రమాదేవి బాలబోయిన కవిత: నీ ధైర్యమే-నీకు యాంటీబాడీస్

By telugu team  |  First Published May 26, 2021, 4:18 PM IST

కరోనా వైరస్ ను జయించాలంటే యాంటీబాడీస్ ముఖ్యం.  ఆ యాంటీబాడీస్ ఎదుగుదల రమాదేవి బాలబోయిన రాసిన కవితలో చూడండి.
 


ఇదిగో చూడూ
ప్రపంచాన్నే చుట్టుకున్నదది
పంచభూతాలూ వశం చేసుకున్నది
అయినా నిన్నేం చేయలేదు..పక్కా

టీకాలు తీసుకున్నా
మందుబిళ్ళలేసుకున్నా
నీ ఒంట్లోకి జొరబడిందే గానీ
నీ మనసులోకి మాత్రం 
నువ్వు రానీయవని నాకు తెలుసు

Latest Videos

undefined

నీ చుట్టూ మేమంతా
ఆత్మీయతా కౌగిలై పరుచుకునే ఉన్నాంగా
మమ్మల్నొక్కసారి చూడు
నీలో ఉల్లాసవీచికలు విచ్చుకుంటాయి
యాంటీబాడీస్ జాగృతమవుతాయి

అదిగో విను
బాలూగారి కంఠమధురిమలు
వేకువపల్లవులై నిన్ను పలకరిస్తూనే ఉన్నాయిగా
అల్మారా లోనీ నీ మనసు దోచిన కవిత్వాలు
మైమరిపించే నవలా కన్యకలు
ఊ కొట్టించే కథలపొత్తాలు క్యూ కట్టుకుని మరీ
నీ చుట్టూతా ప్రభలబండ్లై తిరుగుతున్నై

కాసేపలా నాలుగు అడుగులు వేయ్ 
చిన్నప్పటి తప్పటడుగుల్లా పడినా 
మైకేల్ జాక్సన్ డాన్స్ లా అనుకో
వాకిట్లో చెట్ల దగ్గరకు వెళ్ళి
ఎవరెక్కువ ఉచ్వాసనిస్వాసాలు తీసుకుంటారో
పోటీ పెట్టుకో...నువ్వే గెలిచావు కదూ..

నిశ్చితయుద్ధంలో 
ఆత్మవిశ్వాసపు అస్త్రంతో సలిపిన
అవిశ్రాంతపోరాటంలో విజేతవే నువ్వోయ్ 

హేయ్ దొంగా...
అదిగో నీ పెదాలపై చిలిపి నవ్వులు పూసాయిగా
వాటినొక్కసారి అడ్డుగా ఉన్న మాస్క్ లోంచే
మీ ఇంటిల్లిపాదీకి పంచేయ్ 
అలా చూడు నీ పెట్స్ 
పిల్లిమొగ్గలేస్థూనో, 
గిరగిరా నీ చుట్టూ తిరుగుతూనో
అక్వేరియంలో వేగంగా ఈదుతూనో
వాటి ఆనందం వ్యక్తం చేస్తున్నాయి
హబ్బ వెయ్యివోల్టుల వెలుగులు
అందరి కళ్ళలో
వెయ్యేనుగుల బలం అందరి తనువుల్లో

ఇన్ని ఆనందాలు
ఆత్మీయతా అనుబంధాలు
మధురిమలొలికే హృదయ సామ్రాజ్యంలో
ప్రాణవాయువై గుండెకవాటాల్లో నాట్యమాడుతుంటే
యాంటిబాడీస్ విత్తుల్ని మనసంతా చల్లుకోవోయ్ 
ధైర్యపు చెట్లు మొలిచి మరొకరికి చేయూతవుతాయి
ఇదిగో...ఇలా చూడు
నువ్వే ప్రేరణంటూ
ఎన్ని విజేతాకావ్యాలు రచించబడతాయో..

click me!