డుకోవడానికి ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్ పరిస్థితులు, పర్యవసానాలు మరోవైపు సామాన్యుల బతుకులు చితికిపోయేలా చేశాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో డా.నందిని సిధారెడ్డి ఒక బాధ్యతగా ‘అనిమేష’ కావ్యం రచించారు. 

ప్రపంచంతో మమేకమై జీవించే ఏ కవైనా తన కాలాన్ని కవితామయం చేస్తాడు. సమకాలీన పరిస్థితుల విభిన్న పార్శ్వాలను కళాత్మకంగా నమోదు చేస్తాడు. కరోనా సృష్టించిన సంక్షోభం మీద కూడా చాలా మంది కవిత్వం రాశారు. అయితే అవన్నీ కరోనా కల్లోల పరిస్థితులను వేర్వేరు సందర్భాలుగా ఆవిష్కరించాయి. ప్రత్యేకించి కూలీలు, కార్మికుల వలస దుఃఖాన్ని ఎక్కువమంది ఆర్ద్రంగా అక్షరీకరించారు. బిల్లా మహేందర్ సంపాదకత్వంలో ఒక సంకలనం ‘వలస దుఃఖం’ పేరుతొ వెలువడింది కూడా. అయితే ఒక కావ్యంగా సమగ్ర దృశ్యమానం చేసింది మాత్రం నందిని సిధారెడ్డి ‘అనిమేష’ నే. తన కండ్ల ముందటి విచిత్ర, విషాద అనుభవాలను ఇందులో కవిత్వమయం చేశారు. వాటికి తన ప్రాపంచిక, తాత్విక అవగాహన జోడించి అరుదైన కావ్యంగా మలచినారు సిధారెడ్డి. అందరినీ ఇంటికి మాత్రమే పరిమితం చేసిన లాక్ డౌన్ కాలంలో అంటే ఏప్రిల్ 5 నుంచి మే నెల 4 వరకు అంటే నెలరోజుల వ్యవధిలో ఈ కావ్యం పూర్తిచేశారు.

‘అనిమేష’ అంటే రెప్ప వాల్చనిది. దేవతలను అనిమేషులు అంటారు. వారు కనురెప్ప వేయరని పురాణగాథలు చెబుతాయి. అమృతం తాగిన అమరులు రెప్పవేయకుండా మెలకువలో ఉంటారని వాళ్ళను ఆ పేరుతొ వ్యవహరించారు. చేపను కూడా అనిమేష అంటారని నిఘంటువు చెబుతుంది. అయితే సిధారెడ్డి అనిమేష పదాన్ని ఈ అర్థాల్లో స్వీకరించలేదు. నిత్య జాగరూకత అనే విశేషార్థంలో ప్రయోగించారు. మనిషి చర్యలను రెప్పవేయకుండా గమనించే ప్రాకృతిక, భౌతిక అంశాలు అనిమేషలై చూస్తుంటాయని ప్రతీకాత్మకంగా వర్ణించారు. ప్రకృతి, మానవుల సంఘర్షణ, సమన్వయం, కాలం స్వభావం మొదలైన విషయాలను లోచూపుతో, తడి చూపుతో ఒక మాలికగా ‘అనిమేష’ అల్లినారు.

అనిమేషను సిధారెడ్డి ‘ఉపద్రవ గాథా కావ్యం’ అన్నారు. కరోనా తెచ్చిన సంక్షోభం మానవజాతికి ఉపద్రవం అన్నారాయన. ఇందులో 19 గాథలున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవిడ్- 19 గా పేరిడిన ఈ వైరస్ సృష్టించిన ఉపద్రవాన్ని 19 విభాగాలుగా రచించారు. కరోనా వల్ల కలిగిన సంక్షోభం, దాని పర్యవసానాలు, దేశ విదేశాల పరిస్థితులు వీటిలో చిత్రించబడ్డాయి. మనిషి అనాలోచిత అభివృద్ధి నమూనా, సహజవనరుల విచక్షణారహిత వినియోగం, అభివృద్ధి చెందిన దేశాల మధ్య ఆయుధపోటీ, ప్రపంచీకరణ, దాని పర్యవసానాలు, ఫక్తు వ్యాపారం తప్ప అన్ని విలువలను తుంగలో తొక్కిన మార్కెట్ ప్రపంచం, మనిషిని కూడా సరుకుగా మార్చిన పెట్టుబడి స్వరూపం వంటి ఎన్నో అంశాలను స్పృశించారు. వైవిధ్యమైన విషయాలు ప్రస్తావించినా కావ్యంలో వస్తువు ఏకసూత్రత పాటించారు. ‘అనిమేష’లో అన్నీ గాథలు అకుంటిత కవితాధారతో ప్రవహించాయి. 

