ప్రమోద్ ఆవంచ కవిత : ఫోటో

By Siva Kodati  |  First Published Jul 29, 2023, 3:04 PM IST

మర్మం తెలియని బంధాలన్నీ గోడకు పేర్చిన ఫోటోలయ్యాయి అంటూ ప్రమోద్ ఆవంచ రాసిన కవిత ' ఫోటో ' ఇక్కడ చదవండి


ఈ హృదయానికి ఎన్ని గాయాల చరిత్రో
తెరిచిన కిటికీల గుండా వీచే మరెన్నో 
జ్ఞాపకాల అలజడులు 
వీధి గుమ్మం స్మృతి గీతాలు ఆలపిస్తూ 
ఇంట్లోని ఒక్కొక్క గదిని తడుతుంది

మర్మం తెలియని బంధాలన్నీ గోడకు 
పేర్చిన ఫోటోలయ్యాయి
ఏ వైపు నుంచి చూసినా విచిత్రం
నవ్వుతూ పలకరిస్తుంది 
ఆ చిత్రం(ఫోటో)

Latest Videos

తిన్నవా కొడుకా అంటూ 
అమ్మ పలకరిస్తుంది
ఈ రోజు ఏం రాసావురా అని 
నాన్న అడుగుతాడు 
అపురూపమైన జ్ఞాపకాలను గుండెలో పదిలపరుచుకొని 
ఆ రోజుని ప్రారంభిస్తాను....

ఉదయాన్నే మీ ఫోటోలకు నమస్కారం చేసేటప్పుడు 
చల్లని గాలి కిటికీలోనుంచి వచ్చి 
నన్ను ఆశీర్వదిస్తుంది
అప్రయత్నంగా వచ్చే ఓ కన్నీటి చుక్క  
నా చెక్కిలిపై ఘనీభవిస్తుంది 
రోజూ పరిగెత్తించే జీవితం ప్రశాంతంగా సాగుతుంది

రోజూ దేవుడి పూజ చేయ్యరా 
అంటుంది అమ్మ..
ఆ దేవుళ్ళను పరిచయం చేసింది నువ్వే 
కదమ్మా అంటా నేను!

అమ్మ ఫోటో ఫ్రేం అద్దంలో నా ప్రతిబింబం...
కను రెప్పల కన్నీటి చెమ్మతో 
మెరుస్తున్న అమ్మ కళ్ళు నా కళ్ళెదుటే ఉంటాయి

నిరంతరం మీ ధ్యాసలో ఉండే నాకు 
ఏ దేవుడు జ్ఞాపకం రాడు 
ఒక్క నిట్టూర్పుతో బరువెక్కిన హృదయంలో
వేల జ్ఞాపకాల ప్రవాహం

ఒక్కొక్కసారి ఊపిరి ఉక్కిరిబిక్కిరి అయి 
శ్వాస ఆడని సమయాన సాక్షాత్తు అమ్మా 
నువ్వే ప్రత్యేక్షమవుతావు......
నువ్వే నన్ను కాపాడుతావు....

సుదూరాన ప్రభాత భేరి వినిపిస్తోంది
నీ పిలుపుతో
మళ్ళీ కొత్త రోజు ప్రారంభమవుతుంది.....
 

click me!