చంద్రకళ దీకొండ కవిత: నిరంతర వ్యూహాలు

By telugu teamFirst Published May 24, 2021, 5:09 PM IST
Highlights

చంద్రకళ దీకొండ రాసిన కవిత 'నిరంతర వ్యూహాలు' ఇక్కడ చదవండి

మనలోనే ఉంటూ
మనతోనే ఉంటూ
కంటికి కనిపించని
కానరాక కబళించే శత్రువులెన్నో...!

మన దేహంపై స్థిరనివాసం
ఏర్పరచుకొని కొన్ని
దేహం లోపల అవయవాల్లో
తిష్ఠ వేసుకుని మరి కొన్ని
కోట్లకొలది శత్రువులతో
పోరాడుతూనే ఉంటాం ప్రతీక్షణం
రోగనిరోధక శక్తి అనే ఆయుధంతో...!

మహమ్మారుల్ని మట్టుపెట్టిన
చరిత్రను నెమరువేసుకుని
పోయే ప్రాణాల్ని లెక్కిస్తూ
బెంబేలుపడి సగం చావక
మనోధైర్యపు మందుతో
పోరాడి గెలిచినవారి
జీవకాంతుల్ని గమనించు...!

కనిపించని శత్రువుపై
ఇనుమడించిన ఆత్మస్థైర్యంతో
అలుపెరుగని పోరాటం చేస్తూనే
ఇంటిలోని పౌష్టికాహారంతో
నిరంతర వ్యూహాలు పన్ని తుదముట్టించే
తుదివరకూ పోరాడు.

click me!