ఈ గాథల్లో మొదటిదైన ‘అపరిచిత గాథ’లో కవి ప్రపంచానికి కొత్త అనుభవంగా కరోనా వైరస్ ఉత్పన్నతను వర్ణించారు. చైనాలోని వూహాన్ లో దాని పుట్టుక, వూహాన్ నగర అందాలు, గ్లోబలైజేషన్ తో ప్రపంచం ఒక కుగ్రామంగా మారి, పెరిగిన టూరిజంతో వైరస్ కూడా విస్తరించడం ‘వూహాన్ గాథ’లో తెలిపారు. అలాగే ‘విపద్గాథ’లో లాక్ డౌన్ వల్ల తలెత్తిన పరిస్థితులు, ‘ఉగ్రగాథ’లో వైరస్ పేరుతొ రాజకీయాలు, ‘విస్మయగాథ’లో నమ్ముకున్న దేవుళ్ళందరూ తలుపులు మూసుకొని మనిషిని వదిలేసిన స్థితిని కండ్లకు కట్టినారు. లాక్ డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన కూలీల దైన్యతను ‘వలసగాథ’లో ఆర్ద్రంగా చిత్రించారు. ‘వియోగ గాథ’లో మనుషుల మధ్య పెరిగిన దూరం, ‘ఊరిగాథ’లో పల్లెలే కష్టజీవులకు కన్నతల్లులైన వైనం, వైరస్ కు మతం రంగు పులిమిన కుత్సితబుద్ధుల కుటిల రాజకీయాలను  ‘ద్వేషగాథ’లో ఎండగట్టారు. తత్వ, విరాగ గాథల్లో జీవిత పరమార్థం, వైరాగ్య భావన ఆవశ్యకత తెలియజెప్పారు. సత్య, ప్రాణ, వికృత, దుఃఖ, త్యాగ గాథల్లో కల్లోల కన్నీటి దృశ్యాలను మానవీయ కోణంలో చిత్రించారు. మనిషి ఉనికితోనే ప్రకృతి సౌందర్యం ఇనుమడిస్తుందని ‘సోయగ గాథ’లో, అంతిమంగా మనిషే ప్రకృతికి, సమస్త జీవరాశి మనుగడకు బాధ్యత వహిస్తాడనే ఆశావాదం ‘సఫలగాథ’లో ప్రకటించారు సిధారెడ్డి. ఇట్లా పందొమ్మిది ఘట్టాలుగా కరోనా సందర్భాన్ని అసమాన కావ్యంగా తీర్చిదిద్దారు. 

ఇంతవరకే అయితే అది సందర్భ చిత్రణే అవుతుంది. అనిమేషలో తెలుసుకోవలసింది అంతకు మించి ఉంది. సిధారెడ్డిది మూసమార్గం కాదు. ఇందులోని ప్రతిగాథలో తనదైన ముద్ర కనబరచారు. ప్రతిచోట వస్తువులో తాత్వికత మేళవించారు. అభ్యుదయం కాంక్షించారు. భావనాబలం సమకూర్చారు. ఎక్కడా మానవీయ స్పర్శ మరువలేదు. జాతీయ అంతర్జాతీయ అవగాహన జోడించారు. శాస్త్రవిజ్ఞానంతో సమన్వయ పరిచారు. రూప రీత్యా క్లుప్తత పాటించారు. అల్పాక్షరాలలో అనల్పార్థం సాధించి అనిమేషను విశిష్ట శిల్ప సౌందర్యంతో అలరారేలా తీర్చిదిద్దారు. మనిషి ప్రగతిశీల దృక్పథం ఆలంబనగా తెలుగు సాహిత్యానికి అద్భుతమైన కావ్యాన్ని అందించారు సిధారెడ్డి.

‘అపరిచిత గాథ’లో కరోనా విస్తరణ ప్రారంభమైన తర్వాత ఉత్పన్నమైన పరిస్థితులను పరిచయం చేస్తూ ‘ఇల్లు భద్రమే/ గోళ్ళాలు భద్రమే/ ఇంట్లో హృదయాలు చిద్రం/ మనుషులే చిద్ర చిద్రం’ అని చిత్రిక పట్టారు. కరోనా వల్ల ప్రపంచవ్యాప్తంగా స్తంభించిన జనజీవనం, వ్యాపారమే ప్రధానంగా భావించే అభివృద్ధి చెందిన దేశాధినేతల విపరీత బుద్ధుల నేపథ్యంలో ‘ప్రపంచీకరణ యుద్ధానికి/ అణుబాంబులు అక్కర్లేదు/ వైరస్ చాలు’ అని యథార్థ దృశ్యాన్ని వివరించారు. ఆ విషమ స్థితిని మనిషి బతుకుతో అన్వయం చేయడంలో సిధారెడ్డి ప్రతిభ తెలుస్తుంది.
    ‘ఒక పక్క విప్పబోతుంటే 
    మరొక దగ్గర తప్పి పడుతున్న 
    చిక్కుముడి కదా మనిషి
    చిక్కు చిక్కుల ముడి మనిషి జీవితం’ అని మానవ జీవన సారం ఒడిసిపడుతారు. చైనా శాస్త్రజ్ఞులు, వైద్యులు హెచ్చరించినా అక్కడి పాలకులు వినలేదు. వారి అహంకారం ప్రజల ప్రాణాలకు విలువనివ్వలేదు. చైనాకు పదిరోజుల్లో పెద్ద ఆసుపత్రి నిర్మించిన చరిత్రనే కాదు ప్రపంచానికి వైరస్ పంచిన అపకీర్తి కూడా మూటగట్టుకున్నది అంటారు కవి. వూహాన్ లో పుట్టిన వైరస్ ప్రపంచానికి ఎట్లా పాకింది? ఎందుకంటే ప్రపంచీకరణ ‘విపణులతో పాటు/ విపత్తులు దిగుమతి’ చేస్తుంది. దేశం ఏదైనా వాటికి రెండే ప్రధాన ఆశయాలు ఉంటున్నాయి. ‘అయితే సంపాదన/ తప్పితే ఆస్వాదన’ అని రెండుమాటల్లో దేశదేశాల లక్ష్యాలు తెలిపారు. విషయాన్నిపక్కదారి పట్టించడంలో అన్ని దేశాల నాయకులకు అలవాటైన విద్యనే. తమ తప్పిదాలను, వైఫల్యాలను ఇతరాల మీదికి తోసివేయడం కొత్త కాదు. వారికి కరోనా కూడా ఒక సాధనమే. ‘అధికారానికి అహంకారం చివరి అస్త్రం/ వ్యూహం మారినప్పుడల్లా ఉగ్రరూపం’ సంతరించుకుంటుంది అంటారు. 

