విహారిగా పిలవబడే జొన్నలగడ్డ సత్యనారాయణమూర్తిని రావిశాస్త్రి సాహితీ పురస్కారం వరించింది.
తెలుగు కథతో ఏడు దశాబ్దాల అనుబంధాన్ని కొనసాగిస్తూ, విహారిగా పిలవబడే జొన్నలగడ్డ సత్యనారాయణమూర్తి దాదాపు 370 పైగా సారవంతమైన కథలను తెలుగు నేలకు అందించడమే కాకుండా, 500 పద్యాలతో శ్రీ పదచిత్ర రామాయణ కావ్యాన్ని రచించి నవయుగ వాల్మీకిగా పేరొందారు. దిన, వార, మాసపత్రికలలో అనేక శీర్షికలు నిర్వహించి కథా సాహిత్యం గురించి మాత్రమే కాకుండా, సాధారణ మనిషికి అవసరమైన అన్ని విషయాలను సమగ్రంగా అందించిన నిత్య సమాజ సాహితీ సేవకుడు విహారి.
తన 19వ ఏట పద్య ఖండికల ద్వారా సాహిత్యరంగ ప్రవేశం చేసిన విహారి15 కథాసంపుటాలను, ఐదు నవలలను, 14 వ్యాస సంపుటాలను, ఎన్నో గ్రంథ సమీక్షలను, మరెన్నో సాహిత్య కదంబాలను తెలుగువారికి అందించిన సాహితీవేత్త.30-7- 2023వ తేదీన విశాఖపట్నం పౌర గ్రంధాలయ సమావేశ మందిరంలో విశాఖ రసజ్ఞ వేదిక మరియు రావిశాస్త్రి లిటరరీ ట్రస్ట్ నిర్వహించిన రావిశాస్త్రి జయంతి వేడుకలలో '2023 రావిశాస్త్రి సాహితీ పురస్కారాన్ని' విహారికి వందలాది సాహితీవేత్తల హర్షధ్వానాల మధ్య అందజేశారు. డాక్టర్ జి రఘురామారావు అధ్యక్షత వహించిన ఈ సభలో ముఖ్యఅతిథిగా డాక్టర్ డివి సూర్యారావు, ఆత్మీయ అతిథిగా జె.పి శర్మ, పురస్కార సమర్పకుడిగా రాచకొండ కుమార శాస్త్రి పాల్గొన్నారు.
పురస్కారాన్ని స్వీకరించిన విహారి మాట్లాడుతూ పేదోడి కన్నీరే రావిశాస్త్రి కలం సిరాగా మారి దుర్మార్గాల మీద, దౌర్జన్యాల మీద తిరుగుబాటు చేసిందని, ప్రజలకు ద్రోహం చేసే ప్రతి చర్యమీద ఆయన చేసిన సాహిత్య దండయాత్ర అసమాన్యమైనదని, ఆయన శైలి అనుసరించడానికి అసాధ్యమని అన్నారు. సాహిత్యంలో ఎప్పటికీ వెలిగే సూర్యుడు రావిశాస్త్రి గారని, అలాంటి గొప్ప సాహితీవేత్త పేరుమీద సాహిత్య పురస్కారాన్ని అందుకోవడం నా జన్మ సుకృతమని, విశాఖపట్నం సంస్కార హృదయానికి నమస్కారాలు తెలియజేస్తున్నానని అన్నారు. అధిక సంఖ్యలో సాహితీవేత్తలు పాల్గొన్న ఈ సభలో రావిశాస్త్రి సాహిత్య వైభవాన్ని గురించి వేదిక మీదనున్న పెద్దలు అనేక కోణాల్లో వివరించారు.