ఏ దేశ పాలకులైనా వారు పెట్టుబడిదారుల తొత్తులే. పెట్టుబడి లక్ష్యాలకు అనుగుణంగా దేశాల విధానాలు రూపొందిస్తారు. ఈ విషయం చెబుతూ సిధారెడ్డి కరోనా శరీరంలో బతికినట్లు దేశాల సార్వభౌమత్వం పెట్టుబడిలోనే బతుకుతుంది అంటారు. వారికి పెట్టుబడే సర్వస్వం కనుక వారి ‘ముళ్లన్నీ ఆర్ధిక ముళ్ళే’ అని ధ్వని గర్భితంగా చెబుతారు.

కరోనాను అదుపుచేయడానికి విధించిన లాక్ డౌన్ తో ప్రపంచ మతాల ఆలయాలన్నీ మూతబడ్డాయి. మూకుమ్మడి ప్రార్థనలు ఆగిపోయాయి. కొందరి స్వార్థం కోసం చేసే జనసమీకరణలు ఆగిపోయాయి. మనుషుల కష్టాలు తొలగిస్తారనుకున్న దేవుళ్లు మౌనముద్ర దాల్చారు. మతం మౌనం వహించిన చోట శాస్త్రవిజ్ఞానం మాత్రం మనిషిని బతికించుకోవడానికి నిరంతరం పనిచేయడం ప్రారంభించింది.
    ‘గుడి అయినా
    చర్చి అయినా
    మసీదు అయినా
    మఠమైనా 
    ఆరామమైనా
    వైరస్ కు వ్యత్యాసం లేనే లేదు’ అని మనుషుల మధ్య లేని సమానత్వాన్ని వైరస్ పాటించిందని గుర్తుచేస్తారు.

కష్టజీవులపై సిధారెడ్డికి ఉన్న ప్రేమ పన్నెండు పేజీల్లో రాసిన ‘వలస గాథ’ తెలుపుతుంది. నిజానికి వైరస్ వల్ల ఎక్కువ నష్టపోయింది వాళ్ళే. కార్మికులు, కూలీల జీవితాలను చిన్నాభిన్నం చేసింది కరోనా. పొట్టకూటికోసం పట్నాలకు వలస వచ్చిన వాళ్ళ పట్ల పాలకులు కనికరం చూపలేదు. విదేశాల్లో చదువుకునే ఉన్నతవర్గాల పిల్లల కోసం ప్రత్యేకంగా విమానాలు నడిపిన ప్రభుత్వం ఈ బడుగుజీవులు సొంతూర్లు చేరుకోవడానికి రవాణావసతులు కల్పించలేదు. బస్సులు, రైళ్ళు బందు కాగా కూలీలు తమ సొంతూళ్ళకు చేరడానికి వేలాది కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించారు. పైగా లాక్ డౌన్ నిబంధనల పేరుతొ నిర్భంధం. చంకలో పిల్ల, చిటికెన వేలు పట్టుకుని నడిచే పిల్లగాడు, నెత్తిన మూటా ముల్లెలతో రహదారులు రక్తసిక్తం కాగా ఆ కూలీలు నడక సాగించారు. ఆకలికి కొందరు, అనారోగ్యంతో కొందరు మధ్యలోనే మరణించారు. దేశవిభజన తర్వాత లక్షలాదిమంది వలసలు సాగించడం దేశచరిత్రలో ఇదే మొదటిసారి. ఈ వలస దుఃఖాన్ని సిధారెడ్డి అత్యంత మానవీయంగా చిత్రించారు. ‘కాలమేదయినా/ పాలనేదయినా/ ఆకలి వలస శోకానికి నివృత్తి లేదు’ అన్న అవగాహన ఆయనది. వలసలు లేని చరిత్ర లేదనే చారిత్రిక సత్యాన్ని చెబుతూనే ఆకలి వలసలకు దారి తీస్తుంది అంటారు. 
 
అయితే వలసలు రెండురకాలు. ఆకలి వలసలు వేరే. ఆధిపత్య వలసలు వేరే. ఈ రెండింటి స్వభావాలు కూడా వేరే. ‘వలస ఆధిపత్య పింఛం ధరించి/ చక్రం తింపినప్పుడే సమస్య’ అని తెలంగాణ పరాయి వలసాధిపత్యం కింద నలిగిన విషయం ధ్వనించేలా చెబుతారు. కనుక వలసలన్నీ ఒకటి కాదు అంటారు సిధారెడ్డి. కరోనా వలసలు మాత్రం కన్నీటి వలసలె అని సూత్రీకరిస్తారు ఆయన.
    ‘రియలెస్టేట్లు దులుపుకున్న కార్మికులు
          ఇండస్ట్రీలు వదులుకున్న వర్కర్లు
    హాస్టళ్ళు గెంటేసిన విద్యార్థులు’ ఆ వలసల్లో దిక్కు తోచనిస్థితిలోకి నేట్టివేయబడ్డారు. 

ఇక కూలీల పరిస్థితి మరింత దయనీయం. జన్మనిచ్చిన పల్లెలోనైనా ప్రాణం నిలుపుకోవచ్చు అని సొంతూరి బాట పట్టారు వారు. కానీ  వెళ్ళడమెలా? ప్రజా రవాణా ఆగిపోయింది. మధ్యలో ఆగితే తినడానికి హోటల్లు లేవు.
‘వాహనాల్లేవు
వాళ్ళకున్నది కాళ్ళే
ఏవి నడువకపోయినా నడువాల్సింది కాళ్ళే
కాళ్ళు నడువకపోతే
కడుపు నడువదు’ ఇదీ వలస దుఖం. వాళ్ళ నడక చూసి రోడ్లు నివ్వెరపోతాయి అంటారు. కూలీల కాళ్ళు/ వలసల సెలయేళ్ళు’ అవుతున్నాయి. తిండికి లేక, చేతిలో డబ్బులు లేక, తల్లడిల్లే జీవితాలను చాలా హృద్యంగా చిత్రించారు.
తను కొట్టుకోవాలె
ఏడ్చే పిల్లల్ని కొట్టాలె
మీద పడి ఏడ్వాలె
గీసినవాడు దొరుకడు
రాసినవాడు రాడు
ఒడువని వలపోత
వలసకూలి రాత’

ఈ దుఖం ఎవరు పట్టించుకుంటారు. భాగ్యనగరం నుంచి బస్తర్ దాకా, బీహార్, జార్ఖండ్, ఉత్తర ప్రదేశ్ మారుమూలల దాకా నడిచే అభాగ్యులనెవరు ఊరడిస్తారు? ముసలి తల్లిని ఎత్తుకొని సాగే యువకుడు ఎంతదూరం నడుస్తాడు? మధ్యలో ప్రాణాలు వదిలే దీనులు ఈ దేశవాసులు కాదా? అని దుఃఖ దృశ్యాలను వర్ణిస్తూ దుఃఖమే దృశ్యమైన సందర్భాన్ని గుండెలు కత్తిరించే పదాలతో నిలుపుతారు వలస గాథలో. కూలీల మీది నుంచి దూసుకెళ్లిన గూడ్సు కింద చితికిపోయిన ప్రాణాల ఆర్తనాదాలు వినిపిస్తారు. కష్టజీవులకే ఆపదలు సంభవించిన ఘటనలు గుర్తుచేస్తూ వెంటాడిన వాళ్ళనే దురదృష్టం వెంటాడుతుంది అంటారు.

కరోనా పేరుతొ మతరాజకీయాలు చేసేవాళ్ళను, మూఢ నమ్మకాలతో అజ్ఞానం ప్రచారం చేసే కురుచ బుద్ధుల పట్ల జాగ్రత్తగా ఉండాలంటారు కవి. ఇవాళ మనిషి మనిషిగా లేడు. రకరకాల వ్యామోహాలు, పచ్చి స్వార్థం తప్ప మరో విలువ లేని జీవిగా మారిపోయాడు. అనేక రకాల వైరస్ లు అతని బుద్ధిని కమ్ముకున్నాయి. వీటికి తోడూ కరోనా దాడి చేసింది.
‘మతం ఒక వైరస్
ఎప్పుడో మెదడును కమ్మేసింది
రాజకీయం మరో వైరస్
రక్త నాళాల్లో చేరిపోయింది
వ్యాపారం వావి లేని జీవి
మనస్సును మత్పరించింది
ఇవ్వాళ మనిషి ఎక్కడ దొరుకుతాడు
వొట్టి శరీరం తప్ప!’ 

తరతరాలుగా మనిషికి ప్రకృతికి ఘర్షణ జరుగుతుంది. ప్రకృతి సర్వం తన కోసమే అనే స్వార్థంతో ప్రవర్తిస్తాడు మనిషి. అతడి ధ్వంసరచన హద్దు మీరినప్పుడు ప్రకృతి ప్రకోపిస్తుంది. ఏదో ఒక విపత్తు రూపంలో సర్దుబాటు చేసుకుంటుంది. ఆ విపత్తు భూకంపం కావచ్చు. సునామీ కావచ్చు. అనావృష్టి, తుఫానులు, వరదలూ కావచ్చు. కంటికి కనిపించని సూక్ష్మ క్రిములు మహా విలయం సృష్టించవచ్చు. మనిషి నాగరికత పేరుతో విర్రవీగుతాడు. ప్రకృతి తన సహజ ప్రవృత్తితో సరిదిద్దుకుంటుంది. మనిషి ప్రకృతితో ఘర్షణ పడటం, ప్రకృతి ప్రతీకారం తీర్చుకోవడం, మళ్ళీ సమన్వయం కుదరటం యుగాలుగా జరుగుతున్న ఈ పరిణామాలే. వీటిని సిధారెడ్డి ఎంతో ప్రతిభావంతంగా చిత్రించారు. 
‘కిరీటం అందినప్పుడల్లా 
నేల నుంచి జానెడెత్తు నడుస్తాడు
కొత్తగా పెరిగిన కొమ్ములతో 
వన్నె తిరిగిన కోర మీసాలతో
చుట్టూ చులకన చూస్తాడు
సహజమైనది ప్రకృతి
కృతకమైనది వికృతి’ అంటారు. అహంకారంతో మనిషికి మొలిచిన కొమ్ములను ప్రకృతి ఆకురాయి పట్టుకొని సరిచేస్తుంది అంటారు. కనుక ‘మనిషి విజృంభించేది ప్రకృతి మీదే/ ప్రకృతి విజృంభించేది మనిషి మీదే’ అంటారు. ఈ సంఘర్షణల ఫలితంగానే పరస్పర హననం జరిగింది. చరిత్ర రూపుదిద్దుకున్నది. అవి కాలం సాక్షిగా జరిగిన పరిణామాలు. మరి అంతిమ విజయమంటూ ఉందా? ఇక్కడ గెలుపోటములకు అతీతమైన సందేశం సిధారెడ్డి అద్భుతంగా అందించారు.
‘ఓడిపోయాడా గెలిచాడా కాదు
ఒదిగి ఉండటమే గుణపాఠం’ ఈ సందేశంలో శాస్త్రీయత ఉంది. తాత్వికత ఉంది. నీతి ఉంది. గుణపాఠం నేర్చుకుని ప్రకృతి ధర్మాలకు అనుగుణంగా నడుచుకున్నంత వరకు మనిషి మనుగడకు ధోకా ఉండదు. ఈ భూమ్మీద మనిషి ఉనికికి సంబంధించి ఒక సత్యమూ, హెచ్చరిక ఇందులో అంతర్లీనమై ఉంది. అది మనం గమనించాలి. ఈ సందర్భంలో కొన్ని చారిత్రిక సత్యాలను కూడా కవితాత్మకంగా ఆవిష్కరించారు. మానవ పరిణామ శాస్త్రం పట్ల ఎంతో అవగాహన ఉంటె తప్ప ఈ పంక్తులు రాయలేరు.
‘అడవిని మొక్కింది ఆదిమం
అడవిని వేటాడింది రాచరికం
అడవిని నరికింది నాగరికం
అమాంతం అడవిని బద్దలు కొడుతున్నది ప్రపంచీకరణ’ 

మార్కెట్ మాయలో పడ్డ మనిషి వ్యాపారం కోసం సర్వం ధ్వంసం చేస్తున్నాడు. విచక్షణ కోల్పోయిన సాంకేతికతతో పర్యావరణ సమతుల్యతను దెబ్బతీస్తున్నాడు. అందుకు ఫలితాలు కూడా అనుభవిస్తున్నాడు. మానవ విలువలు మంటగలిపి అన్నీ అమ్ముకోవడమే పనిగా పరుగులు పెడుతున్నాడు. మనిషి స్వైరవిహారం చూసిన ప్రకృతి నివ్వెర పోతున్నది. టవర్ల రేడియేషన్ తో పక్షిజాతులు అంతరిస్తున్నాయి. పురుగుమందులతో భూమి నిస్సారమవుతున్నది. తన దుశ్చర్యలతో అన్ని ప్రాణులకూ హాని కలిగిస్తున్నాడు మనిషి. తన బతుక్కి మూలమైన భూ, జల, వాయువులను కలుషితం చేస్తూ కరన్సీ కట్టలతోనే జీవనం అనుకుంటున్నాడు. అందుకే కవి ‘ప్రాణానికే వైద్యం/ మానవత్వానికేది వైద్యం’ అని ప్రశ్నిస్తున్నారు. కనుక మనిషి ముఖం కోల్పోయిన ఆధునికాంతర మానవుణ్ణి ఇప్పుడు కరోనా వైరస్ చౌరస్తాలో నిలబెట్టింది. పధ్ధతి మార్చుకొమ్మని హెచ్చరిస్తున్నది అంటారు సిధారెడ్డి. 

మరి పరిష్కారం ఏది? కాలం మాత్రమె వీటికి పరిష్కారం చూపుతుందంటారు. క్రీస్తుకు పూర్వం, క్రీస్తు తర్వాత అని కాల విభజన చేసినట్లు ఇప్పుడు కరోనాకు ముందు, కరోనా తర్వాత అని చెప్పుకోవాలి. ఇప్పుడు మనిషి తనను తానూ బేరీజు వేసుకుని, సమీక్షించుకోవాల్సిన తరుణం వచ్చిందని గుర్తు చేస్తారు. అలాగే కరోనా కల్పించిన పరిస్థితుల నేపథ్యంలో జీవిత సారాన్ని సరికొత్తగా అర్థం చేసుకోవాలని సూచిస్తారు. అయితే ‘ప్రపంచం పాము పడగ/ జీవితం నీటి బుడగ’ అనే భావన ప్రచారం చేసే వాళ్ళు కూడా ఉంటారు. దాదాపు అన్ని మతాలలో ఇలాంటి వైరాగ్య ప్రబోధం ఉంది. అవన్నీ పాక్షిక సత్యాలే అంటారు సిధారెడ్డి. సర్వసంగ పరిత్యాగులైన బైరాగులకూ కరోనా బాధలు తప్పలేదు. మబ్బు తునకలే ఆకాశం కానట్లు, భయమొక్కటే జీవితం కానట్లు, విరాగజ్ఞానమే విజ్ఞానం కాదన్న ఎరుక అవసరం అంటారు. పుట్టడం, గిట్టడం, వెలుగడం, ఆరిపోవడం అత్యంత సహజమైన దృగ్విషయాలుగా గుర్తుంచుకోవాలంటారు. మరి ఏది సత్యం అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది కదా. దానికి సమాధానం తనదైన శైలిలో శక్తివంతంగా చెప్పారు.
‘సగం సగం సత్యాల నడుమ
సందర్భం సత్యం
సమస్య సత్యం 
సంఘర్షణ నిత్య సత్యం’ ఇదీ మనం గుర్తించవలసిన విషయం.

మనం ఈ భూమ్మీద కొంతకాలం ఉండటానికే జన్మిస్తాము. ఎంతటివారికైనా చివరి మజిలీ ఆరడుగుల స్థలమే. ఆ ఎరుకతోనే కాళోజీ ‘అతిథి వోలె ఉండి ఉండి అవని విడిచి వెళ్ళుతాను’ అన్నారు. కొందరు తాత్వికులు భూమిని కిరాయి గృహము అన్నారు. మన పాత్ర ఏదైనా, ఎంత కాలమైనా అది నిర్మాణాత్మకంగా ఉండాలన్నదే సిధారెడ్డి ఆకాంక్ష. ఎగబడి సంపాదించినా, ఎంతమందిని ముంచినా ఏదీ నీ వెంట రాదనీ కరోనా వైరస్ మరోసారి నిరూపించందని చెబుతారు. ‘అనిమేష’లోని విరాగ గాథలో ఉపనిషత్తులలో ప్రవచించిన వైరాగ్య ప్రవృత్తి హిందీలోనూ, తెలుగులోనూ ఆవిష్కరించబడింది.
‘జిందగీ ఏక్ కిరాయ కా ఘర్ హై/ ఏక్ నా ఏక్ దిన్ బదల్ నా పడేగా 
మౌత్ జబ్ తుజ్ కో ఆవాజ్ దేగీ/ ఘర్ సే బాహర్ నికల్ నా పడేగా’

ఈ తత్త్వం ఆపత్కాలాల్లో కొంత ఉపశమనం కలిగించినా జీవితంలో ప్రేమ, మోహం లేకుండా మనిషి తన బతుకును కొనసాగించలేడు. ఈ రెండింటిని సమన్వయం చేసుకోగలిగినవాడు సంతోషకర జీవనం గడుపుతాడు. 

ఇదే గాథలో మృత్యువుకు, బ్రహ్మకు జరిగిన సంభాషణలో రాసిన పంక్తులు ఆకట్టుకుంటాయి. సృష్టికర్త జీవులను చంపే పని మృత్యువుకు అప్పగించినప్పుడు జరిగిన భాషణమది. మనుషుల పాపాల చిట్టా ప్రకారం వారి ప్రాణాలు తీయడం తన విధిగా అంగీకరిస్తుంది మృత్యువు. మృత్యుదేవత భావన గ్రీకు, భారత సంస్కృతులదా అని కాదు. ‘జీవితం తిరిగిరాని అనుభవం/ ప్రయాణం చెరపలేని జ్ఞాపకం’గా మిగిలేలా నడచుకోవాలన్నది కవి అభిభాషణ.

‘అనిమేష’లో కొన్ని ప్రత్యేక సందర్భాలను హృదయాన్ని కదిలించేలా ప్రస్తావించారు. లాక్ డౌన్ వేళ ఆదివాసి, గిరిజనులు, పేదల కష్టాలు, నగరాల నిర్మానుష్యం దుఃఖ గాథను మిగిల్చింది. చంటిపిల్లకు పాలివ్వడానికి ఒక తల్లి గడ్డి తినడం, ఆకలికి రైల్వే స్టేషన్ లో పసిపాప కనుమూయడం వంటి విషాద ఘట్టాలు కవిని వివశున్ని చేశాయి. కరోనాతో వృద్ధులు మరణించినా అలసత్వం వహించే పాలకుల మీద కన్నెర్ర చేసారు కవి. మార్కెట్ బుద్ధులు, మనిషి బుద్ధి కోల్పోవడాన్ని తప్పు పట్టారు. 

‘అనిమేష’లోని చివరి రెండు గాథల్లో తాత్వికత మరింత పరిమళించింది. ఆ తాత్వికతను కావ్య కళావిలువలతో పొదగడంలో మరింత నేర్పు ప్రదర్శించారు. ‘సోయగ గాథ’లో మనిషి ఉనికి లేని ప్రకృతికి శోభ లేదు అంటారు సిధారెడ్డి. 
‘భావుకులెందరో
ఊహల్లో ఊగి ఊగి 
తన్మయులై
విస్మయులై
పదాలు పదాలు పాడకపోతే
లోకానికీ సోయగ చాయలెక్కడివి’ అంటారు. ప్రకృతి అందాలను తాత్వీకరించకపోతే, నిర్వచించకపోతే ఇంతటి కమ్మదనం ప్రకృతిలో ఉన్నట్లు ఎట్లా తెలుస్తుంది? దానిలోని మధురిమను కళాత్మకంగా వ్యక్తీకరించకపోతే ప్రకృతి సౌందర్యానికి అర్థమెక్కడిది? చెట్టు, పిట్ట, జింకపిల్ల, పారే సెలయేరు, కొండపై నుంచి దూకే జలపాతం వీటన్నిటి సంగీతం ఎవరు ఆస్వాదించాలి? కనుక ప్రకృతిని ఆస్వాదించి, అనుభవించి, పలవరించువాడు ఉన్నప్పుడే దాని ఉనికికి పరమార్థం అంటారు కవి. 
‘అలలమీద పరాచికాలాడి
ఎని తీర్ల హొయలు పోయినా
చప్పట్లు కొట్టే పిల్లలు లేక
పక్షులు దిగాలు పడుతాయి
మురళీగానాలు సోకక
కొమ్మలు తలలూపటానికి
మనసొప్పటం లేదు’ అంటే ప్రకృతి ఎన్ని అందాలు ఒలకబోసినా అనుభూతించుకునే జీవులు ఉంటేనే ఆ అందానికి సార్థకత. దాన్నే చక్కగా సూత్రీకరిస్తారు కవి. జీవితమంటే ఒకరికొకరు అనే అవగాహన ఉండాలని ‘ప్రకృతి ఉనికి మనిషితోనే/ మనిషి బతుకు ప్రకృతి తోనే’ అన్నది యథార్థమని కవి భావన.

ఎంతటి క్లిష్ట పరిస్తుతులు సంభవించినా మనిషి ఆశావాది. కాలం ఎంతగా గాయాల చీకట్లతో కమ్ముకున్నా మళ్ళీ అదే కాలం వాటిని మాన్పి కొత్త వెలుతురు ప్రసాదిస్తుంది. ఇప్పుడు కరోనా విలయం కూడా అంతే. ‘ప్రతి చరిత్రా పాఠమే/ ప్రతి ప్రతికూలతా పాఠమే’ అంటారు సిధారెడ్డి. అవసరమే అన్నిటినీ నేర్పిస్తుంది అని చరిత్ర నేర్పిన పాఠం. అమ్మతల్లి, కలరా, మలేరియా, రేబిస్, సార్స్, మేర్స్, మహమ్మారి ఏదైనా మనషే విజేతగా నిలిచాడు. కాలం పెట్టిన పరీక్షలను అధిగమించాడు. సంఘర్షణ పడ్డా ప్రకృతితో సమన్వయము సాధిస్తాడు మనిషి. విధ్వంసం ఎల్లకాలం కొనసాగదు. విలయానికి కూడా కాలపరిమితి ఉంటుంది. ఉపద్రవం ప్రభావం కూడా కొంతకాలమే. ముందే చెప్పినట్లు ప్రకృతి అన్నిటినీ సరిదిద్దుకుంటుంది.

కనుక ప్రకృతి అనిమేష. అది రెప్ప వాల్చదు. గాల్లో నడిచే మనిషిని నేల మీదికి దింపుతుంది. తన ఒడిలో సేదదీరితే ఓదార్పునిస్తుంది. రెచ్చిపోతే బుద్ధి చెబుతుంది. మనిషి స్థానం ఏంటో తెలియజెప్పుతుంది. ఇక ప్రయోగశాల కూడా ఒక అనిమేష. అది కాలం పెట్టిన పరీక్షలకు విరుగుడు కనుగొంటుంది. పరిష్కారాలు శోధిస్తుంది. విపత్తుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మనిషిని కాపాడుకుంటుంది. అలాగే కవి కూడా అనిమేషనే. కవి నిరంతర జాగరూకుడై ఉంటాడు. సమాజ గమనంలో మంచి చెడులను వివేచిస్తాడు. మంచిని, మానవత్వాన్ని అమృత గుళికలుగా అందిస్తాడు. మానవ మనుగడ ప్రమాదంలో పడినప్పుడు కర్తవ్యం ప్రబోధిస్తాడు. కవిత్వం మేలుకున్న వారి ప్రపంచం అని నమ్మి, ఆచరించే నందిని సిధారెడ్డి ఈ కల్లోల వాతావరణ నేపథ్యంలో అలాంటి మెలకువతోనే 'అనిమేష' రచించారు.

‘బతుకు/ బతికించు/ బతుకనివ్వు/ మూడయితేనే మనిషి’ అంటారు సిధారెడ్డి. అవి ఆచరించనినాడు వాటి పర్యవసానాలనూ ఎదుర్కోవవలసి వస్తుంది. అలాగే ‘అందం/ అనుబంధం/ ఆదర్శం/ మూడే మనిషి/ కాలదన్నే వాడు/ కాలం మూడే మనిషి’ ఈ మాటల్లో ప్రేమ ఉంది. హితవు ఉంది. హెచ్చరికా ఉంది.

అయితే అనేక విధ్వంసాలను చవిచూసిన ప్రకృతిది కూడా తల్లి మనసే. బిడ్డల తప్పుల పట్ల సహనం వహిస్తుంది. ఆగ్రహించినా అనుగ్రహిస్తుంది. ‘కను కొలకులు తుడుచుకొని/ కన్నబిడ్డ కోసం/ చేతులు చాస్తుంది ప్రకృతి' మనిషి దానిని అర్థం చేసుకోవాలి. అప్పుడే భూగోళం మీద జీవులకు మనుగడ. 
‘చరిత్ర ద్వారం 
తెరుచుకుంటుంది
పేచీ లేదు
మనిషి బతుక్కి కాలం పూచీ
సమస్త ప్రాణి
సహజీవనానికి
పూచీ పడాల్సింది మనిషి’ అని ‘అనిమేష’ను గొప్ప ఆశావాదంతో ముగిస్తారు సిధారెడ్డి.

ఆధునిక తెలుగు కవిత్వంలో ‘అనిమేష’ ఒక ఆణిముత్యం. వినూత్న వస్తువుతో విశిష్ట శిల్ప సౌందర్యంతో ఆవిష్కరించిన కావ్యకుసుమం. తెలంగాణ రాష్ట్రావతరణ అనంతర తెలుగు కవిత్వంలో ‘అనిమేష’ ఒక మైలురాయి. కరోనా సమస్య సమసిపోయినా అందులోని వస్తు, శిల్పాల వల్ల కలకాలం నిలిచి వెలుగుతుంది. 

కరోనా వైరస్ మనిషిని ఇంటికే పరిమితం చేసిన వేళ, ప్రపంచం అతలాకుతలమై, లక్షలాది ప్రాణాలు రాలిపోతున్న వేళ, మనిషి మనుగడ పట్ల బాధ్యతతో రాసిన కావ్యం అనిమేష. సినారె ‘విశ్వంభర’ తర్వాత మనిషిని కేంద్రంగా చేసుకొని కవితావిలువలతో వెలువడిన గొప్ప కావ్యమిది. సంక్షోభ వేళ కొత్త తరం కవులకు దిశానిర్దేశం చేస్తుంది ఈ కావ్యం. తెలంగాణ అస్తిత్వ సాహిత్యంలో తనదైన ముద్ర వేసిన నందిని సిధారెడ్డి మానవ సమూహం ఉమ్మడి దుఃఖంతో తల్లడిల్లుతున్నప్పుడు మానవీయ కోణంలో స్పందించి రాసిన కవిత్వమిది. జీవన విలువలు, తాత్విక పరిమళాలు సమాంతరంగా నడిచిన ఈ కావ్యంలో తరాలకు సరిపోయే కవిత్వ దర్శనాలున్నాయి. ఒకసారి చదివితే మళ్ళీ మళ్ళీ చదివించే గుణమున్న ‘అనిమేష’ తెలుగుసాహిత్యంలో గొప్ప కావ్యంగా నిలుస్తుందనటంలో సందేహం లేదు!

click me!